
ఖుష్బూ
‘‘ప్రతి మనిషి జీవితంలో మానసిక ఒత్తిడి, బాధలు ఉంటాయి. నాకలాంటివి లేవని ఎవరైనా అంటే అబద్ధం చెప్పినట్టే. నేను కూడా చాలా మానసిక ఒత్తిడి ఎదుర్కొన్నా. అలాంటి సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ, ఓ సందర్భంలో బాధ, మానసిక ఒత్తిడిలపై పోరాడాలనే కసి ఏర్పడటంతో నా నిర్ణయం మార్చుకున్నా’’ అన్నారు నటి ఖుష్బూ. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో స్పందించారు. ‘‘ఒకానొక దశలో నా జీవితం ఆగినట్లు అనిపించింది. భయం వేసింది. అప్పుడు ఆత్మహత్యే శరణ్యం అనుకున్నా.
కానీ, నాలోని ధైర్యం నన్ను ఆ నిర్ణయం తీసుకోనివ్వకుండా వెనకడుగు వేసేలా చేసింది. ఆ సమయంలో నా స్నేహితులు దేవదూతల్లా మారారు. నన్ను ఇబ్బంది పెడుతున్న సమస్యల కోసం విలువైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి? అనుకున్నాను. పరాజయాలకు భయపడలేదు. చీకటిని చూసి బెదరలేదు. నన్ను సమస్యలవైపు నడిపిస్తున్న వాటిని చూసి ఏ రోజూ భయపడలేదు. నన్ను ఓడించి, నాశనం చేయాలనుకుంటున్న సమస్యలకంటే నేనే దృఢమైనదాన్ని అని నిరూపించాలని నిర్ణయించుకున్నా. నాలో పోరాడే శక్తి ఉండటంతో ధైర్యంగా ముందడుగు వేశా. పరాజయాల్ని విజయాలుగా మార్చుకోవడం నేర్చుకుని ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా’’ అన్నారు ఖుష్బూ.
Comments
Please login to add a commentAdd a comment