Jeetu Joseph
-
డైరెక్షన్ టు టాలీవుడ్!
పొరుగింటి డైరెక్టర్ల డైరెక్షన్ మారింది. వాళ్ల డైరెక్షన్ టాలీవుడ్‌కి మారింది. ఎక్కడెక్కడి డైరెక్టర్లు ఇప్పుడు తెలుగులోకి వస్తున్నారు. తెలుగులో భారీ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీ, కోలీ, మాలీ, శాండల్... ఈ అన్ని వుడ్స్ డైరెక్టర్లు మన తెలుగులో సినిమాలు చేస్తున్నారు. ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం. తెలుగు పరిశ్రమలో తెలుగు దర్శకులే ఉన్నారా? అంటే.. కాదు. పరభాషా దర్శకులు కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎక్కువమంది రావడం విశేషం. ‘బాహుబలి’ అద్భుత విజయం తర్వాత భారతీయ చిత్రపరిశ్రమ చూపు తెలుగుపై పడిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాల నిర్మాణం పెరిగింది. అందుకే ఇతర ఇండస్ట్రీల దర్శకులు కూడా కథలు రాసుకుని తెలుగు హీరోలకు వినిపిస్తున్నారు. తమ డైరెక్షన్‌ను టాలీవుడ్ వైపు తిప్పుకుంటున్నారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ కెరీర్లో ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ చిత్రాలది ప్రత్యేక స్థానం. ఈ రెండు చిత్రాలూ ఆయన్ను ఇతర భాషల్లోనూ పాపులర్ చేశాయి. ‘దృశ్యం’ సినిమా తమిళ రీమేక్ ‘పాపనాశం’ని తెరకెక్కించి, తమిళ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు జీతు. ఇందులో కమల్ హాసన్ నటించారు. ఇప్పుడు ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్‌కు దర్శకత్వం వహించి, తెలుగు చిత్రపరిశ్రమలోకి దర్శకుడిగా తొలి అడుగు వేశారు జీతు. తెలుగు ‘దృశ్యం’ (ఈ చిత్రానికి సుప్రియ దర్శకురాలు) పార్ట్ వన్‌లో హీరోగా నటించిన వెంకటేశ్.. రెండో పార్టులోనూ హీరోగా నటించారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి’ బ్లాక్‌బస్టర్ ప్రభాస్‌ను ప్యాన్ ఇండియన్ స్టార్‌ని చేసింది. దీంతో పక్క ఇండస్ట్రీ దర్శకులు కూడా ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్ కోసం ఓ కథ రాసి, వినిపించారు. ప్రభాస్‌కి కథ నచ్చడంతో ఈ కన్నడ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సలార్’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది. అలాగే బాలీవుడ్లో ‘తన్హాజీ’ చిత్రంతో టెక్నికల్‌గా మంచి గ్రిప్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ అనే మైథాలజీ ఫిల్మ్ చేస్తున్నారు ప్రభాస్. ఇలా ఒకేసారి ఇద్దరు పక్క ఇండస్ట్రీ దర్శకులతో ప్రభాస్ సినిమాలు చేయడం విశేషం. అలాగే హిందీ సినిమా ‘వార్’ ఫేమ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2021లో జరిగిన ఓ విశేషం.. శంకర్ తెలుగు సినిమా చేయనుండటం. ‘ఇండియన్’ ‘జీన్స్’, ‘రోబో’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ ఇలా చెప్పుకుంటూ పోతే దర్శకుడు శంకర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉన్నాయి. ఈ చిత్రాలు తెలుగులో అనువాదమై సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. కానీ తన 28 ఏళ్ళ కెరీర్లో శంకర్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడం ఇదే మొదటిసారి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ మూవీ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం ఓ సోషల్ డ్రామాగా రూపొందనుందనే ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక తమిళంలో ఉన్న మంచి మాస్ దర్శకుల్లో లింగస్వామి ఒకరు. అందుకు ఓ నిదర్శనం విశాల్‌తో ఆయన తెరకెక్కించిన తమిళ చిత్రం ‘సండై కోళి’ (తెలుగులో ‘పందెంకోడి’). ఆ తర్వాత లింగుస్వామి తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్‌తో లింగు స్వామి సినిమా ఓకే అయిందనే టాక్ కూడా వినిపించింది. కానీ వీరి కాంబినేషన్లోని సినిమా సెట్స్‌పైకి వెళ్ళలేదు. ఇప్పుడు రామ్ హీరోగా లింగుస్వామి సినిమా చేసేందకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘అవళ్’ (తెలుగులో ‘గృహం’), ‘కాదల్ టు కల్యాణం’ వంటి సినిమాలను ప్రేక్షకులకు అందించిన మిళింద్ రావ్ డైరెక్షన్లో రానా హీరోగా ఓ సినిమా రానుంది. ఇందులో రానా పోలీసాఫీసర్ అనే ప్రచారం జరగుతోంది. ఇటీవల విడుదలైన రానా ‘అరణ్య’ చిత్రానికి దర్శకత్వం వహించింది కూడా తమిళ దర్శకుడు ప్రభు సాల్మాన్ కావడం విశేషం. వీళ్లు మాత్రమే కాదు.. మరికొందరు పరభాషా దర్శకులు తెలుగు సినిమాలు తెరకెక్కించే అవకాశం ఉంది. తెలుగులో పరభాషా కథానాయికలు, విలన్లు, సహాయ నటులు ఎక్కువమందే ఉన్నారు. ఇప్పుడు పొరుగింటి దర్శకుల జాబితా కూడా పెరుగుతోంది. మన తెలుగులో ప్రతిభావంతులు ఎక్కువే. అయితే ప్రతిభ ఎక్కడున్నా ప్రోత్సహించే మనసు ‘తెలుగు పరిశ్రమ’కు ఉంది కాబట్టే... ఇంతమంది పరభాషల వారు ఇక్కడ సినిమాలు చేయగలుగుతున్నారు. వీళ్లూ వస్తారా? తమిళ దర్శకులు అట్లీ, లోకేష్ కనగరాజ్ తాము తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఒక దశలో అట్లీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, లోకేష్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోలుగా నటిస్తారనే వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ‘ఇరుంబుతిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఓ సినిమా రూపొందనుందని ఎప్పట్నుంచో ప్రచారం సాగుతోంది. సో... వీళ్లూ తెలుగులోకి వచ్చే చాన్స్ ఉంది. -
దృశ్యం-2 రిలీజ్ డేట్ ఫిక్స్?
అనుకోని ఆపదల నుంచి తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమార్తెను ఓ తండ్రి ఎలా రక్షించుకున్నాడు? అనే కథాంశంతో ‘దృశ్యం 2’ సినిమా సాగుతుంది. మలయాళంలో ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్ రీమేక్‌లోనూ నటిస్తున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన జీతూ జోసఫే తెలుగు రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’ సినిమాను ఫాదర్స్ డే సందర్భంగా జూన్ 20న విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. కుటుంబం కోసం ఓ తండ్రి పడే తపన నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది కాబట్టి ఆ రోజు అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోందట. -
‘దృశ్యం 2’ సెట్స్‌లో జాయిన్ అయిన మీనా
‘దృశ్యం 2’ సినిమా సెట్స్‌లో జాయిన్ అయ్యారు హీరోయిన్ మీనా. సూపర్ హిట్ మూవీ ‘దృశ్యం’ (2014) సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో హీరో హీరోయిన్లుగా నటించిన వెంకటేష్, మీనాయే సీక్వెల్లో కూడా చేస్తున్నారు. సోమవారం నుంచి ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు మీనా. ‘‘స్టార్ట్ రోలింగ్.. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాను’’ అని పేర్కొన్నారు మీనా. ఈ సినిమాలో నటి పూర్ణ కూడా ఓ కీలకపాత్ర చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళ మాతృక ‘దృశ్యం’, ‘దృశ్యం 2’ సినిమాలను డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ తెలుగు ‘దృశ్యం 2’తో దర్శకుడిగా తెలుగుకి పరిచయం కానున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. చదవండి: ఈ ఆపరేషన్ నా జీవితాన్ని మార్చేసింది : బిగ్ బీ -
దృశ్యం త్రీ కూడా ఉంది
మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, చైనీస్ భాషల్లోకి రీమేక్ అయింది. ఇటీవలే ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కించారు జీతు. ఈ సినిమా నేరుగా అమేజాన్ ప్రై మ్లో విడుదలయింది. ఈ సినిమా కూడా విశేష ప్రశంసలు అందుకుంటోంది. జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే మలయాళ ‘దృశ్యం 2’ రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. తాజాగా ‘దృశ్యం 3’ కూడా ఉంటుందని ప్రకటించారు దర్శకుడు జీతు. ఆల్రెడీ మూడో భాగం కై్లమాక్స్ రాసుకున్నానని తెలిపారు. కానీ ‘దృశ్యం 3’ తెరకెక్కడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేశారు. -
"దృశ్యం 2" రీమేక్ షురూ
‘దృశ్యం’ సీక్వెల్ ‘దృశ్యం 2’ చిత్రానికి సిద్ధం అయ్యారు వెంకటేశ్. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లనుంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘దృశ్యం’ (2013). ఆ సినిమాకు సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో విడుదలయింది. మలయాళ ‘దృశ్యం’ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు వెంకటేశ్. సీక్వెల్లో కూడా నటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అది నిజమే. మలయాళ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తారు. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించారు. -
