'జనతా గ్యారేజ్' భారీ రికార్డు!
జూనియర్ ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్'. ప్రకృతి ప్రేమికుడిగా సరికొత్త పాత్రలో తారక్ విభిన్నంగా కనిపించిన ఈ సినిమా.. రికార్డులను బద్దలుకొడుతూ ముందుకుసాగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'జనతా..' నాలుగురోజుల్లోనే రూ. 50 కోట్ల మార్క్‌ను దాటింది. తద్వారా టాలీవుడ్‌లో 'బాహుబలి' తర్వాత అత్యంత వేగంగా రూ. 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా 'జనతా గ్యారేజ్' రికార్డు సృష్టించింది.
సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ఎన్టీఆర్, మోహన్‌లాల్ వంటి భారీ తారాగణం ఉండటం 'జనతా గ్యారేజ్'కు ప్లస్ అయింది. ప్రకృతి ప్రేమికుడిగా ఎన్టీఆర్ చూపిన అభినయానికి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకు రివ్యూలు ఎలా వచ్చినా తొలిరోజు వసూళ్లు మాత్రం దుమ్మురేపాయి. ఏకంగా తొలిరోజు రూ. 21 కోట్లు కొల్లగొట్టిన 'జనతా గ్యారేజ్'.. నాలుగో రోజైన ఆదివారం రూ. 5 కోట్లు మాత్రమే సాధించినట్టు తెలుస్తోంది. అమెరికాలో ఈ సినిమా దాదాపు రూ. 9.31 కోట్ల (1.4 మిలియన్ డాలర్ల) వసూళ్లు రాబట్టింది.
డివైడ్ టాక్ వచ్చినా పవన్ కల్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్', మహేశ్ బాబు 'బ్రహ్మోత్సవం' తొలి వీకెండ్‌లో మంచి వసూళ్లు రాబట్టాయి. 'సర్దార్ గబ్బర్‌సింగ్' రూ. 40 కోట్లు, 'బ్రహ్మోత్సవం' రూ. 30 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఈ రెండు సినిమాలను అధిగమించి భారీస్థాయిలో తారక్ సినిమా కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. అమెరికాలో మిలియన్ డాలర్ మార్క్ కలెక్షన్లను సాధించిన ఎన్టీఆర్ నాలుగో సినిమా ఇది. ఇంతకుమునుపు నాన్నకు ప్రేమతో, టెంపర్, బాద్షా సినిమాలు అగ్రరాజ్యంలో మిలియన్ డాలర్లకుపైగా వసూళ్లు సాధించాయి. టాక్ ఎలా ఉన్నా 'జనతా గ్యారేజ్' వసూళ్లు స్థిరంగా ఉండటంతో మున్ముందు కలెక్షన్లపరంగా మరిన్ని రికార్డులు ఈ సినిమా సృష్టించవచ్చునని భావిస్తున్నారు.