
ఈ స్పందన ఊహించలేదు!
సినిమా పరిశ్రమలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లకి ఎంట్రీ ఈజీగా దొరుకుతుంది. కానీ, కొత్తవాళ్లు అవకాశాలు దక్కించుకోవాలంటే చాలా కష్టం. అలాంటివారి కోసం ‘కొత్తవారితో సినిమా చేస్తాం.. అవకాశం కోసం అప్లై చేసుకోండి’ అని ఓ ప్రకటన ఇస్తే, అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తాయ్. అది కూడా ఎన్. శంకర్ వంటి సీనియర్ డెరైక్టర్ నుంచి ఆహ్వానం వస్తే, ఆసక్తి ఉన్నవాళ్లందరూ అప్లికేషన్లు పంపించుకుంటారు. ఇప్పుడు అదే జరిగింది. అంతా కొత్తవారితో మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తాను తీయనున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి హీరో, హీరోయిన్‌తో పాటు 80 శాతం పాత్రలకు అవకాశం కల్పిస్తానని ఆ మధ్య శంకర్ ప్రకటించారు. మే 31 లోపు అప్లికేషన్లు పంపించాలని కోరారు.
ప్రకటించి నెల అవుతున్న నేపథ్యంలో ఎనిమిదివేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. ‘‘ఈ స్పందన ఊహించలేదు. వాస్తవానికి జూన్‌లోనే షూటింగ్ మొదలుపెట్టాలనుకున్నా. కానీ, అప్లికేషన్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటిని పరిశీలించడానికి టైమ్ పడుతుంది. అన్ని అప్లికేషన్లు ఈ-మెయిల్ ద్వారా వచ్చాయి. జూన్ 15 తర్వాత అందరికీ మెయిల్స్ ద్వారా సమాధానం పంపిస్తాం. ఆ తర్వాత ఆడిషన్స్ చేసి, షూటింగ్ ప్రారంభి స్తాం. భారీ స్థాయిలో స్పందన వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.