నవ్వులు తెప్పించే... జక్కన్న
• చిత్రం: ‘జక్కన్న’,
• మాటలు: భవానీ ప్రసాద్,
• సంగీతం: దినేష్,
• కెమేరా: సి.రాంప్రసాద్,
• నిర్మాత: ఆర్.సుదర్శన్‌రెడ్డి,
• కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల
వినోదం.. వినోదం.. వినోదం.. ఇటీవల మెజారిటీ తెలుగు సినిమాలు ఈ ఫార్ములా చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రేక్షకులను వీలైనంత నవ్వించి వసూళ్లు రాబట్టాలనుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ వినోదానికి అగ్ర తాంబూలం ఇస్తున్నారు. ఎటువంటి కథలోనైనా కామెడీ కంపల్సరీ అయిన ఈ తరుణంలో కమెడియన్ నుంచి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ మరిన్ని నవ్వులు పంచుతారని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో గత సినిమా ‘కృష్ణాష్టమి’ చేసిన సునీల్, నవ్వించడానికి తిరిగొచ్చాడనట్లు బ్యాక్ టు ఎంటర్‌టైన్... క్యాప్షన్‌తో ‘జక్కన్న’గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గతంలో ‘రక్ష’ అనే హారర్ సినిమా తీసిన వంశీకృష్ణ ఆకెళ్ల ఈ ‘జక్కన్న’ సినిమాకి దర్శకత్వం వహించారు.
‘నీటిలో మునుగుతున్న చీమను పావురం కాపాడుతుంది. కృతజ్ఞతగా నీకు ఎప్పుడైనా సాయం చేస్తానని చీమ అంటే.. నువ్వో చిన్న ప్రాణివి, ఏం సాయం చేయగలవని పావురం నవ్వుతుంది. తర్వాత ఓ రోజున వేటగాడు పావురంపై బాణం గురిపెడతాడు. చీమ కుట్టడం ద్వారా బాణం గురి తప్పుతుంది. పావురం బతుకుతుంది’ - స్కూల్‌లో మాస్టారు (హీరో తండ్రి కూడా ఈయనే... నాగినీడు) చెప్పిన కథ గణేశ్ (సునీల్) బుర్రకి బాగా ఎక్కేసింది. చీమే అంత సాయం చేసినప్పుడు మనుషులం మనం సాయం చేయలేమా? అన్న మాటలు గణేశ్‌పై బాగా ప్రభావం చూపాయి.
ఆ క్షణం నుంచి తనకు సాయం చేసిన వ్యక్తులపై, వాళ్లు కూడా తట్టుకోలేనంత ప్రేమాభిమానాలు చూపిస్తాడు. వయసుతో పాటు హీరోలో ఈ లక్షణం కూడా ముదిరి పాకాన పడుతుంది. పెద్దయిన తర్వాత విశాఖలో అడుగుపెడతాడు. అజ్ఙాతంలో ఉంటూ విశాఖను గడగడలాడిస్తున్న రౌడీ బైరాగి (కబీర్ సింగ్)ని వెతుకుతుంటాడు. ఈ క్రమంలో సహస్ర (మన్నార్ చోప్రా)తో ప్రేమలో పడతాడు. ఎన్నో హత్యలు చేసిన బైరాగి ఎలా ఉంటాడో పోలీసులతో సహా ఎవరికీ తెలీదు. బైరాగిని చూసిన వ్యక్తి ప్రాణాలతో ఉండడు. ఎందుకంటే.. చంపేస్తాడు. కనీసం అతని ఫొటో ఎవరి దగ్గరా ఉండదు. కానీ గణేశ్ దగ్గరుంటుంది. చివరకు, వెతికి పట్టుకుంటాడు. అసలు గణేశ్, బైరాగిల మధ్య సంబంధం ఏంటి? తన గుట్టు తెలుసుకున్న గణేశ్‌ను బైరాగి ఏం చేశాడు? అనేది మిగతా సినిమా.
సునీల్ నుంచి ఆశించే నవ్వులు అక్కడక్కడా ఉన్నాయి. యాక్టింగ్, డైలాగ్ డెలివరీల్లో వినోదం అందించాలనే తాపత్రయం కనిపిస్తుంది. ప్రారంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుణ్ణి నవ్వించాలని చేసిన ప్రయత్నమే ఈ సినిమా బలం, బలహీనత. వంకాయలో వన్, టెంకాయలో టెన్ అంటూ మాటల రచయిత చిత్ర విచిత్ర పద ప్రయోగాలు చేశారు. పంచ్ డైలాగుల పేరుతో ప్రాస కోసం ప్రయాస పడ్డారు. ప్రథమార్ధంలో సప్తగిరి, ద్వితీయార్ధంలో పృథ్వి హీరోతో కలసి సందడి చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.