
బహుశా... పుష్కరం తర్వాత నేనివ్వబోయే గొప్ప హిట్..!
- ఎన్టీఆర్
‘‘ప్రతిసారి మీ (అభిమానుల) ఋణం తీర్చుకోవచ్చనుకుంటా. నాకు తెలిసి అది జరగదేమో. మీ ఋణం తీర్చుకోకుండానే వెళ్లిపోయి మళ్లీ పుడతానేమో. మీకోసం మళ్లీ మళ్లీ పుట్టాలనుంది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. ఈ జన్మలో ఆ మహానుభావుడి (ఎన్టీఆర్)కి మనవడిగా పుట్టాను. ‘నాన్నకు ప్రేమతో’ విడుదల తర్వాత నా కటౌట్‌లకు పాలాభిషేకం చేయడం చూసి బాధపడ్డాను. నేను దేవుణ్ణి కాదు. ఓ నటుణ్ణి, మీ అన్నో, తమ్ముణ్ణో. మీ అభిమానాన్ని కాదనను. దయచేసి ఆ పాల ప్యాకెట్‌ను అనాధాశ్రమంలో పిల్లలకు ఇస్తే సంతోషిస్తా.
సినిమా విడుదల సమయాల్లో మూగ జీవాలను బలి ఇవ్వడం మానేసి అన్నదానం చేయండి’’ అన్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ నిర్మిస్తున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. సమంత, నిత్యా మీనన్ కథానాయికలు. మోహన్‌లాల్ ప్రధాన పాత్రధారి. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘పన్నెండేళ్లకోసారి పుష్కరాలొస్తాయి. చిన్న వయసులోనే ‘ఆది’, ‘సింహాద్రి’ దక్కాయి. సక్సెస్ ఇంతే అనుకున్నా. అర్థం కాలేదు.
అప్పుడప్పుడు దేవుడు మొట్టికాయలు వేసి నువ్వు కిందకు పడరా.. జీవిత పరమార్థం అర్థమవుతుందని చెప్తాడు. కిందపడేలా చేసిన సినిమాలకు మీరెంత బాధపడ్డారో నాకు తెలుసు. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానని ఎలా చెప్పాలో తెలియలేదు. బహుశా పుష్కరం తర్వాత నేను ఇవ్వబోయే గొప్ప హిట్ ఇది. నాకు ఆప్తమిత్రుడైన నా శివ ఇస్తాడేమో. సెప్టెంబర్ 2న సినిమా విడుదలవుతుంది’’ అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ - ‘‘అన్నయ్య (చిన్న ఎన్టీఆర్)తో నా అనుబంధం ప్రత్యేకం. రచయితగా పెద్దగా ఎదగనప్పుడు ‘బృందావనం’ రాశాను. ఆ సినిమా ఆడియో వేడుకలో నన్ను అభిమానులకు ఎన్టీఆర్ పరిచయం చేశారు.
నా జర్నీ ఆరోజే మొదలైంది. ఆయన కోసం నా పెన్ను ఇంకొంచెం ఎక్కువ రాస్తుంది. అన్నయ్య ఎనర్జీ, ఎగ్జైట్‌మెంట్ మ్యాచ్ చేస్తూ రాసిన సినిమా ఇది. ‘జనతా గ్యారేజ్’తో బ్లాక్ బస్టర్ కొడతాను. సినిమా కోసం మా నిర్మాతలు ఎంతైనా ఖర్చుపెడతారు. ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు’’ అన్నారు. ‘‘తారక్‌తో వర్క్ చేయడం అల్లరిగా, సరదాగా, ఎనర్జిటిక్‌గా ఉంటుంది’’ అని దేవిశ్రీప్రసాద్ అన్నారు. నిర్మాతలు బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, ప్రసాద్ వి పొట్లూరి, దర్శకుడు సుకుమార్, నటులు సాయికుమార్, ఉన్ని ముకుందన్, సినిమాటోగ్రాఫర్ తిరునావక్కరుసు, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, రచయిత వక్కంతం వంశీ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.