అందమైన భామలు... లేత మెరుపు తీగలు...
ఇంత పొడవాటి గౌనులు వేసుకుని అంత అందంగా ఎలా నడుస్తారు? పైగా ఎత్తు మడమల చెప్పులతో అంత వయ్యారంగా ఎలా వాక్ చేస్తున్నారు? మెడ, చెవులనంటి పెట్టుకున్న ఆ ఆభరణాలు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాయి.. అని కాన్స్ చలనచిత్రోత్సవాల్లో పాల్గొంటున్న అందాల తారల గురించి అనుకోని వారుండరు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న ఈ ఉత్సవాలపైనే అందరి దృష్టి. ఈ వేడుకల్లో పాల్గొంటున్న తారల తళుకులను చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదని సౌందర్యారాధకులు మురిసిపోతున్నారు.
వయసుతో సంబంధం లేకుండా టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకూ ఆడవాళ్లందరూ పొడవాటి గౌను, ఎత్తు మడమ చెప్పులు, వజ్రాభరణాలు ధరించి, ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఎర్ర తివాచీపై ఈ తారలు చేసే క్యాట్ వాక్‌ని కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తెగ తాపత్రయపడిపోతారు. అందుకే, పొరపాటున గౌను తొలగినా, ఎవరైనా జారి పడినా కెమెరా కన్ను నుంచి తప్పించుకోలేరు. గురువారం ప్రముఖ అందాల తార జూలియా రాబర్ట్స్ అలా ఓ విషయంలో కెమెరాలకు దొరికిపోయారు. అదేంటంటే...
‘జూలియా.. వాటె కలర్ యార్’ అనుకునే రేంజ్‌లో తెల్లగా ఉంటారీ బ్యూటీ. నలుపు రంగు గౌనులో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు జూలియా. ఆ గౌనులో ఆమె తెల్లని దేహం మెరిసిపోయింది. వజ్రాల కంఠాభరణం మినహా ఒంటి మీద వేరే ఏ ఆభరణం లేకపోయినా ఆమె తళుకులీనారు. ఎత్తు మడమ చెప్పులతో వచ్చిన జూలియా మెట్లు ఎక్కేటప్పుడు జారి పడిపోతానని భయపడ్డారేమో. వాటిని విడిచేసి, వట్టి కాళ్లతో మెట్లెక్కేశారు. రెప్పపాటులో జరిగిపోయిన ఈ తతంగాన్ని కెమెరా కళ్లు క్యాప్చర్ చేసేశాయి. మెట్లెక్కేసిన తర్వాత సహాయకుడు చెప్పులు తెస్తే, తొడుక్కున్నారామె.
ఇదో విషయమా అనుకునేరు. మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద వేడుకలకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆడవాళ్లేమో లాంగ్ ఫ్రాక్స్, హై హీల్స్ వేసుకోవాలి. మగవాళ్లు సూటూ, బూటూ ధరించాల్సిందే. గతేడాది కొంతమంది తారలు ఎత్తు మడమ చెప్పులు కాకుండా ఫ్లాట్స్ వేసుకుని వస్తే, అనుమతించలేదు. వాళ్లు వెనుతిరగాల్సి వచ్చింది. అలాంటిది జూలియా వట్టి కాళ్లతో మెట్లెక్కితే ఊరుకుంటారా?.. ఊరుకున్నారు. ఎందుకంటే ఆమె జూలియా రాబర్ట్స్ కాబట్టి. ఏదేమైనా ఇంట్లో ఉన్నప్పుడు జూలియా కాళ్లను చెప్పులు అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే పాదరక్షలు లేకుండా ఆమె కాసేపే నడిచినా పెద్ద టాపిక్ అయ్యింది.
అయ్యో పాపం... అమల్!
నటుడు జార్జ్ క్లూనే సతీమణి, నటి అమల్ క్లూనే పాపం ఇబ్బందిపడే పరిస్థితి తెచ్చుకున్నారు. భర్త చెయ్యి పట్టుకుని అందంగా నడుచుకుంటూ వచ్చిన అమల్ పొరపాటున తన పొడవాటి గౌను పైన కాలు వేశారు. రెండు చీలికల్లా డిజైన్ చేయబడిన ఆ గౌను అటూ ఇటూ కావడంతో అమల్ ఇబ్బందిపడిపోయారు. కంగారుగా గౌను సర్దుకుని, పాలిపోయిన మొహంతో ముందుకు సాగారామె.
ఊడీ... పరమ మూడీ!
రసవత్తరంగా జరుగుతున్న వేడుకల్లో ఆనందపడేవాళ్లూ, అలిగే వాళ్లూ ఉంటారు. అలా దర్శకుడు ఊడీ అలెన్ అలిగారు. తన కుమార్తె ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెపై ఊడీ అత్యాచారం చేశారనే అభియోగం ఉంది. ఈ విషయం గురించి వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫ్రెంచ్ హాస్యనటుడు లారెంట్ లఫిట్టె జోక్ చేశారు. యూరోపియన్ దర్శకుడు రోమన్ పొలాన్‌స్కీతో ఊడీని పోల్చారు లఫిట్టె.
రోమన్ తన 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచార ప్రయత్నం చేసిన విషయం బయటకు రావడంతో, అభియోగాలు భరించలేక ఆయన ఏకంగా యూఎస్ నుంచి యూరోప్ పారిపోయి అక్కడ సినిమాలు చేసుకుంటున్నారనీ, ‘మరి మీ మీద అత్యాచార ఆరోపణలు నిర్ధారణ కాకపోయినా సరే మీరెందుకు రోమన్‌లా యూరోప్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అని లఫిట్టె చమత్కరించడంతో ఊడీ మొహం ఎర్రబారింది. లఫిట్టె మాటల్లో గూఢార్థం ఉంది. ఊడీ అత్యాచార యత్నం చేశారు కాబట్టే, యూఎస్‌లో ఎక్కువ సినిమాలు చేయడంలేదన్న భావం వ్యాఖ్యాత మాటల్లో కనపడింది.
అది విని కొంతమంది నవ్వేసరికి, ఊడీ ముఖం కందగడ్డలా మారింది. లఫిట్టె ఇలా ‘రేప్ జోక్’ చేయడం కొంతమందికి అస్సలు నచ్చలేదు. కొందరు హాలీవుడ్ నటీమణులు బాహాటంగానే అతణ్ణి విమర్శించారు. దాంతో ఊడీ మనసు కొంచెం శాంతించి ఉంటుంది. ఇదిలా ఉంటే... గురువారం ఈ వేడుకలకు హాజరైనవారిలో... నటీమణులు అన్నా కెండ్రిక్, చెరిల్ కోల్, నయోమీ వాట్స్, జెస్సికా చేస్టైన్, క్రిస్టెన్ స్టీవాట్ తదితరులు ఉన్నారు.