
జాన్వీ కపూర్
పెళ్లికి చాలా టైమ్ ఉంది కానీ పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్ రెడీ అంటున్నారు జాన్వీ కపూర్. శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నారు జాన్వీ. తొలి చిత్రం ‘ధడక్’లో నటిగా మంచి మార్కులు వేయించుకుని, ఇప్పుడు ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’లో పవర్‌ఫుల్ పైలట్‌గా టైటిల్ రోల్ చేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి.
అందుకే ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. పైగా జాన్వీ వయసు 22. పెళ్లికి చాలా టైమ్ ఉంది. మరి.. ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అనే ప్రశ్నను జాన్వీ ముందుంచితే – ‘‘నా పెళ్లి సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. తిరుపతిలో చేసుకుంటా. హంగూ, ఆర్భాటాల్లాంటివి ఏవీ ఉండవు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఎప్పటికీ గుర్తుండిపోయేలా చాలా ఆహ్లాదకరంగా పెళ్లి వేడుక జరగాలని ఉంది. పెళ్లికి కంచి పట్టు చీర కట్టుకుంటా.
అలాగే విందులో దక్షిణాది వంటకాటు ఉంటాయి. నాకు ఇడ్లీ–సాంబార్, పెరుగన్నం, పాయసం.. వంటివన్నీ ఇష్టం. అవన్నీ విందులో ఉంటాయి’’ అన్నారు. జీవిత భాగస్వామిగా ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? అని అడిగితే – ‘‘ఊహల్లో తిరిగే వ్యక్తి అక్కర్లేదు. చాలా ప్రతిభావంతుడు అయ్యుండాలి. అలాగే తన జాబ్‌ని ఎంతో ఇష్టంగా చేయాలి. అతన్నుంచి నేను ఎంతో కొంత నేర్చుకునేంత ప్రతిభావంతుడు అయ్యుండాలి. చమత్కారంగా ఉండాలి’’ అన్నారు జాన్వీ కపూర్.
Comments
Please login to add a commentAdd a comment