మాటిచ్చా... నిలబెట్టుకున్నా!
‘‘మన బ్లడ్‌కి ఓ కలర్... మన మాటకు ఓ విలువ... మనకు ఓ క్యారెక్టర్ ఉండాలి. ఆ క్యారెక్టర్ కోసం నేనెంత దూరమైనా వెళతా. ‘సరైనోడు’ తర్వాత నాకు పెద్ద ఛాన్సులొచ్చాయి. కానీ, ఎప్పుడో సాయితో సినిమా చేస్తానని నేను మాటిచ్చా. అందుకని ఈ సినిమా చేశా. కానీ, చేసిది ఎలా ఉండాలి? పెద్ద స్థాయిలో ఉండాలి. ఏదో సినిమా చేయాలని చేయలేదు.
నేను చేసిన ఆరు సినిమాల కంటే ఓ పాయింట్ ఎక్కువ వెళ్లా తప్ప... తక్కువ వెళ్లలేదు’’ అన్నారు బోయపాటి శ్రీను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (సాయి), రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా ఆయన దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘జయ జానకి నాయక’ రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా బోయపాటి చెప్పిన విశేషాలు...
⇒ నేను సినిమా తీసిన ప్రతిసారి ‘మీరు ప్రయోగాలు చేయరా? మారరా?’ అనడుగుతారు. ఓ అందమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, మంచి పాటలు జోడించి ‘భద్ర’ తీశా. ఆ తర్వాత నేను చేసిన అందమైన ప్రేమకథే ఈ సిన్మా. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రతి ఒక్క గుండెను చేరే చిత్రమిది. ప్రతి ఒక్కరి మనసుల్ని స్పృశించే చిత్రమిది. కొత్తగానూ, కథానుగుణంగానూ ఉంటుందని ‘జయ జానకి నాయక’ టైటిల్ పెట్టాం. ప్రేమంటే ఏంటి? ఆడపిల్లంటే ఏంటి? వాళ్లను మనమెంత అపురూపంగా కాపాడుకోవాలనేది సినిమాలో చెప్పాను.
⇒ నా ప్రతి సినిమాలోనూ యాక్షన్ హైలైట్ అయినా అవెందుకు ఆడాయంటే.. యాక్షన్‌తో పాటు ఎమోషన్ కనెక్ట్ అయ్యుంటుంది గనుక! ప్రేక్షకుడు కొట్టు అన్నప్పుడే నా హీరో కొడతాడు. ఫైట్ ఫర్ ఫైట్, సాంగ్ ఫర్ సాంగ్ అన్నట్టు నేను తీయను. ప్రతిదీ కథలో భాగంగా ఉంటుంది. ఇందులోనూ అలాంటి ఎమోషనల్ ఫైట్స్ ఉన్నాయి. థియేటర్లో ప్రేక్షకుడు ‘వాణ్ణిప్పుడు హీరో కొట్టాలిరా’ అని ఫీలైనప్పుడే హీరో కొడతాడు. కథలో భాగంగానే పాటలొస్తాయి. అందువల్లే, కథలోంచి పాటలు రావడంతో నా వర్క్ సులభమైందని దేవిశ్రీ చెప్పాడు. అతను మంచి పాటలు ఇవ్వడంతో పాటు సూపర్బ్ రీ–రికార్డింగ్ ఇచ్చాడు.
⇒ ‘లెజెండ్’ తర్వాత బన్నీతో చేస్తున్నప్పుడు ‘తనతో మీకు ఎలా కుదురుతుంది?’ అనడిగారు. బన్నీ బాడీ లాంగ్వేజ్‌కి సరిపడినట్లే ‘సరైనోడు’ తీశా కదా! నాకు దొరికిన మెటీరియల్‌ను దృష్టిలో పెట్టుకుని చేస్తా తప్ప... ఎక్కడికో వెళ్లి చేయను. మైఖేల్ జాక్సన్ దొరికితే డ్యాన్స్ చేస్తా. మైక్ టైసన్ దొరికితే బాక్సింగ్ చేస్తా. సాయి ఓ ముడిసరుకు లాంటోడు. తన ప్లస్సులను ప్లస్ చేస్తూ, మైనస్‌లను తగ్గిస్తూ, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపడినట్లు సిన్మా తీశా.
⇒ ఈ సినిమా బడ్జెట్‌కు తగ్గట్టు బిజినెస్ జరిగింది. నాపై కొన్ని అంచనాలు ఉన్నాయి. కొత్త హీరో అని వాటి కంటే తక్కువగా నేనెందుకు సిన్మా తీస్తా? ఈ సంగతి మా నిర్మాతకు తెలుసు. ఆయనే మా సినిమాకు గ్రేట్ ఎసెట్. డబ్బు కాదు, మంచి సినిమా ముఖ్యమని తీశారు. సేమ్ టైమ్... ఆయన క్రెడిట్ కార్డు ఇచ్చారని ఎలా పడితే అలా వాడలేదు. నన్ను నమ్మి సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లను, నిర్మాతను డిజప్పాయింట్ చేసేలా సినిమా ఉండదు. ‘స్టార్‌తో కాకుండా కొత్త హీరోతో ఈ సినిమా తీయడం వల్ల బిజినెస్ పరంగా మీపై ఒత్తిడి పెరిగిందా?’ అనడిగితే... ‘ఒత్తిడి ఉంటుందని సాయితో సినిమా చేయాలనుకున్నప్పుడే తెలుసు. కానీ, ఒత్తిడి ఫీలవలేదు. ఎందుకంటే... మంచి కథ కుదిరింది’ అన్నారు బోయపాటి.
⇒ మూడు సినిమాలు ఒకే రోజున విడుదల కావడం వల్ల ఇబ్బంది ఏం లేదు. నిజానికి, జూన్ 23న లేదా జూలై తొలి వారంలో మా సినిమా విడుదల కావాలి. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఇంకా వెనక్కి వెళితే మా నిర్మాత నెలకు కోట్ల రూపాయల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి. ఆల్రెడీ ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. సో, రిలీజ్ చేస్తున్నాం. మనకు 1200లకు పైగా థియేటర్లు ఉన్నాయి. అన్నిటిలోనూ మన సినిమాను విడుదల చేసుకోలేం కదా! మా సినిమా 750 నుంచి 800 థియేటర్లలో విడుదలవుతోంది.
⇒ ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ తర్వాత చిరంజీవిగారు ఎప్పుడు? ఏం చేస్తారో? నాకు తెలీదు గానీ.. నేనైతే ఆయన కోసం ఓ కథ రెడీ చేశా. మహేశ్‌బాబుగారితో ఓ సరికొత్త జానర్ కథ గురించి డిస్కస్ చేశా. నాకు డేట్స్ ఎక్కువ కావాలనడిగా. వచ్చే ఏడాది మే–జూన్ నెలల్లో తప్పకుండా బాలకృష్ణగారితో ఓ సినిమా స్టార్ట్ చేస్తా. అఖిల్ కోసం రెండు లైన్లు రెడీ చేశా. అయితే... ఈ సినిమా హడావిడి పూర్తయిన తర్వాత, బాలకృష్ణగారి సినిమా మొదలయ్యేలోపు ఏం చేయాలి? ఏ సినిమా చేస్తే న్యాయం చేయగలను? అనేది చూస్తా!