అమితాబ్ బచ్చన్ గుర్తుకొచ్చారు - కేయస్ రామారావు
‘‘రోహిత్ మంచి ఎనర్జిటిక్ హీరో. తమిళ చిత్రం ‘మౌనగురు’ని తనతో తెలుగులో రీమేక్ చేశాం. ఇందులో రోహిత్ నటన చూస్తుంటే, యాంగ్రీమేన్ అమితాబ్ బచ్చన్ గుర్తొచ్చారు. మంచి యాక్షన్ హీరోగా రోహిత్ అందరికీ దగ్గరవుతాడు’’ అని కేయస్ రామారావు అన్నారు. ఆయన సమర్పణలో నారా రోహిత్, రెజీనా జంటగా తాతినేని సత్య దర్శకత్వంలో ఆర్వీ చంద్రమౌళి (కిన్ను) నిర్మించిన చిత్రం ‘శంకర’. సాయికార్తీక్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను చాముండేశ్వరీనాథ్ ఆవిష్కరించి హీరో నానీకి ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని కేయస్ రామారావు విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నేను భారతీయ టీమ్‌లో క్రికెట్ ప్లేయర్ కావాలని, మంచి సినిమా తీయాలని నాన్నగారి ఆశయం. అందుకే ఈ సినిమా నిర్మించా. ఏడేళ్ల క్రితం ఆయన చనిపోయారు. ఎక్కడున్నా నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది. కేయస్ రామారావులాంటి మంచి ఫిల్మ్ మేకర్ సహాయంతో ఈ సినిమా నిర్మించా’’ అని తెలిపారు.
‘‘మొదట్నుంచీ ఇప్పటివరకు నేను చేసినవి విభిన్నమైన సినిమాలే. ‘శంకర’ కూడా చాలా బాగుంటుంది’’ అని నారా రోహిత్ చెప్పారు. ఇది చాలా మంచి సినిమా అవుతుందని, సాయికార్తీక్ మంచి పాటలు ఇచ్చారని దర్శకుడు పేర్కొన్నారు. ఈ వేడుకలో అతిథులుగా పాల్గొన్న రమేష్‌ప్రసాద్, టీఎల్వీ ప్రసాద్, మంచు మనోజ్, నాని, సుధీర్‌బాబు తదితరులు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.