ఇప్పుడు కమల్ వంతు..
కమల్‌హాసన్ పోషించిన పాత్రను ఇతర భాషల్లో చేయడానికి దాదాపు ఏ హీరో ధైర్యం చేయరు. ఎందుకంటే... కమల్ ఓ పాత్ర చేస్తే... ఆ పాత్రను అంతకు మించి చేయడానికి ఏమీ ఉండదు. అందుకే.. నిర్మాతలు కూడా ఆయన సినిమాలను రీమేక్ చేయడానికి సాహసించరు. సాధ్యమైనంతవరకూ అనువదించేస్తారంతే. అడపాదడపా కొన్ని కమల్ సినిమాలు వేరే హీరోలతో రీమేక్ అయినా... అవి విజయాలను అందుకున్న దాఖలాలు తక్కువ. కమల్ మాత్రం అప్పుడప్పుడు ఇతర హీరోల చిత్రాలను రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతుంటారు. పదకొండేళ్ల క్రితం బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రాన్ని కమల్ ‘వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్’గా తమిళంలో చేశారు.
నసీరుద్దీన్‌షా నటించిన ‘వెన్స్‌డే’ చిత్రాన్ని తెలుగులో ‘ఈనాడు’గా, తమిళంలో ‘ఉన్నయ్‌పోల్ వరువన్’గా చేశారు కమల్. వాటి ఫలితాలు ఎలా ఉన్నా... నటునిగా కమల్ మాత్రం ఆ సినిమాల్లో విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో రీమేక్ ‘పాపనాశమ్’. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ ఈ చిత్రానికి మాతృక. ఇప్పటికే ఈ కథ తెలుగులో వెంకటేశ్ హీరోగా, కన్నడంలో రవిచంద్రన్ హీరోగా రీమేక్ అయ్యింది. ఇక మిగిలింది తమిళమే. ప్రమాదంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఆ ఇంటిపెద్ద ఎలా ఒడ్డుకు చేర్చాడన్నదే ఈ సినిమా కథ.
ఇందులో కమల్‌కి జోడీగా గౌతమి నటిస్తుండటం విశేషం. కమల్-గౌతమిది ఒకప్పుడు సూపర్‌హిట్ కాంబినేషన్. విచిత్రసోదరులు, క్షత్రియపుత్రుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ జంట ఆకట్టుకుంది. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట మళ్లీ ఇన్నాళ్లకు తెరను పంచుకోవడం విశేషం. మాతృక దర్శకుడైన జీతూ జోసఫ్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్, వెంకటేశ్, రవిచంద్రన్ తమ పరిథి మేరకు ఈ పాత్రను అద్భుతంగా రక్తికట్టించారు. ఇప్పుడు కమల్ వంతు వచ్చింది. ఇటీవలే ‘పాపనాశమ్’ స్టిల్స్‌ని మీడియాకు విడుదల చేశారు. వాటిలో కమల్ ఆహార్యం, హావభావాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.