
చెన్నై : ఇటీవల నటి కాజల్ చెప్పిన ఒక విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ బ్యూటీకి ఇటీవల విజయాలు ముఖం చాటేసినా, అవకాశాలు మాత్రం తలుపుతడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కమలహాసన్‌తో ఇండియన్–2లో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి వెనక్కిపోతుందేమోనన్న ఆందోళనకు గురైన కాజల్‌అగర్వాల్‌కు తాజాగా మళ్లీ ఆగిపోయిందని ప్రచారం జరిగిన ఇండియన్–2 త్వరలో సెట్‌పైకి వెళ్లనుందన్న సంతోషం ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. అదేవిధంగా తెలుగులో తన సినీ గురువుగా భావించే దర్శకుడు తేజ దర్శకత్వంలో నటించిన సీత చిత్రం ఈ నెల 24వ తేదీన తెరపైకి రానుంది. ఇందులో కాజల్‌అగర్వాల్‌ను హీరోయిన్ సెంట్రిక్ పాత్ర లాంటిదని సమాచారం. ఇకపోతే హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ప్యారిస్ ప్యారిస్ చిత్రం విడుదల కావలసి ఉంది. కాగా ప్రస్తుతం కాజల్ చిత్రాలను తగ్గించుకుందట.
ఒకప్పుడు ఏడాదికి ఈ అమ్మడు నటించిన చిత్రాలు కనీసం ఆరేడు విడుదలయ్యేవట. ఇప్పుడు తగ్గడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కాజల్‌అగర్వాల్ ఒక ఇంటర్వ్యూలో బదులిస్తూ మనసులో ఒక వేదన వెంటాడుతోందని చెప్పింది. దాన్ని చాలా ఆలస్యంగా గ్రహంచినట్లు తెలిపింది. 2013లో తన చెల్లెలి పెళ్లి అయ్యిందని చెప్పింది. ఆ వేడుకలోనూ తాను అతిథిగానే పాల్గొన్నానని చెప్పింది. కుటుంబంలోని సభ్యురాలిగా సంతృప్తిగా ఆ వేడుకలో పాలుపంచుకోలేకపోయానని అంది.
అందుకు కారణం ఏమిటంటే తన చెల్లెలంటే తనకు చాలా ప్రేమ అని పేర్కొంది. తామిద్దరం చాలా సన్నిహితంగా ఉంటామని, అలాంటి తన చెల్లెలి విశేష రోజున తాను ఆమెతో పూర్తిగా గడపలేకపోయానన్న బాధ తనను వెంటాడుతూనే ఉందని చెప్పింది. అందుకు కారణం షూటింగ్‌లతో బిజీగా ఉండడమేనని వివరించింది. అందుకే ఆ తరువాత చిత్రాలను తగ్గించుకోవాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏడాది నాలుగు చిత్రాల్లో నటిస్తే చాలని భావించానని చెప్పింది. ఇప్పుడు తాను చిత్రాల్లో నటిస్తున్నా, కుటుంబసభ్యులకు వీలైనంత సమయాన్ని కేటాయిస్తూ సంతోషంగా గడుపుతున్నానని చెప్పింది. పాత్రలకు న్యాయం చేయడానికి కఠినంగా శ్రమిస్తున్నా, 24 గంటలు అదే పనిలో ఉండడం లేదని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ జయంరవికి జంటగా కోమాలి చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ శనివారం విడుదలైంది. తదుపరి కమలహాసన్‌తో ఇండియన్–2లో నటించడానికి రెడీ అవుతోంది. దీన్ని స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment