అభిమానులూ... నా మాట వినండి!
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో ఫంక్షన్ చేయాలా, వద్దా అనే సందిగ్ధంలో నిన్నటి వరకూ ఉన్నాం. మామూలుగా అయితే పాటలను ఓ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసేద్దామనుకున్నాం’’ అని హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం నాడు హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరగనుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ ఆడియో వేడుకకు పాస్‌లు ఉన్నవాళ్లే రావాలని కోరుతున్నానని చెప్పారు. ఆయన మాట్లాడుతూ-
‘‘నేను బయట అభిమానుల సమక్షంలో ఫంక్షన్లు నిర్వహించుకునే సంస్కృతికి బద్ధవ్యతి రేకిని. కానీ సినీ వ్యాపార విధానాలకు నేనూ లొంగక తప్పలేదు. ఈ ఆడియో ఫంక్షన్ నోవాటల్‌లో చేస్తామని పోలీస్ పర్మిషన్ అడిగినప్పుడు భద్రతాపరమైన సమస్యలున్నాయ న్నారు. మొదట నిజామ్ గ్రౌండ్స్‌లో చేద్దామనుకున్నాం. కానీ పోలీసులు అక్కడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. సినీ ఫంక్షన్‌గా మొదలై తర్వాత ఏ రూపం దాలుస్తుందోనని భయమేసింది. అందుకే నోవాటెల్‌లోనే చేస్తున్నాం. నిర్మాత శరత్ మరార్ నోవాటెల్‌లోని విదేశీ ప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న భద్రతా చర్యలను పోలీసులకు వివరించి, అనుమతి పొందారు. అందుకే, పాస్‌లు ఉన్నవాళ్లే రావాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. లేనివాళ్లు దయచేసి అక్కడ గూమిగూడవద్దని కోరుతున్నా’’ అన్నారు.
‘‘అభిమానులతో పాటు అసాంఘిక శక్తులు కూడా ఫంక్షన్‌కి వచ్చే అవకాశం ఉంది. అందుకే పాస్‌లు ఉన్నవాళ్ళే తప్ప, మిగిలినవారు రావద్దని ఫ్యాన్స్‌కు ప్రేమతో చెబుతున్నా. వాళ్లు కచ్చితంగా వింటారనుకుంటున్నా’’ అని పవన్‌కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.కూ, మంత్రులు హరీశ్‌రావు, కె.టి.ఆర్‌ల సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుకకు చిరంజీవి అతిథిగా రానుండడం గురించి ప్రస్తావిస్తూ, ‘‘గతంలో ‘గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుకకు కూడా అన్నయ్య చిరం జీవి వచ్చారు.
‘జానీ’ తర్వాత నేను కథ-స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం కావడంతో మళ్లీ అన్నయ్యను ఈ వేడుకకు అతిథిగా పిలిచా’’ అన్నారు. ‘‘ఈ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అంతా ఖమ్మం-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరుగుతుంది. దానికి కాస్త హిందీ టచ్ ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని ఈరోస్ వాళ్లు డబ్బింగ్ చేస్తామని ముందుకు వచ్చారు. ఈ హిందీ వెర్షన్‌లో నేను ఏ పాటా పాడలేదు. నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పలేదు’’ అని పవన్ వివరించారు. సినిమాల నుంచి తప్పుకుంటారని వస్తున్న వార్తలకు స్పందిస్తూ- ‘‘ ‘ఖుషి’ తర్వాత నాలుగు హిట్స్ వస్తే సినిమాలు మానేద్దామనుకున్నా. ఇప్పుడైతే నాకా ఉద్దేశం లేదు’’ అని వివరణ ఇచ్చారు.