
కమల్, మౌళి కాంబినేషన్‌లో మరో చిత్రం
ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పీడ్ పెంచారు. ఒకేసారి కబాలి, 2ఓ చిత్రాల్లో నటిస్తున్నారు. అంతే కాదు తదుపరి చిత్రానికి పచ్చజెండా ఊపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే విశ్వనటుడు కమలహాసన్ అంతకు ముందే తన చిత్రాల వేగాన్ని పెంచారు. ఉత్తమ విలన్, పాపనాశం, తూంగావనం అంటూ వరుసగా చిత్రాలు చేశారు.
తాజాగా ఏకకాలంలో రెండు చిత్రాలు చేయడానికి సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయన్నది లేటెస్ట్ట్ సమాచారం. ఆయన మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వంలో అప్పా అమ్మా విళయాట్టు చిత్రంలో నటించనున్నారు. ఇందులో ఆయన సరసన నటి రమ్యకృష్ణ నటించనున్నట్లు సమాచారం. ఇదే చిత్రంలో కమలహాసన్‌కు కూతురిగా శ్రుతిహాసన్ నటించనున్నారు. ఈ చిత్రంతో పాటు సీనియర్ దర్శకుడు మౌళి దర్శకత్వంలో నటించడానికి కమల్ రెడీ అవుతున్నట్లు తెలిసింది.
దీనికి పరమపథం అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. కమల్, మౌళి కలయికలో చిత్రం అంటే హాస్యానికి కొదవే ఉండదు. ఇంతకు ముందు వీరి కాంబినేషన్‌లో పమ్మల్ కే.సంబంధం, నలదమయంతి చిత్రాలు వచ్చాయన్నది గమనార్హం. ఈ చిత్రంలో కూడా వినోదానికి పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.