నన్నెవరూ కష్టపెట్టలేదు
తమిళసినిమా; చిత్రపరిశ్రమలో నన్నెవరూ క ష్టపెట్టలేదు అని అన్నారు అగ్రనటి అనుష్క. కారణం ఏమై ఉంటుందో గానీ ఈ బ్యూటీ ఈ మధ్య తన గతం గురించి, చిత్ర పరిశ్రమ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. స్టార్ నాయకి కాబట్టి ఏమి మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటే ఆ విషయం గురించి కూడా తనదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి-2, సింగం-3 అంటూ ద్విభాషా చిత్రాల్లో నటిస్తూ, మరో వైపు నాగార్జునతో భక్తిరస కథా చిత్రంలోనూ నటిస్తున్న అనుష్క తాజాగా చెప్పిన విషయాలను చూద్దాం. స్త్రీలు సినిమాల్లో నటించడాన్ని కొందరు ఒక మాదిరిగా మాట్లాడుతున్నారు.
ఈ వృత్తిపై వారికున్న అభిప్రాయం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎవరి భావనలు ఎలా ఉన్నా, నా వరకూ సినీ రంగం స్త్రీలకు చాలావరకు సేఫ్. మహిళలు నటనను వృత్తిగా స్వీకరించడానికి భయపడనవసరం లేదు. నిజం చెప్పాలంటే ఆదిలో నేనూ చాలా భయపడ్డాను, ఏడ్చేశాను కూడా. ఒక దశలో పారిపోదామనుకున్నాను. అందుకు కారణం నటనంటే ఏమిటో తెలియకుండానే నేనీ రంగంలోకి వచ్చాను. సినిమా అంటే అస్సలు అవగాహన లేదు. తెలుసుకోవడం, నేర్చుకోవడం మొదలెట్టిన తరువాత అంతా సహజం అయిపోయింది.
అంతేగానీ సినిమా పరిస్థితులు నన్ను కష్టపెట్టలేదు. మంచి, చెడు అన్నవి అన్ని రంగాల్లో ఉంటాయి. అయితే మనం ఎంచుకునే మార్గం, తీసుకునే నిర్ణయాన్ని బట్టి జీవితం ఉంటుంది. నేను ప్రముఖ నటిని కాబట్టి ఇలా అంటున్నాను గానీ, నూతన నటి అయితే ఇలా అంటారా? అని మీరు అనుకోవచ్చు. నేనూ నూతన తారగా వచ్చి ఈ స్థాయికి ఎదిగిన నటినే. ఇప్పుడు నేను సినిమా లేని జీవితాన్ని కలలో కూడా ఊహించలేను. భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టి వారు సినిమాను వృత్తిగా ఎంచుకుంటే నేను కాదనను. సంతోషంగా పరిచయం చేస్తాను. అని అనుష్క పేర్కొన్నారు.