చాలా కాలం క్రితం కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్ర షూటింగ్ జరుగుతుండగా అక్కడ అనూహ్యంగా ఓ గొడవ జరిగింది. గొడవకు పాల్పడ్డవాళ్లు రజనీకాంత్‌ను కత్తితో పొడవడానికి రాగా స్టంట్ కళాకారుడు అదిరడి అరసు అడ్డుపడి ఆయన ప్రాణాలు కాపాడి తాను కత్తిపోటుకు గురయ్యాడు. అప్పుడు రజనీ ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి కాపాడిన అదిరడి అరసు హీరోగా తెరకెక్కుతున్న సినిమా కబడివీరన్. స్టంట్ కళాకారుల జీవితం ప్రమాదాల మయం అని చెప్పనక్కర్లేదు. షూటింగ్స్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదం ఎటువైపు నుంచి పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. అలా రిస్కీ సన్నివేశాలకు పేరు గాంచిన స్టంట్ కళాకారుడు అదిరడి అరసు.
ఈయన తాజాగా కథానాయకుడిగా, దర్శకుడిగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అదిరడి అరసు హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం కబడివీరన్. అమ్మయప్పన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న స్టంట్‌మాస్టర్, గిల్డ్ అధ్యక్షుడు జాగ్వుర్‌తంగం మాట్లాడుతూ రిస్క్ చేసి నటించడంలో పేరు పొందిన స్టంట్ కళాకారుడు అదిరడిఅరుసు అని అన్నారు.
మనం చెప్పడం పూర్తి చేసే లోపే ఆ పని ముగిస్తాడని అన్నారు. తనకేదైనా సమస్య అంటే వచ్చి నిలబడతాడని చెప్పారు. ఆయన వస్తున్నాడంటేనే తన కార్యాలయంలోని వారు భయపడతారన్నారు. అదిరడి అరసు అంత ధైర్యశాలి అని అన్నారు. కాగా అదిరడి అరసు నటించి దర్శకత్వం వహించిన కబడివీరన్ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కే.భాగ్యరాజ్, నటుడు రాధారవి, దర్శకుడు మిష్కిన్, నటి నమిత, భానుచందర్ అతిథులుగా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment