
చెన్నై వరదల దెబ్బ...ఐఫా- ఉత్సవమ్ వాయిదా
తమిళనాడును, ముఖ్యంగా చెన్నై నగరాన్ని ముంచెత్తిన వానలు, వరదల దెబ్బ సినిమా కార్యక్రమాల మీద కూడా ప్రభావం చూపింది. ఈ శుక్రవారం నుంచి ఆదివారం దాకా మూడు రోజుల పాటు జరగాల్సిన దక్షిణ భారత సినిమా అవార్డుల వేడుక ‘ఐఫా - ఉత్సవమ్’ నిరవధికంగా వాయిదా పడింది. జల విలయంలో ఇరుక్కొని, తీవ్ర కష్టనష్టాల్లో ఉన్న చెన్నై ప్రజలకు సంఘీభావంగా ఈ సినిమా వేడుకను వాయిదా వేయాలని ‘ఐఫా - ఉత్సవమ్’ కార్యనిర్వాహక బృందం నిర్ణయించింది.
చెన్నై ప్రజలకు సినీ సంఘీభావం
నిజానికి, దాదాపు దశాబ్దిన్నరగా కేవలం హిందీ చిత్ర పరిశ్రమకే పరిమితమైన ‘ఐఫా’ ఉత్సవాన్ని దక్షిణాదికి విస్తరింపజేయడం ఇదే తొలిసారి. దక్షిణాది సినీ పరిశ్రమలకు సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవంగా తొలిసారి తలపెట్టిన ఈ ‘ఐఫా-ఉత్సవమ్’ ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. అయితే, తమిళనాట వరదల్లో భారీగా జన నష్టం, ఆస్తి నష్టం సంభవించి, లక్షల మంది నిరాశ్రయులు కావడంతో దక్షిణాది సినీ పరిశ్రమ పెద్దలతో సహా సంబంధీకులు అందరితో చర్చించి, ఉత్సవాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ‘ఐఫా’ (ఐ.ఐ.ఎఫ్.ఎ) మేనేజ్‌మెంట్ పక్షాన ఈ అవార్డులు నిర్వహిస్తున్న ‘విజ్‌క్రాఫ్ట్ ఇంటర్నేషనల్’ ఫౌండర్ - డెరైక్టర్ ఆండ్రూ టిమ్మిన్స్ బుధవారం ఈ సంగతి పత్రికాముఖంగా ప్రకటించారు.
బాధితులకు విరాళాల సేకరణతో వచ్చే జనవరిలో!
రానున్న కొత్త సంవత్సరం జనవరిలో ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రస్తుతానికి భావిస్తున్నారు. చెన్నై నగరానికి అండగా నిలిచే రీతిలో భారీయెత్తున విరాళాల సేకరణను కూడా కలుపుకొని ఈ రాబోయే ఉత్సవాన్ని జరపాలని యోచిస్తున్నారు. ‘‘చెన్నైలోని వరద బీభత్సం మా మనసును కలచివేసింది. ఈ విషాదం నుంచి అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. సినీ పరిశ్రమలోని వారందరితో కలసి ఇవాళ చెన్నై నగరంలోని బాధితులకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమవాళ్ళందరం కలసి ‘ఐఫా -ఉత్సవమ్’ను తుపాను బాధితులకు ఫండ్ రైజర్‌గా నిర్వహిస్తాం’’ అని ఆండ్రూ టిమ్మిన్స్ పేర్కొన్నారు.