
పాతికేళ్ల తర్వాత కమల్‌తో..
తమిళసినిమా : దాదాపు పాతికేళ్ల తర్వాత అమల కమలహాసన్‌తో నటించడానికి సిద్ధమవుతున్నారు. అమల మంచి నృత్య కళాకారిణి అన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె బహుభాషా నటి అన్నది గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ దర్శక నటుడు టీ.రాజేందర్ గుర్తింపు అమల. 1986లో మైథిలీ ఎన్నై కాదలీ చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన అమల తొలి చిత్రంతోనే నటిగా తానేమిటో నిరూపించుకున్నారు.
ఆ చిత్రం ఘన విజయంతో అమలకు అవకాశాలు వెల్లువెత్తాయి. రజనీకాంత్, కమలహాసన్ వంటి టాప్‌స్టార్లతో వరుసగా నటించే అవకాశాలను అందుకున్నారు. అలా అనతికాలంలోనే తమిళంతో పాటు తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించారు. కమలహాసన్‌తో సత్య, వెట్ట్రివిళా వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జునను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత దాదాపుగా నటనకు దూరం అయ్యారనే చెప్పాలి. సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవల వెండితెర, బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. తాజాగా తమిళం, తెలుగు భాషలలో తెరకెక్కనున్న ఒక భారీ చిత్రంలో విశ్వనటుడు కమలహాసన్‌తో నటించడానికి సిద్ధమవుతున్నారు. కమల్ నటించిన తూంగావనం ఈనెల 10న విడుదల కానుంది. చీకటిరాజ్యం పేరుతో తెలుగులో 20వ తేదీన తెరపైకి రానుంది. దీంతో కమలహాసన్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా అమల నటించనున్నారు. మరో నాయకిగా బాలీవుడ్ నటి జెరీనా వాకబ్ నటించనున్నారు.