కష్టాల్లో కబాలి
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కబాలి సినిమా రోజుకో వార్తతో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆడియో రిలీజ్ ఫంక్షన్ లేదని, ఆ తరువాత రిలీజ్ డేట్ వాయిదా పడుతుందంటూ అభిమానులకు రెండు షాక్లు ఇచ్చింది కబాలి టీం. అయితే తాజాగా తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కబాలి టీంకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
గతంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన విక్రమ సింహా(కొచ్చాడయాన్) సినిమా తెలుగు రైట్స్ను భారీ మొత్తానికి సొంతం చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమాకు దాదాపు 7 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. అయితే సినిమా రిలీజ్కు ముందు నష్టాలు వస్తే బరిస్తామంటూ మాట ఇచ్చిన విక్రమసింహా నిర్మాతలు తరువాత వారికి ఎలాంటి సాయం చేయలేదు.
రజనీకాంత్ తాజా సినిమా కబాలి తెలుగు రైట్స్ను షణ్ముక పిక్చర్స్ 32 కోట్లకు సొంతం చేసుకుంది. అదే స్ధాయిలో భారీగా ఆ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. అయితే రజనీ సినిమా మూలంగా గతంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం తమ లెక్కలు తేల్చే వరకు కబాలి సినిమా రిలీజ్ కానివ్వమంటున్నారు. జులై 7న రిలీజ్కు రెడీ అవుతున్న కబాలి అనుకున్నట్టుగా తెలుగు నాట కూడా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.