హిందీ అగ్నినక్షత్రంలో ధనుష్
నటుడు ధనుష్ బహుముఖ ప్రజ్ఞాశాలి మాత్రమే కాదు బహు భాషా నటుడు కూడా అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనలో నటుడితో పాటు గాయకుడు, గీత రచయిత, నిర్మాత ఉన్నారు. త్వరలో దర్శకుడిగా కూడా మారనున్నట్లు సమాచారం.ఈ విషయాన్ని ఇటీవల ప్రముఖ దర్శకుడు కేఎస్.రవికుమార్ ఒక కార్యక్రమంలో పేర్కొన్నారన్నది గమనార్హం.
తమిళంలో ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ధనుష్ రాంజన, షమితాబ్ చిత్రాల్లో హిందీలోనూ మంచి గుర్తింపు పొందారు. తాజాగా మరోసారి బాలీవుడ్‌కు పయనం కానున్నారని తెలుస్తోంది. అగ్నినక్షత్రం హిందీ రీమేక్‌లో ఇద్దరు కథానాయకుల్లో ఒకరిగా నటించడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం సూపర్‌హిట్ చిత్రాల్లో అగ్నినక్షత్రం ఒకటి. ప్రభు,కార్తీక్, అమల, నిరోషా జంటలుగా నటించిన ఈ చిత్రం 1988లో విడుదలై ఘన విజయం సాధించింది.
అలాంటి చిత్రం 28 ఏళ్ల తరువాత హిందీలో రీమేక్ కానుంది. దీన్ని బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో ముందుగా యువ నటులు నిక్కీకౌసల్, హర్షవర్దన్‌లను హీరోలుగా నటింపజేయాలని నిర్ణయించారట. అయితే కాల్‌షీట్స్ సమస్య కారణంగా నిక్కీకౌసల్ ఇందులో నటించడం లేదట. ఆ పాత్రలో ధనుష్ నటించనున్నట్లు సమాచారం. అగ్నినక్షత్రం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్న మాట నిజమేనని దర్శకుడు బివజాయ్ నంబియార్ స్పష్టం చేశారు. అదే విధంగా ఇందులో నిక్కీకౌసల్ నటించడం లేదని పేర్కొన్నా నటుడు ధనుష్ గురించి మాత్రం ప్రస్తావించలేదన్నది గమనార్హం.