
న్యూఢిల్లీ: అత్యాచార కేసులో జైలుశిక్ష అనుభవిస్తోన్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ గురించి బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'ఎ డైలాగ్ విత్ జేసీ' అనే టీవీ షోలో ఆమె మాట్లాడుతూ.. తాను చాలాసార్లు గుర్మీత్‌ను కలిసినట్టు తెలిపింది. తనను రాజకీయాల్లోకి చేరమని చెప్పిన వారిలో బాబా ఉన్నాడని చెప్పింది. గుర్మీత్ ఆడవారి జీవితాలతో ఆడుకుంటాడని, మగవారిని నపుంసకుల్ని చేస్తాడని ఊహించలేదని పేర్కొంది. గుర్మీత్‌ను కలవడానికి హనీప్రీత్ ఒప్పుకునేది కాదని చెప్పింది. ఎక్కడ బాబాను పెళ్లి చేసుకుంటానోనని తనను దూరంగా పెట్టేదని వెల్లడించింది.
‘గుర్మీత్‌ను నేను కలవడం హనీప్రీత్‌కు నచ్చేది కాదు. ఆమెకు సవతిని అవుతానేమోనని భయపడేది. హనీప్రీత్ చాలా అందంగా ఉండేది. నేను తనకంటే అందంగా ఉంటానని ఆమె అనుకునేది. గుర్మీత్ తనను తాను కృష్ణుడి అవతారంగా, ఆయన చుట్టూ యువతులను గోపికలుగా భావించేవాడు. ఒకసారి ఆయనను కలిసేందుకు హోటల్‌కు వెళ్లాను. బాబా చుట్టూ ఉన్న యువతులు పొట్టి దుస్తులు వేసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. గుర్మీత్ ఆశ్రమంలో పురుషుల కంటే యువతులు, మహిళలు ఎక్కువగా ఉన్నార’ని రాఖీ సావంత్ తెలిపింది.
గుర్మీత్, హనీప్రీత్ జీవితాలు ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా డిసెంబర్ లేదా జనవరి నాటికి పూర్తవుతుందని చెప్పింది. బాబా జైలు జీవితం గడుపుతుండగా, హనీప్రీత్ మరణించినట్టు తమ సినిమాలో చూపించబోతున్నట్టు వెల్లడించింది. ఈ చిత్రంలో రాఖీ సావంత్ హనీప్రీత్ పాత్రలో నటిస్తోంది.