
మెచ్యూరిటీ లేకనే తప్పు చేశా!
సినిమా పరిపక్వత లేక మొదట్లో పొరపాట్లు చేశానని నటి కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరీ ముద్దుగుమ్మ. తెలుగులో చిరంజీవితో నటించిన ఖైదీనంబర్ 150 చిత్రం విజయాన్ని సాధించడంతో అమ్మడు ఆనందంలో మునిగితేలుతున్నారు. అంతే కాకుండా అజిత్‌కు జంటగా వివేకం చిత్రంతో పాటు, విజయ్ సరసన ఆయన తాజా చిత్రంలో నటిస్తున్నారు. తెలుగులో రానాతో మరో చిత్రం కూడా చేస్తున్నారు. ఇలా బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ తన విజయానికి తన క్రమశిక్షణే ప్రధాన కారణం అంటున్నారు. మొదట్లో సినిమా పరిపక్వత లేక పోవడంతో కొన్ని చెత్త చిత్రాలు చేసి మార్కెట్‌ను చెడగొట్టుకున్నానని చెప్పారు.
అయితే ఆ తరువాత పరిణితి చెంది మంచి కథా పాత్రలను మాత్రమే అంగీకరిస్తూ, క్రమశిక్షణ పాటిస్తూ కథానాయకిగా మంచి పేరు సంపాదించుకున్నానని అన్నారు. ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఒక్కసారిగా పెంచేశారనే ప్రచారం హోరెత్తుతోంది. స్టార్ హీరోలు, యువ హీరోలతో నటిస్తున్న కాజల్‌అగార్వల్ సీనియర్ హీరోలతో నటించడానికి సంకోచిస్తున్నారని తెలిసింది. ఇటీవల తెలుగులో చిరంజీవికి జంటగా ఖైదీనంబర్ 150 చిత్రంలో నటించడానికి భారీ పారితోషికాన్నే పుచ్చుకున్నట్లు సమాచారం. మామూలుగా కోటిన్నర పారితోషికం తీసుకునే కాజల్ చిరంజీవితో నటించిన చిత్రానికి కోటిముప్పావు అందుకున్నట్లు సినీ వర్గాల సమాచారం.
ఆ చిత్రం హిట్ అవడంతో కాజల్ ఆనందానికి పట్టపగ్గాల్లేకుండాపోతున్నాయట. తాజాగా మరో సీనియర్ హీరో సరసన నటించే అవకాశం రాగా చిరంజీవి చిత్రానికి అందుకున్న పారితోషికాన్నే ఇవ్వాలని డిమాండ్ చేశారట. దీంతో నోటిమాట రాక ఆ నిర్మాత మౌనంగా జారుకున్నారట. చేతిలో మూడు చిత్రాలు ఉన్న కారణంగా కొత్త అవకాశాలు పోయినా పర్వాలేదన్న ధోరణితో ఈ ముద్దుగుమ్మ అధిక పారితోషికాన్ని డిమాండ్ చేస్తుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది.