జో..కు నచ్చిన ఆ రెండు..
తమిళసినిమా: రీ ఎంట్రీ అన్నది రెండు రకాలుగా ఉంటుంది. ఏవో కారణాల వల్ల నటనకు కొంతకాలం దూరం అయ్యి మళ్లీ నటించడం ఒక రకం రీఎంట్రీ కాగా.. పెళ్లి చేసుకుని పిల్లలకు తల్లి అయిన తరువాత మళ్లీ నటనపై మొగ్గు చూపడం మరో రకం రీఎంట్రీ అవుతుంది. ఈ రెండవ రకం రీఎంట్రీ తారలు పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త వహించాల్సింటుంది. వారికంటూ ఒక ఇమేజ్ ఏర్పడి ఉంటుంది. ఏ పాత్ర బడితే అది చేస్తే ప్రేక్షకులు హర్షించరు. నిజంగానే అలాంటి వారికి కథలు ఎంచుకోవడం అంత సులభమైన పని కాదు.
ఈ కోవకు చెందిన నటి జ్యోతిక. వివాహ వేదిక పైకి అడుగులు వేసే వరకూ ప్రముఖ కథానాయకి అనే ఇమేజ్ ఉన్న నటి తను. జ్యోతిక 1999లో విడుదలైన పూవెల్లామ్ కేట్టుప్పార్ చిత్రంలో తొలి సారిగా నటుడు సూర్యతో కలిసి నటించారు. ఆ తరువాత ఉయిరిలే కలందదు,పేరళగ న్, కాక్క కాక్క,మాయావీ,చిల్లన్ను ఒరు కాదల్ తదితర చిత్రాల్లో జంటగా నటించారు. అయితే చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంలో నటించే ముందే సూర్య, జ్యోతిక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.2006లో చిల్లన్ను ఒరు కాదల్ చిత్రాన్ని పూర్తి చేయడంతో పాటు అంతకు ముందు అంగీకరించిన పచ్చైక్కిళి ముత్తుచ్చారం, మొళి చిత్రాలను జ్యోతిక పూర్తి చేసి సూర్యతో ఏడడుగులు నడిచారు.
ఆ తరువాత నటనకు దూరం అయ్యారు. అలాంటిది సుమారు ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ నటిగా రీఎంట్రీ అయ్యి 36 వయదినిలే చిత్రంలో నటించారు. కథానాయకి ఇతి వృత్తంతో రూపొందిన ఆ చిత్రం విజయం సాధించింది. దీంతో నటనను కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చిన జో పలు కథలు వింటూ వచ్చారు. ఏవీ నచ్చడం లేదు. కారణం తన పాత్రలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలనీ అభిమానులు కోరుకుంటారన్న ఆలోచన జ్యో మదిలో బలంగా నాటుకు పోవడమే. అయితే తాజాగా జ్యోతికకు రెండు కథలు విపరీతంగా నచ్చేశాయట. వాటిలో ఒక కథను చేయడానికి సిద్ధం అవుతున్నారు.
విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ఆమెకు జంటగా తన రియల్ హీరో నటించనున్నారు. అంతే కాదు ఈ చిత్రాన్ని సూర్య తన 2డీ ఎంటర్ టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయన్నది తాజా సమాచారం.