
ఇక్కడకొస్తే మాస్టర్‌ని... అక్కడికెళ్తే డైరెక్టర్‌ని!
‘‘తమన్నాతో ఇంతకుముందు రెండు చిత్రాలు చేసిన అనుభవంతో చెబుతున్నా.. ‘అభినేత్రి’ టైటిల్ తనకు బాగా సూటవుతుంది.
‘‘తమన్నాతో ఇంతకుముందు రెండు చిత్రాలు చేసిన అనుభవంతో చెబుతున్నా.. ‘అభినేత్రి’ టైటిల్ తనకు బాగా సూటవుతుంది. కోన వెంకట్ ఈ కథ విని, ఎగ్జయిట్ అయి నాకు ఫోన్ చేసి చెప్పాడు. నాక్కూడా కథ బాగా నచ్చింది. ప్రభుదేవాగారు హైదరాబాద్‌లో డ్యాన్స్ స్కూల్ పెట్టాలని కోరుకుంటున్నా’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. తమన్నా, ప్రభుదేవా, సోనూసూద్ ప్రధాన పాత్రల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అభినేత్రి’. కోన ఫిలిం కార్పొరేషన్ పతాకంపై బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బిఎల్‌ఎన్ సినిమాతో కలిసి ఎంవీవీ సత్యనారాయణ తెలుగులో, ప్రభుదేవా తమిళ్‌లో, హిందీలో సోనూసూద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ప్రభుదేవా మాట్లాడుతూ- ‘‘నేను హైదరాబాద్‌కొస్తే డ్యాన్స్‌మాస్టర్. ముంబయ్ వెళ్తే డైరెక్టర్ అనే ఫీలింగ్ నాలో ఉంటుంది. ఈ చిత్రకథ నచ్చడంతో తమిళంలో నేనే నిర్మిస్తున్నా. దర్శకుడు విజయ్ చెప్పినట్లు నటిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘ప్రభుదేవాగారికి నేను ఓ కథ చెప్పేందుకు ముంబై వెళ్లా. నా కథ విన్న తర్వాత ఆయనో కథ చెప్పారు. నేను ఎగ్జయిట్ అయి నిర్మించాలనుకున్నా. మూడు భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అని సమర్పకుడు కోన వెంకట్ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ- ‘‘హాలీవుడ్ రైటర్ పాల్ లారెన్, నేను కలిసి రాసుకున్న కథ ఇది. గణేశ్‌గారు నన్ను నమ్మి, ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లేలా సహకరించారు. ఇందులో కొత్త ప్రభుదేవాను చూస్తారు. తమన్నా కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలురాయి అవుతుంది’’ అన్నారు. తమన్నా మాట్లాడుతూ- ‘‘నేను నటించిన మొదటి చిత్రం ‘శ్రీ’ కథ చెప్పేందుకు తొలిసారి కోన వెంకట్‌గారు నన్ను కలిశారు. అప్పట్నుంచి ఆయనతో నా పరిచయం కొనసాగుతోంది. కేవలం పది నిమిషాలు కథ విని, వెంటనే ఒప్పేసుకున్నా. ఇది హారర్ చిత్రం కాదు. ప్రభుదేవా ‘కింగ్ ఆఫ్ డ్యాన్స్ కాదు... గాడ్ ఆఫ్ డ్యాన్స్’ అనాలి’’ అని చెప్పారు. చిత్ర నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ, నిర్మాత డి.సురేశ్‌బాబు, రచయిత విజయేంద్రప్రసాద్, నటుడు సోనూసూద్, హాస్యనటుడు సప్తగిరి పాల్గొన్నారు.