
క్లబ్బులో తన్నుకున్న సింగర్లు!
లాస్ ఏంజిల్స్: పాప్ సూపర్ స్టార్ జస్టిన్ బీబర్ మరోసారి గొడవల్లో తలదూర్చాడు. ఓ క్లబ్బులో నైటౌట్ సందర్భంగా యువ ర్యాపర్ 'డిజినర్'తోతగువుకు దిగాడు. ఈ గొడవ క్లబ్బులో రచ్చరచ్చ చేసింది. బ్రూక్లిన్ లో తన కన్సర్ట్ ముగిసిన అనంతరం న్యూయార్క్ లోని వన్ ఓక్ క్లబ్బుకు 22 ఏళ్ల బీబర్ వెళ్లాడు. అక్కడ హిప్ హాప్ సింగర్ డిజినర్ ప్రదర్శన ఇస్తున్నాడు. అతను పాడుతూ.. చిందులు వేస్తూ వేదిక మీద నుంచి దిగి.. జనంలో కలియదిరిగాడు. ఈ క్రమంలో వీఐపీ ఏరియాలో ఉన్న బీబర్ వద్దకు అతను దూసుకెళ్లాడు. అతని వద్ద చిందులు తొక్కుతూ.. అతని కాళ్లను పలుసార్లు తొక్కాడు.
దీంతో చిరాకుపడ్డ బీబర్ అతన్ని గట్టిగా తోసేశాడు. ఇది చిన్నపాటి గొడవకు దారితీసి..క్లబ్బులో రభస చేసింది. బాగా జనంతో నిండిన క్లబ్బులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా హాలీవుడ్ గాసిప్ వెబ్ సైట్ టీఎంజెడ్ పబ్లిష్ చేసింది. ప్రస్తుతం ర్యాపర్ కేన్ వెస్ట్ బృందంలో పనిచేస్తున్న 19 ఏళ్ల డిజినర్ ను వెంటనే అక్కడి నుంచి భద్రత మధ్య తరలించారు.డిజినర్ ప్రదర్శనను మధ్యలోనే నిలిపివేయడంపై క్లబ్బులోని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ గొడవపై బీబర్ ఇంతవరకు స్పందించలేదు.