చావు అంచుల దాకా వెళ్లాను.. నా కూతురి కోసం నన్ను బతికించమని దేవున్ని కోరుకున్నాను. ఆ తర్వాత 5 నిమిషాల్లోనే నా ఆరోగ్య పరిస్థితి మామూలుగా అయ్యింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిజంగానే నేను మరణం అంచుల దాకా వెళ్లి వచ్చాను అంటున్నారు హిందీ సిరీయల్ యాక్టర్, బిగ్‌బాస్ 5 కంటెస్టెంట్ జుహీ పర్మార్. తనకు ఎదురైన వింత అనుభవం గురించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు జుహీ.
‘మొన్న హోలీ పండుగ నాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఆష్కా గోరడియా వాళ్ల ఇంట్లో ఉన్నాను. రాత్రి 10.30 - 11 గంటల సమయంలో సడెన్‌గా నా ఆరోగ్యం చెడిపోయింది. వాంటింగ్ వస్తున్నట్లు అనిపించింది. ముక్కు మూసుకుపోయి ఉపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి అయ్యింది. శరీరంలోంచి ఏదో బయటకు వెళ్లి పోయినట్లు అనిపించింది. ఓ ఐదు నిమిషాల పాటు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. ఇక నేను చనిపోతానని అర్థమయ్యింది. నోట్లో నుంచి మాట రావడం లేదు. ఆ సమయంలో ఒక్కసారిగా నా జీవితం అంతా నా కళ్ల ముందు నిలిచింది. అప్పుడు నేను విడాకులు తీసుకున్నానని, సింగిల్ పేరెంట్‌నని కానీ.. నేను ఎదుర్కోన్న కష్టాలు కానీ ఇవేవి నాకు గుర్తుకు రాలేదు. నా కూతురు నవ్వు మొహం మాత్రమే నాకు కనిపించింది. నేను చనిపోతే తన పరిస్థితేంటనే ఆందోళన ఎక్కువయింది’.
‘పక్కనే ఉన్న నా స్నేహితురాలు ఆష్కా గోరడియాను సైగల ద్వారా పిలిచాను. ఇక నుంచి నా కూతురి బాధ్యత తనదేనని సైగల ద్వారానే చెప్పాను. నా ఆత్మ నా శరీరం నుంచి వేరుపడటానికి సిద్ధంగా ఉంది. నేను నా కూతరికి ఏం చేయలేకపోయాను. ఆ విషయం నాకు గుర్తుకురాగానే నా గుండెను చిక్కబట్టుకున్నాను. ఆ సమయంలో నేను దైవంతో మాట్లాడటం ప్రారంభించాను. ఇదంతా జరుగుతున్నప్పుడు డాక్టర్లు, నర్సులు, నా స్నేహితురాలు అందరు నాకు కొద్ది దూరంలోనే ఉన్నారు. కానీ జరుగుతున్న విషయం గురించి వారికి తెలియడం లేదు. నేను దైవంతో సంభాషించడం మొదలుపెట్టాను. జీవితాన్ని ఆషామాషీగా తీసుకున్నందుకు.. ఫలితం లేకుండా జీవించినందుకు.. ఆశీర్వాదాలు వదిలి.. ఆశ వెంట పరుగులు తీసినందుకు నన్ను క్షమించమని వేడుకున్నాను. కానీ నా కూతురు కోసం నన్ను బతకనికవ్వు అంటూ ప్రాధేయపడ్డాను. ఆ తరువాత మరో ఐదు నిమిషాల్లోనే నా బీపీ, ఈసీజీ, మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్‌గా మారాయి’ అని సుదీర్ఘ పోస్ట్ పెట్టారు జుహీ.
అంతేకాక ‘ఇది రాసే సమయానికి నేను నా పాత శరీరంలోనే ఉన్నాను. కానీ నా ఆత్మ మారిపోయింది. నా విషయంలో జరిగిన ప్రతిదానికి నేను సంతోషంగా ఉన్నాను.. కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. దాంతో ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని భావించాను. మన జీవితంలో జరిగే ప్రతి దానికి కృతజ్ఞతలు తెలపడం చాలా మంచిది. ఎందుకంటే నేనైనా, మీరైనా మనందరం మనుషులమే’ అంటూ పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment