సాక్షి, చెన్నై: త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్న ప్రముఖ నటుడు కమల్ హాసన్ మంగళవారం 63వ వసంతంలోకి అడుగుపెట్టారు. అయితే, ఆయన ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదు. చెన్నైతోపాటు తమిళనాడులోని పలు జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలకు ప్రజలు అవస్థలు పడుతుండటంతో జన్మదిన వేడుకలను కమల్ రద్దు చేసుకున్నారు. వేడుకలకు బదులుగా చెన్నైకి 20 కిలోమీటర్ల దూరంలోని అవది ప్రాంతంలో తన అభిమానులు ఏర్పాటుచేసిన మెడికల్ క్యాంప్‌ను ఆయన సందర్శించబోతున్నారు. అక్కడి నుంచి వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న దక్షిణ చెన్నైను సందర్శించి.. బాధితులతో గడపబోతున్నారు.
రాజకీయాల్లోకి వచ్చేందుకు కమల్ హాసన్ గత కొన్నాళ్లుగా సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి.. ఓ మొబైల్ యాప్‌ను విడుదల చేయాలని కమల్ భావించారు. తాజా వర్షాల నేపథ్యంలో వేడుకలు రద్దుచేసుకున్న కమల్.. మొబైల్ యాప్ లాంచ్ మాత్రం యథావిధిగా నిర్వహించబోతున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ఈ యాప్ మొదటి అడుగు అని, తన సందేశాన్ని ఈ యాప్ ద్వారా ప్రజలకు అందించబోతున్నట్టు కమల్ చెప్తున్నారు.
'పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకోవడం నన్ను అభిమానించే వారికి నచ్చకపోవచ్చు. కానీ, రేపు కూడా ఒక మామూలు రోజు మాత్రమే. దానిని సంబరాలతో గడిపేకంటే.. మనం కోరుతున్న మార్పు దిశగా ఈ రోజును వినియోగించుకోవడం ఉత్తమం' అంటూ అభిమానులను ఉద్దేశించి కమల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ప్రజలను ఆదుకునేందుకు తన అభిమాన సంఘాన్ని దశాబ్దం కిందటే వెల్ఫేర్ అసోసియేషన్‌గా కమల్ మార్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment