వినాయక్ నన్ను డెరైక్షన్ చేయొద్దన్నారు! | kona venkat Special interview | Sakshi
Sakshi News home page

వినాయక్ నన్ను డెరైక్షన్ చేయొద్దన్నారు!

Published Tue, Jul 1 2014 12:11 AM | Last Updated on Mon, Aug 20 2018 7:19 PM

వినాయక్ నన్ను డెరైక్షన్ చేయొద్దన్నారు! - Sakshi

వినాయక్ నన్ను డెరైక్షన్ చేయొద్దన్నారు!

సూటిగా సుత్తిలేకుండా మాట్లాడటం కోన వెంకట్ ప్రత్యేకత. ఆయన సినిమాల్లో డైలాగులు కూడా అలాగే ఉంటాయి. నిర్మాతగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, గీత రచయితగా మారి,

 సూటిగా సుత్తిలేకుండా మాట్లాడటం కోన వెంకట్ ప్రత్యేకత. ఆయన సినిమాల్లో డైలాగులు కూడా అలాగే ఉంటాయి. నిర్మాతగా పరిశ్రమలోకి అడుగుపెట్టి, గీత రచయితగా మారి, కాలక్రమంలో మాటల రచయితగా, కథకునిగా ఎదిగి అనతికాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రతిభాశాలి కోన వెంకట్. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఆయన నిర్మాణంలో ‘గీతాంజలి’ చిత్రం రూపొందుతోంది. ఈ నేపథ్యంలో కోనతో ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
 
 ‘తోకలేని పిట్ట’(1996)తో నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. పద్దెనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు నిర్మాణంలోకి అడుగుపెట్టి ‘గీతాంజలి’ చేశారు. కారణమేంటి?
 కథ అంతలా కట్టిపడేసింది. సగటు ప్రేక్షకునికి కావాల్సిన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి. పైగా.. నేను ఫ్యాక్షన్ కామెడీ చేశాను. యాక్షన్ కామెడీ చేశాను. మాఫియా కామెడీ చేశాను. హారర్ నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకూ కామెడీ చేయలేదు. ఇది నాక్కూడా కొత్త అనుభవం. పైగా ప్రస్తుతం హారర్ కామెడీ హవా నడుస్తోంది. కాంచన, ప్రేమకథాచిత్రమ్ విజయాలే అందుకు నిదర్శనాలు. ఇందులో హారర్, కామెడీ మాత్రమే కాదు. అద్భుతమైన భావోద్వేగాలుంటాయి. అందుకే దర్శకుడు రాజకిరణ్ ఈ కథ నా వద్దకు తేగానే.. వెంటనే చేసేయాలని నిర్ణయించుకున్నా. నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణగారిని కూడా నేనే పిలిపించి, నిర్మాణానికి శ్రీకారం చుట్టాను. కథలో కొన్ని మార్పులు చేసి, కథనం, సంభాషణలు కూడా నేనే అందించాను.
 
 అంతగా నచ్చినప్పుడు మీరే డెరైక్షన్ చేయొచ్చుగా?
 ఈ కథ ద్వారా దర్శకుడవ్వాలనేది రాజకిరణ్ కోరిక. నా స్వార్థం కోసం ఒకరికి అన్యాయం చేయలేను. నా డెరైక్షన్ గురించి చాలా రోజులుగా చెబుతూనే ఉన్నాను. కానీ.. అది కార్యరూపం దాల్చడం లేదు. దానికి కారణం.. నా చేతిలో ఉన్న సినిమాలు, నన్ను నమ్ముకున్న దర్శక, నిర్మాతలే. ఉన్న కమిట్‌మెంట్లను పూర్తి చేసుకునేలోపు కొత్త కమిట్‌మెంట్లు వచ్చిపడుతున్నాయి. దాని కారణంగానే ఈ విరామం. ఎవరినీ కాదనలేని పరిస్థితి నాది. ఒకసారి వినాయక్ అన్నారు. ‘నువ్వు దర్శకత్వం వైపు వెళ్లొద్దు. రైటింగ్‌లో ఉంటే ఎక్కువ సినిమాలు రూపొందుతాయి. వేలాది సినీ కళాకారులకు ఉపాధి దొరుకుతుంది. డెరైక్షన్ వైపు చూశావంటే... నువ్వు కూడా ఏడాదికి ఒక సినిమా చేయాల్సి వస్తుంది. అది పరిశ్రమకు మంచిది కాదు’ అని. ఆ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. అందుకే.. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసి పంపుతున్నాను. ఏది ఏమైనా ఈ ఏడాది చివర్లో మాత్రం నా సినిమా ఉంటుంది.
 
