
ఆ దర్శకుల గురించి తెలుసుకోవడం లేదు
గొప్ప దర్శకుల నుంచి ఈ తరం కళాకారులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్న ఆవేదనను దర్శకుడు ఎళిల్ వ్యక్తం చేశారు. వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఈయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం సరవణన్ ఇరుక్క భయమేన్. నటుడు ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటించి తన రెడ్ జెయింట్ మూవీస్ పతకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా రెజీనా, సృష్టిడాంగే నాయికలుగా నటించారు. సూరి, యోగిబాబు, మన్సూర్ అలీఖాన్, రవి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డీ.ఇమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ చిత్ర పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా సవరణన్ ఇరుక్క భయమేన్ చిత్రం మే 12న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్ చెన్నైలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో చిత్ర హీరో మాట్లాడుతూ సరవణన్ ఇరుక్క బయమేన్ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇందులో సృష్టిడాంగే పాత్ర ఏమి చెప్పినా నమ్మేస్తారన్నారు. తాను ఆమె కలిసి నటించిన ఒక పాటను కేరళాలోని కొచ్చి దాటి సముద్ర తీరంలో చిత్రీకరించామన్నారు. అక్కడ సృష్టిడాంగేకు కేరవన్ వ్యాన్ కూడా లేదు. అంతగా ఆమె సహకరించి నటించారు. ఈ చిత్రానికి ముందు రెండు చిత్రాలను అంగీకరించానని, వాటి కంటే ముందుగా ఈ చిత్రం విడుదల కావడానికి దర్శకుడు ఎళిల్ వేగమే కారణం అని ఉదయనిధి స్టాలిన్ పేర్కొన్నారు. చిత్ర దర్శకుడు ఎళిల్ మాట్లాడుతూ సంగీత దర్శకుడు డీ.ఇమాన్, గీత రచయిత యుగభారతి కలిస్తేనే సూపర్‌హిట్ పాటలు వస్తాయన్నారు. ఇకపోతే మన ముందు తరం దర్శకులు చాలా ప్రతిభావంతులన్నారు. వారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవంగా పేర్కొన్నారు. అయితే అలాంటి వారి గురించి ఈ తరం వారు తెలుసుకోవడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. అది కరెక్ట్ కాదని, ఈ పరిస్థితి మారాలని ఎళిల్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నటి రెజీనా, సృష్టిడాంగే, సూరి, డీ.ఇమాన్, రవి పాల్గొన్నారు.