
ఐశ్వర్యా రాజేష్, కమల్‌హాసన్, ప్రియాభవాని శంకర్,
ఆర్థికపరమైన సమస్యల వల్ల ‘ఇండియన్ 2’ సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడిందనే వార్తలు ఆ మధ్యకాలంలో బాగానే వినిపించాయి. ఒక దశలో ఈ సినిమా ఆగిపోతుందనే పుకార్లు కూడా వచ్చాయి. కానీ ‘ఇండియన్ 2’ చిత్రీకరణకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని కోలీవుడ్ తాజా సమాచారం. ఆగస్టు మూడో వారంలో ఈ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభం కానుందని తెలిసింది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఇందులో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆగస్టు 19న మొదలు కానుందని చెన్నై కోడంబాక్కమ్ కబర్. ఈ సినిమాలో సిద్ధార్థ్‌తో పాటు కథానాయికలు ఐశ్వర్యా రాజేష్, ప్రియాభవాని శంకర్ కీలక పాత్రలు చేయనున్నారని సమాచారం. 1996లో కమల్‌హాసనే హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో భారతీయుడు) చిత్రానికి ‘ఇండియన్ 2’ సీక్వెల్ అనే విషయం తెలిసిందే.
ఈ సంగతి ఇలా ఉంచితే... 2015లో దర్శక–నిర్మాతగా కమల్‌హాసన్ ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. కారణాలు ఏవైనా ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయింది. ‘ఇండియన్ 2’తో పాటు ఈ సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకువెళ్తున్నారు కమల్‌హాసన్. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్‌ను స్వరకర్తగా తీసుకున్నారు. ‘ఇండియన్ 2’ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన లైకా ప్రొడక్షన్స్ ‘తలైవన్ ఇరుక్కిండ్రాన్ నిర్మాణంలోనూ భాగమవ్వడం విశేషం. ఇలా కామా పెట్టిన పాత ప్రాజెక్ట్స్‌ని కూడా ముగించే పనిలో ఉన్న కమల్ ఆగిపోయిన తన ‘శభాష్ నాయుడు’ చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారా? వేచి చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment