
కాంట్రవర్సీల్లోకి నన్ను లాగకండి బాబూ!
ఇవాళ తెలుగు సినిమా స్టార్ రైటర్ అంటే... గుర్తొచ్చే పేరు - కోన వెంకట్. పాత తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే,
ఇవాళ తెలుగు సినిమా స్టార్ రైటర్ అంటే... గుర్తొచ్చే పేరు - కోన వెంకట్. పాత తరానికి అర్థమయ్యేలా చెప్పాలంటే, రాజకీయ దిగ్దంతుడిగా ఎదిగిన తొలి తరం సినీ హీరో కోన ప్రభాకరరావు మనవడు. వర్మ శిష్యుడిగా ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడడమే కాదు... ముఖం మీదే చెప్పడమూ కోన స్టైల్. దర్శకులను కాదని రచయితల పక్షం నిలబడినా, ‘బ్రూస్‌లీ’కి తాను రాసిన సీన్లు దర్శకుడు శ్రీను వైట్ల తీయలేదని రచ్చకెక్కినా - అవన్నీ కోన మార్క్ నిజాయతీ. మరో మాటలో... మీడియాలో యమా కాంట్రవర్సీ. తాజాగా హీరో నిఖిల్‌తో బీహార్ నేపథ్యంలో కిడ్నాప్ డ్రామా థ్రిల్లర్ ‘శంకరాభరణం’ చిత్రానికి అన్నీ తానే అయి, డిసెంబర్ 4న జనం ముందుకు తెస్తున్నారాయన. ఆ సందర్భంగా కోన మాటల ఊటలో నుంచి చేదుకున్నవాళ్ళకు చేదుకున్నంత...
‘శంకరాభరణం’ అంటూ మీరు తీస్తున్న కిడ్నాప్ కథకు బీజం ఏంటి?
2000లో అనురాగ్ కశ్యప్ రచయితగా, ఇ.నివాస్ దర్శకత్వంలో వర్మ నిర్మించిన ‘శూల్’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ని. బీహార్ నేపథ్యంలోని ఆ కథను అక్కడే తీద్దామంటే కుదరలేదు కానీ, ఆ ఊళ్ళన్నీ తిరిగా. కిడ్నాపింగ్ అక్కడ ఒక పెద్ద పరిశ్రమ. అది చూసి, ఈ కథకు బీజం పడింది. ‘ఫస్ గయేరే ఒబామా’ చూశాక, ఒక స్కీవ్‌ు వచ్చింది. అవన్నీ కలిపి, ‘శంకరా భరణం’ కథ అల్లాను. సరిగ్గా ఆడితే రూ. 40 కోట్లొచ్చే స్క్రిప్ట్ ఇది.
మరి, అంత మంచి స్క్రిప్ట్ స్టార్‌సతో కాకుండా నిఖిల్‌తో చేశారేం?
చాలామంది స్టార్‌స వాళ్ళ ఇమేజ్ అనే బ్యాగేజ్‌తో వస్తారు. ఫ్యాన్‌స అంచనాలు సరేసరి. అందుకే, వాళ్ళు నటిస్తే పాత్రలు కాకుండా, వాళ్ళే కనపడుతుంటారు. కొత్త రకం స్క్రిప్ట్‌లు ఎంచుకొనే నిఖిల్ లాంటి హీరో దీనికి కరెక్ట్. నిఖిల్ కెరీర్‌కు ఇది ఒక ‘దూకుడు’ లాంటి హిట్టవుతుంది.
హీరోయిన్ అంజలితో గెస్ట్ రోల్ వేయించగలిగారే?
నిజానికిది గెస్ట్‌రోల్ కాదు. సినిమాలోని నలుగురు విలన్లలో ఆమె ఒకరు. ‘బ్యాండిట్ క్వీన్ ఆఫ్ బీహార్’ అనుకోండి. 15 నిమిషాల పాత్ర అది.
హీరోయిన్ వేషాలేసే అమ్మాయిని విలన్‌గా ఏం చెప్పి ఒప్పించారేంటి?
(నవ్వేస్తూ...) ఏం చెబుతామండీ... చేస్తే బాగుంటుందని చెబుతాం. ఇలాంటి పాత్రలేస్తే, ఒకప్పుడు శ్రీదేవి, విజయశాంతిలాగా ఆమెకు కూడా కొన్నేళ్ళు పవర్‌ఫుల్ పాత్రలు వస్తాయి. ఆ మాటే చెప్పా.
మొత్తానికి, ఈ సినిమాకు మీరు చాలానే కష్టపడ్డట్లున్నారు?
అవును. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, సమర్పణ, దర్శకత్వ పర్యవేక్షణ చేశా.
అన్నీ మీరే చేస్తే... దర్శకుడెందుకు? అతణ్ణి ఏమైనా చేయనిచ్చారా?
(నవ్వుతూ...) చెప్పడానికి యాక్షన్... కట్ ఉందిగా! రైటర్‌గా నేను సీన్ రాసి, అంతవరకు చూడడం వేరు. లొకేషన్, కాస్ట్యూవ్‌ు్స, సమన్వయం - ఇలా డెరైక్టర్ బాధ్యతలు చాలానే. అవన్నీ ఉదయ్ నందనవనమ్ బాగా చేశాడు. రైటర్‌గా ఆల్రెడీ మైండ్‌లో చూసిన సినిమానే యూనిట్ అంతా మనసులో చూస్తూతీస్తే హిట్. లేకపోతే, రిజల్ట్ ‘బ్రూస్‌లీ’లా ఉంటుంది.
రచయితగా పేరేసినా, మీరు రాసిన సీన్లు ‘బ్రూస్‌లీ’కి వాడలేదనా?
72 సీన్లు రాస్తే, యథాతథంగా తీసుకోలేదు. కొన్ని స్టార్టింగ్, కొన్ని మధ్య లో, కొన్ని ఎండింగ్ తీసుకున్నారు. నేను ఫీలయ్యా. ‘దూకుడు’ తర్వాత మళ్ళీ మా కాంబినేషన్ అని నమ్మిన ప్రేక్షకులు, బయ్యర్లు నష్టపోయారు.
మీరు రాసినవన్నీ తీయాలా? పైగా, మీరేదో నష్టపరిహారం కేసు వేస్తారని వార్త!
నేను రాసింది ‘భగవద్గీత’ కాదు. సుప్రీంకోర్‌ట తీర్పు కాదు. ఏం తీయా లనేది దర్శకుడి ఇష్టం. కానీ, రాసింది లేకుండా రచయితగా పేరు వేయడంతో నా పేరు దెబ్బతింది. అందుకే, నేను రాసిన సీన్లన్నీ బయటపెడతా. ఇక, కేసంటారా... ఆ వార్త వట్టి పుకారు.
‘బాద్‌షా’ అప్పుడే మీ మధ్య గొడవైందిగా?
అవును. తర్వాత ఒక బలహీన క్షణంలో తప్పయిపోయిందని కన్నీళ్ళు పెట్టుకుంటే, నేనూ కన్నీళ్ళు పెట్టుకున్నా. ఎంతైనా క్రియేటివ్ పీపులందరం ఎమోషనలే కదా. కలిశాం. తీరా, ఇప్పుడిలా. సినిమా అయినా, సంసారమైనా ఒక వ్యక్తి కన్విక్షన్. మిగిలినవారి కంట్రిబ్యూషన్. కానీ అవగాహన లేకపోతే, కొనసాగలేం.
ఇంతకీ, శ్రీను వైట్లతో ఇప్పుడు మీ రిలేషన్?
వెంటిలేటర్‌పై ఉంది. ఈ మధ్య మాట్లాడలేదు.
భవిష్యత్‌లో కలసి పనిచేసే అవకాశం ఉందా?
చేయచ్చు... చేయకపోనూ వచ్చు!
మీరే రాసిన ‘అఖిల్’ గురించి మాట్లాడరేం?