 అంటే అందరూ అంటున్నట్లు పరిశ్రమలో రచయితల కరువు ఉందన్నది నిజమేనా?
 రైటర్లు వస్తున్నారు కానీ, నమ్మకాన్ని సంపాదించుకోలేకపోతున్నారు. వారెంత మంచి కథ చెప్పినా వినడానికి మన దర్శక, నిర్మాతలు సిద్ధంగా లేరు. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లు అదే కథ నేను చెబితే వింటారు. అదే ప్రాబ్లమ్. అందుకే ‘టాలెంట్ ఉంది’ అనిపిస్తే వారిని సహాయకులుగా తీసుకుంటాను. వారికి బ్రేక్ రావడానికి కృషి చేస్తున్నా. హరీశ్‌శంకర్, బాబి అలా వచ్చినవారే.
 
 మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని కథలున్నాయి. ఏ ఏ సినిమాలు చేస్తున్నారు?
 కావల్సినన్ని కథలున్నాయి. సునీల్ హీరోగా ‘దిల్’రాజు నిర్మించనున్న చిత్రానికి కథ ఇచ్చాను. ‘అల్లుడు శీను’కి నేను, బాబీ కలిసి కథ ఇచ్చాం. రామ్ ‘పండగ చేస్కో’, గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్ చిత్రాలకు రచన నాదే. రీసెంట్‌గా నేను, గోపీ మోహన్ కలిసి రామ్‌చరణ్‌కి ఓ కథ రెడీ చేశాం. చరణ్‌కి కూడా ఆ కథ బాగా నచ్చింది. ఇంకా డెరైక్టర్ ఫిక్స్ అవ్వలేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది జనవరిలో ఆ సినిమా సెట్స్‌కి వెళ్తుంది. ఇక బాలీవుడ్ విషయానికొస్తే... సల్మాన్‌ఖాన్ ‘నో ఎంట్రీ’ సీక్వెల్‌కి కథ అందించాను. అభిషేక్ బచ్చన్ సినిమాక్కూడా కథ ఇచ్చాను. ఆ సినిమా అక్టోబర్ నుంచి మొదలవుతుంది. ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ తర్వాత శ్రీదేవి చాలా కథలు విన్నారు. కానీ... ఆమెకు ఏదీ నచ్చలేదు. ఇటీవలే ఆమెకు ఓ కథ చెప్పాను. అది ఆమెకు బాగా నచ్చింది. అక్టోబర్ నుంచి ఆ సినిమా షూటింగ్ ఉంటుంది.
 
 శ్రీదేవి హీరోయిన్‌గా రూపొందే లేడీ ఓరియెంటెడ్ సినిమాకు మీరు దర్శకత్వం వహించనున్నట్లు, అలాగే... త్వరలో సల్మాన్‌ని కూడా డెరైక్ట్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి...
 నేను వారి సినిమాలకు కథను అందిస్తున్నానని చెప్పాను. దానికి డెరైక్ట్ చేస్తున్నట్లు రాసేశారు. అందులో నిజం లేదు. వారి సినిమాకు కథకుణ్ణి మాత్రమే.
 
 పవన్‌కల్యాణ్‌తో సినిమా అన్నారు. అది ఎందాకా వచ్చింది?
 ‘నా దర్శకత్వంలో మీరు నటించాలి’ అని ఆయన్ను అడిగాను. ‘కథ నచ్చితే ఎవరితో పనిచేయడానికైనా నేను సిద్ధం. అలాంటిది నీతో పనిచేయనా! మంచి కథ తీసుకురా’ అన్నారు. అన్నీ కుదిరితే... త్వరలోనే పవన్‌తో నా సినిమా ఉంటుంది.
 
 శ్రీనువైట్ల నుంచి విడిపోయాక మీ కెరీర్‌లో వచ్చిన మార్పులేంటి?
 మార్పులెందుకుంటాయి. ఒక డ్రైవర్ ఒక చోట మానేసి మరో చోట చేరతాడు. వాడి పనిలో ఏమైనా మార్పు ఉంటుందా? యజమాని మారతాడంతే, స్కిల్ మారదు. నా విషయంలోనూ అంతే... ఎక్కడ పనిచేసినా నా స్కిల్ మారదు. నా ప్రతిభలో కూడా మార్పు రాదు. 2004లో ‘వెంకీ’తో మా ప్రయాణం మొదలైంది. ప్రతి రిలేషన్‌కీ ఓ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మాది ‘బాద్‌షా’తో ముగిసింది అంతే. ఆయన లేకుండా నేను బతకగలను... అలాగే నేను లేకుండా ఆయనా బతకగలరు. శ్రీనువైట్ల నుంచి బయటకు వచ్చాకే... నా నుంచి ‘బలుపు’ వచ్చింది. సో... ఎవరి ప్రయాణం ఆగదు. నేను ఇప్పటికీ చెప్పేది ఒక్కటే. శ్రీను వైట్లపై నాకెలాంటి పగ లేదు. తను కూడా బాగుండాలని కోరుకుంటాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement