ఒక్క కారు ధర 24 కోట్లు.. అంతా బాండ్ మాయ!
జేమ్స్‌బాండ్ సినిమాలో సిల్వర్ కలర్‌లో తళతళ మెరిసిపోతూ దూసుకెళ్లే కారు ఓ ప్రత్యేక ఆకర్షణ. ఈ కారు జేమ్స్‌బాండ్‌కు ఓ ఆయుధం. విలన్లను ఛేజ్ చేయాలన్నా, బుల్లెట్ల వర్షం కురిపించాలన్నా ఇదే. ప్రముఖ కార్ల కంపెనీ ఆస్టన్ మార్టిన్ కేవలం జేమ్స్‌బాండ్ సినిమా కోసమే కొన్నేళ్లుగా కార్లను తయారుచేయడం, వాటిని వేలంలో అమ్మేయడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ. బాండ్ సిరీస్‌లో వచ్చిన 12 సినిమాల్లో దర్శనమిచ్చిన ఈ కారు ఇటీవల విడుదలైన ‘స్పెక్టర్’లో కూడా అభిమానులను కనువిందు చేసింది.
కేవలం ఈ సినిమా కోసమే ‘డీబీ 10’ పేరుతో పది కార్లను ఈ సంస్థ తయారు చేసింది. ఒక్కో కారుకి ఆయన ఖర్చు 25 కోట్ల రూపాయలు. ఇటీవల రెండు కార్లను వేలం వేస్తే ఒక కారు3.5 మిలియన్ డాలర్ల (రూ. 24 కోట్లు)కు అమ్ముడుపోయింది. అయితే గతంలో బాండ్ కార్లు పలికిన ధర కన్నా ఇది కాస్త తక్కువే. 1964లో వచ్చిన ‘గోల్డెన్ ఫింగర్’, 1965లో వచ్చిన ‘థండర్‌బాల్’ చిత్రాల్లో కనిపించిన డీబీ 5 కారు ఒక్కోటి ఏకంగా 31 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం విశేషం. తర్వాత ఈ ధరను వేరే బాండ్ కార్లు అధిగమించలేదు. తాజాగా డీబీ 10 కూడా ఆ రికార్డ్‌ను బ్రేక్ చేయడంలో విఫలమైంది.