‘బ్రూస్‌లీ’కి మూలకథ శ్రీను వైట్లదైతే, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నేను రాసినవి. కానీ, ‘అఖిల్’కి కథ (వెలుగొండ శ్రీనివాస్), స్క్రీన్‌ప్లే నావి కావు. నేను వట్టి డైలాగ్ రైటర్‌ని. కాబట్టి నాకు బాధ్యత ఉండదు. ఆల్రెడీ రచయిత, దర్శకుడు చెప్పింది రాసివ్వడమే. మహా అయితే, వాళ్ళకు సలహా, సూచన చెప్పగలం. అంతకు మించి తల దూర్చకూడదు. అయినా గతం గతః. శంకరాభరణం’తో హిట్ సాధించాలి. ఎందుకంటే, ఈ ఇండ్రస్ట్రీ నిర్దాక్షిణ్యమైనది. సక్సెస్ ఇస్తేనే ఇక్కడ మనుగడ.
ఇంతకీ పరుచూరి బ్రదర్స్ తర్వాత తరంలో మీరే నంబర్ వన్ రైటర్ అనచ్చా?
అలాంటిదేమీ ఉండదండీ. ఇదొక పీరియడ్. అంతే! ఇప్పుడు నాలుగైదు సినిమాలకు రాస్తూ, స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తూ ఉండేసరికి పేరు తరచూ వినిపిస్తోంది. రెండేళ్ళు సెలైంట్‌గా ఉంటే, అంతా మర్చిపోతారు.
‘శంకరాభరణం’ మీ కెరీర్‌కే మలుపంటున్నారు. ఏమిటంత?
బి, సి సెంటర్ల మాస్ సినిమాలు, ‘ఎ’ సెంటర్ల మల్టీప్లెక్స్ సినిమాలు - ఏవి తీయాలనే సందిగ్ధంలో తెలుగు సినిమా ఉంది. ప్రయోగాత్మకంగా చేస్తున్న ఈ న్యూజనరేషన్ సినిమా సక్సెసైతే, నా కెరీర్ కొత్తదోవ తొక్కుతుంది.
అంటే... చిత్ర నిర్మాణం కొనసాగిస్తారా? దర్శకత్వం కూడా చేస్తారా?
తప్పకుండా! వచ్చే ఏడాది మూడు సినిమాలు నిర్మించాలని ప్లాన్. రిలయన్స్ వాళ్ళు 3 సినిమాల డీల్ అడుగుతున్నారు. క్రియేటివ్ రెస్పాన్సిబి లిటీ నాది, ఫైనాన్షియల్ హెల్పంతా వాళ్ళది. అప్పుడు స్టార్స్‌కానివాళ్ళతో చేయగలుగుతా. ఘోస్ట్ డెరైక్షన్ కాకుండా, నేనే డెరైక్షన్ కూడా చేస్తా.
మీరే గతంలో డెరైక్టర్‌నైతే ఏడాదికి ఒకటే, రైటరైతే 4 సినిమాలు చేయచ్చన్నారు!
నిజమే. కానీ, దానివల్ల ఇప్పుడు డ్యామేజ్ ఎక్కువ కనపడుతోంది. మనం రాసినదాన్ని వాళ్ళ ఇష్టమొచ్చినట్లు వాళ్ళు తీయడం వల్ల రైటర్‌గా పేరు పోతోంది. రైటర్‌గా నాలుగు సినిమాలు చేస్తే, పదిమందికీ పని దొరుకు తుందనుకుంటే, చివరకు మనకు పనిపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే 50 సినిమాల దాకా రచన చేశా. ఇక, రాశి కన్నా వాసి ముఖ్యం.
కానీ చాలా స్క్రిప్ట్‌లు సిద్ధం చేశారట! శ్రీదేవి లేటెస్ట్ హిందీ ఫిల్మ్ మీ కథేనట!
అవును. ‘శంకరాభరణం’ బీహార్ నేపథ్యంలో నడిచే థ్రిల్లర్ అయితే, బోనీ కపూర్ నిర్మాతగా శ్రీదేవి నటిస్తున్న హిందీ చిత్రం మరో రకమైన థ్రిల్లర్. రవి ఉద్యావర్ అనే యాడ్ ఫిల్మ్‌మేకర్ దర్శకుడు. అలాగే, హైదరాబాద్ సిటీ నేపథ్యంలో డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథతో ‘పౌడర్’ అనే కథ చేశా.
