నేను అంగీకరించలేదు
Published Tue, Jan 7 2014 4:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
నటి త్రిష దశ తిరిగింది. ఇది కోలీవుడ్ వర్గాలంటున్న మాట. ఆమె దశ ఇప్పుడు తిరగడమేమిటి గత దశాబ్ద్దకాలంగా హీరోయిన్‌గా మనగలుగుతుంటేను అంటారా? ఆ విషయం నిజమే అయినా ఈ మధ్య విజయాలు దోబూచులాడటంతో కాస్త వెనుకపడ్డారు. ప్రస్తుతం జయం రవితో నటిస్తున్న భూలోకం, ద్విభాషా చిత్రం రమ్ మాత్రమే ఈ బ్యూటీ చేతిలో ఉన్నాయి. తాజా గా కన్నడ చిత్ర పరిశ్రమలోకి రంగప్రవేశం చేశారు. అక్కడామె పునీత్ రాజ్‌కుమార్‌తో రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌తో ప్రస్తుతం త్రిష బిజీగా ఉన్నారు.
ఇది హిట్ అయితే అక్కడ ఒక రౌండ్ చుట్టేసే అవకాశం ఉందంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. తమిళంలో త్రిష నటించిన ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో కోలీవుడ్‌లోను ఈ చెన్నై సుందరికి అవకాశాలు తలుపు తడుతున్నాయట. తాజాగా అజిత్ సరసన నటించే అవకాశం వచ్చిందని సమాచారం. వీరం తరువాత అజిత్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా గౌతమ్ మీనన్ త్రిషను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయాన్ని నటి త్రిష ఖండించారు. అజిత్ సరసన తాను నటించడం లేదని, ఆ చిత్రం కోసం తననెవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. అయితే కొత్త అవకాశాలు మాత్రం చాలా వస్తున్నాయని ప్రస్తుతానికి ఏ చిత్రాన్ని అంగీకరించలేదని త్రిష పేర్కొన్నారు.
Advertisement
Advertisement