
నా కుటుంబమే నాకు ముఖ్యం...
హీరో కల్యాణ్‌రామ్
‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు. ఎంత ఇంపాక్ట్ ఇచ్చామన్నది ముఖ్యం. ఈ సినిమా విజయం సాధించి, అందరికీ మంచి పేరు తీసురావాలని కోరుకుంటున్నా’’ అని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. నందమూరి కల్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్ జంటగా విజయలక్ష్మీ పిక్చర్స్ పతాకంపై మల్లికార్జున్ దర్శకత్వంలో కొమరం వెంకటేశ్ నిర్మించిన చిత్రం ‘షేర్’. ఎస్.ఎస్.థమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం పాటల సీడీని హీరో జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ-‘‘ ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్‌లో ఉన్నప్పుడు బ్రేక్ తీసుకుని అందరినీ చూసి వెళిపోదామని లండన్ నుంచి ఇక్కడికి వచ్చాను.
నేనేదో ‘కిక్-2’ గురించి సంతకాలు పెట్టడానికి వచ్చానని వార్తలు వచ్చాయి. కల్యాణ్‌రామ్ అన్నయ్యది ఒకరికి పెట్టే చేయే కానీ తీసుకునే చేయి కాదు. అంత మంచి వ్యక్తి ఆయన. కల్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇది మంచి సినిమాగా నిలిచిపోవాలి’’ అని ఆకాంక్షించారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ ‘‘సినిమా ఆలస్యమైనా నిర్మాత వెంకటేశ్‌గారు ఓపిగ్గా భరించారు. నా వల్ల ఆలస్యమైతే గనక ఆయనకు నా క్షమాపణలు. ఈ చిత్ర దర్శకుడు మల్లికార్జున్‌తో నాకిది మూడో సినిమా. మొదటి రెండు సినిమాలు ఫ్లాప్ అయినా సరే ‘ఎందుకు అవకాశం ఇచ్చావు’ అని చాలా మంది అడిగారు.
కానీ అతను మంచి టెక్నీషియన్. నేను కథను నమ్ముకుంటా. అందుకే అతనికి మళ్లీ ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా క్లిక్ అయితే మల్లికార్జున్ నిలబడతాడు. నాకన్నా అతనికి ఈ సినిమా హిట్ ఎంతో అవసరం. ఈ మధ్య అందరూ మమ్మల్ని విడదీసి మాట్లాడుతున్నారు. మాది ఒక వంశం. మేమందరం ఒకటే. దయచేసి మమ్మల్ని వేరు చేసి మాట్లాడద్దు. నా కుటుంబమే నాకు ముఖ్యం’’ అన్నారు. దర్శకుడు మల్లికార్జున్ మాట్లాడుతూ-‘‘కల్యాణ్‌రామ్‌గారితో నాది 12 ఏళ్ల అనుబంధం. ఈ సందర్భంగా ఆయనకు థ్యాంక్స్. ఆయన నాకెన్నో అవకాశాలిచ్చారు. కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. మళ్లీ సక్సెస్ మీట్‌లో మాట్లాడతాను’’ అని దర్శకుడు అన్నారు.
‘‘ఈ ఏడాది ‘పటాస్’ హిట్‌తో కల్యాణ్‌రామ్ మంచిగా ప్రారంభించారు. అదే తరహాలో ‘షేర్’ కూడా మంచి వసూళ్లు షేర్ చేయాలని కోరకుంటున్నా. ‘పటాస్’ తర్వాత కల్యాణ్‌రామ్‌ను చాలా రెగ్యులర్‌గా కలుస్తున్నాను. ఆయన పాజిటివ్ సైడ్ తెలుస్తోంది. తమన్ నాకు మంచి ఫ్రెండ్. అతనికి ఈ సినిమా ద్వారా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నా’’ అని ‘దిల్’ రాజు అన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ-‘‘ కల్యాణ్‌రామ్‌గారు ‘పటాస్’ టైంలో నన్ను బాగా ప్రోత్సహించారు. నేను రెండో సినిమా ప్రారంభించిన సమయంలో అందరికన్నా ముందు నాకు కల్యాణ్‌రామ్‌గారు ఫోన్ చేసి ‘నీ రెండో సినిమా మంచి విజయం సాధించాలి’ అన్నారు. ఆయన ఎంతో మంచి మనిషి. ‘పటాస్’ సినిమా కన్నా ఈ సినిమా పదిరెట్లు విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు.
చిత్ర కథానాయిక సోనాల్ చౌహాన్ మాట్లాడుతూ- ‘‘ ‘లెజెండ్’ సినిమాలో బాలకృష్ణగారి పక్కన నటించా. ఈ సినిమాలో కల్యాణ్‌రామ్‌గారితో చేశాను. సినిమా అంటే ఎంతో పేషన్ ఉన్న వ్యక్తి. ఈ టీమ్‌తో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అవకాశమొస్తే జూ.ఎన్టీఆర్‌తో కూడా యాక్ట్ చేయడానికి రెడీ’’ అని అన్నారు. ఈ వేడుకలో నందమూరి రామకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రచయిత వక్కంతం వంశీ, నటుడు షఫీ తదితరులు పాల్గొన్నారు.