ఆ మాటకొస్తే, డ్రగ్స్ వినియోగదారుల్లో సినిమా వాళ్ళే ఎక్కువేమో?
సినిమావాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి, వాళ్ళ ముందు కెమేరాలు పెడతారు. ఖరీదైన ఈ డ్రగ్స్ కొనే కస్టమర్లలో సినిమా వాళ్ళు 5 శాతం లోపే!
కామెడీ మిళాయించి కథలు రాసే మీరు థ్రిల్లర్స్ ఎంచుకోవడం...
ఎంటర్‌టైనింగ్ సినిమాలు చేయడం నాకిష్టం. కానీ ఎంటర్‌టైన్‌మెంట్‌కీ, కామెడీకీ తేడా ఉంది. ప్రేక్షకులు ఆస్వాదిస్తూ, తెర మీది విషయంతో ఎంగే జయ్యేవన్నీ ఎంటర్‌టైన్‌మెంటే. కామెడీ, థ్రిల్లర్, ఛేజ్‌లూ ఎంటర్‌టైనింగే.
దేశమంతా ఇప్పుడు ఎంగేజవుతున్న టాపిక్ ‘అసహనం’. దానిపై మీ వ్యాఖ్య?
దానిపై నా కామెంటెందుకు? అసలే నా సినిమా రిలీజ్‌కు ఉంది.
అదేంటి... దానిపై మీకంటూ ఒక ‘స్టాండ్’ (వైఖరి) ఏమీ లేదా?
ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ప్రతి అంశం మీదా ఒక వైఖరి ఉంటుంది. కానీ, అన్నీ బయటపడి చెబుతామా? చెబితే, కొంపలంటుకుంటాయి (నవ్వులు).
ఆమిర్‌ఖాన్‌ను మీ గురువు వర్మ విమర్శించారు! పూరి జగన్నాథ్ సమర్థించారు!
(నవ్వుతూ...) వర్మ దేవుణ్ణే విమర్శించారు. ఆయనకు ఆమిర్ ఓ లెక్కా! పూరి జగన్నాథ్ ట్వీట్ అంటారా... ఆయన సినిమా రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఫరవాలేదు. కాంట్రవర్సీల్లోకి నన్ను లాగకండి. నలుగురినీ నా సినిమా చూడనివ్వండి బాబూ!
ఇప్పటి దాకా మనం మాట్లాడుకున్నవన్నీ కాంట్రవర్సీలేనేమో!
(నవ్వుతూ) కాదు. నిజాలు.
‘శంకరాభరణం’ ఓ క్లాసిక్. ఆ పేరు మీ థ్రిల్లర్‌కి ఏ ధైర్యంతో పెట్టారు?
ఆ టైటిలెందుకు పెట్టామన్నది హాలులోకొచ్చిన 5 నిమిషాలకే అర్థమై పోతుంది. నిజానికి, ముందు ఆ టైటిల్ అనుకోవడానికి ప్రత్యేక కారణం, జస్టిఫికేషన్ లేవు. అయితే, అనుకున్నాక కథలో జస్టిఫై చేశాం. విలువైన దేని నైనా కిడ్నాప్ చేసే బీహార్ నేర సంస్కృతి నేపథ్యంలో ప్రయోగాత్మక సినిమా కాబట్టి, జనంలో నానిన టైటిలైతే, బాగుంటుందని పెట్టాం.
అప్పటి ఆ ‘శంకరాభరణ’ సృష్టికర్త కె. విశ్వనాథ్ గారేమీ అనలేదా?
నేనింత వరకు బూతును అడ్డం పెట్టుకొని, సినిమాలు రాయలేదు. కాబట్టి, విశ్వనాథ్ గారు ఏమీ అనలేదు. ఆయన అడక్కపోయినా, నేనే కథ చెప్పా. ఆడియోకు వచ్చి, తొలి పాట రిలీజ్ చేయమంటే చేశారు.