వందకోట్ల దిశగా దూసుకుపోతున్న 'జనతా'!
తొలి వారంలో తిరుగులేని వసూళ్లు సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' శరవేగంగా వందకోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. తెలుగు, మలయాళం భాషల్లో విడుదలైన ఈ సినిమా.. తొలివారంలో రెండు భాషల్లో కలిపి.. మొత్తంగా రూ. 79 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని 'ఆంధ్ర బాక్పాఫీస్' కథనాలను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల జాతీయ పత్రిక తెలిపింది.
జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే రూ. 51 కోట్లు వసూలు చేసింది. అలాగే, కేరళ, అమెరికాల్లోనూ రికార్డు వసూళ్లు రాబట్టింది. అమెరికాలో రూ. 10.5 కోట్లు, కేరళలో రూ. 9.50 కోట్లు వసూలు చేసింది.
కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలైన 'జనతా గ్యారేజ్' తొలిరోజు రికార్డు స్థాయిలో రూ. 21 కోట్లు కొల్లగొట్టింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంత వేగవంతంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. కొన్ని ప్రాంతాల్లో రాజమౌళి 'బాహుబలి' సినిమా రికార్డులను కూడా 'జనతా గ్యారేజ్' అధిగమించినట్టు చెప్తున్నారు. ఆంధ్రలోని వైజాగ్, ఈస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇటు భారత్ లోనూ, అటు అమెరికాలోనూ వారాంతపు పొడిగింపు ఉండటం ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది. తొలి వీకెండ్ ముగిసిన తర్వాత సోమ, మంగళవారాల్లోనూ 'జనతా గ్యారేజ్' నిలకడగా వసూళ్లు సాధిస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ప్రకృతి ప్రేమికుడిగా జూనియర్ ఎన్టీఆర్ నటన, హీరోకు దీటుగా మోహన్ లాల్ పాత్రను తీర్చిదిద్దడం బాగా కలిసి వచ్చిందని వారు అభిప్రాయపడుతున్నారు.