దృశ్యం సీక్వెల్‌కి సై అన్న విక్టరీ
మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. ఈ సినిమా మలయాళంలో ఘన విజయం సాధించడంతో తెలుగులో వెంకటేశ్, తమిళంలో కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవగణ్ రీమేక్ చేశారు. తాజాగా మోహన్ లాల్ – జీతూ జోసెఫ్ కాంబినేషన్లోనే ‘దృశ్యం 2’ తెరకెక్కింది. ఈ సినిమా శుక్ర వారం నేరుగా అమేజాన్‌లో విడుదలయింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా తెలుగులో రీమేక్ కానుందని సమాచారం. మొదటి భాగంలో నటించిన వెంకటేశ్ ఈ సీక్వెల్లోనూ చేసేందుకు పచ్చజెండా ఊపారట. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ తెలుగు రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారట. -
ఫ్యాన్స్‌కు మోహన్‌లాల్ న్యూ ఇయర్ గిఫ్ట్
సూపర్ స్టార్ మోహన్ లాల్, మీనా నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ 'దృశ్యం2' న్యూ ఇయర్ కానుకగా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్థరాత్రి టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ మాట్లాడుతూ..జార్జ్ కుట్టి, అతని కుటుంబం కథతో ముందుకు వస్తున్నామని, ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆసక్తితో ఉన్నట్లు పేర్కొన్నారు. జీతు జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, సిద్దిక్, ఆశా శరత్, మురళి గోపీ, అన్సిబా, ఎస్తేర్, సైకుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2013లో విడుదలైన దృశ్యం మొదటి పార్ట్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో బాక్సాఫీస్ వద్ద రూ .50 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డుకెక్కింది. మొదటి పార్ట్‌లో ఎక్కడైతే కథ ఆగిందో సెకండ్ పార్ట్‌లో అక్కడినుంచి కంటిన్యూ కానుంది. థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషల్లో ఈ చిత్రం రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అది కాకుండా గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. మోహన్ లాల్ మే 21న తన 60 వ పుట్టినరోజు సందర్భంగా దృశ్యం సీక్వెల్ ప్రకటించినా కరోనా కారణంగా షూటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యింది. కాగా మోహన్‌లాల్ తదనంతరం జీతు జోసెఫ్ దర్శకత్వంలోనే ‘రామ్’ అనే మరో చిత్రానికి సైన్ చేశారు. Georgekutty and his family are coming soon on @PrimeVideoIN#Drishyam2OnPrime #HappyNewYear2021 #MeenaSagar #JeethuJoseph @antonypbvr @aashirvadcine @drishyam2movie #SatheeshKurup pic.twitter.com/5l7cfCdCS3 — Mohanlal (@Mohanlal) December 31, 2020 -
రామ్ ఆగడు
‘‘రామ్’ ప్రయాణం ఆగిపోలేదని, తాత్కాలిక బ్రేక్ మాత్రమే పడింది’’ అంటున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్. మోహన్‌లాల్, త్రిష జంటగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామ్’. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ సమయంలోనే మరో కథ రాయడం మొదలుపెట్టారు జీతూ. దీంతో ‘రామ్’ చిత్రం క్యాన్సిల్ అయినందువల్లనే జీతూ కొత్త కథపై పని మొదలుపెట్టారనే టాక్ మొదలైంది. ఈ విషయంపై ఇటీవలే జీతూ స్పందించారు. ‘‘కరోనా వల్ల ‘రామ్’ చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. యూకే, ఉజ్బెకిస్తాన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ తగ్గిన తర్వాత తిరిగి ప్రారంభిస్తాం. కరోనా వైరస్‌ను బాగా కట్టడి చేసిన రాష్ట్రాల్లో కేరళ ఒకటి. సో.. కేరళలోనే మొత్తం షూటింగ్ జరిపేలా ప్రస్తుతం ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాను. ఈ సినిమాను ప్లాన్ చేయడం వల్ల ‘రామ్’ సినిమా రద్దయిందని కాదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నాం.. అంతే’’ అని పేర్కొన్నారు జీతూ. -
దృశ్యం 2
మోహన్‌లాల్ హీరోగా మలయాళంలో తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం’ (2013). థ్రిల్లర్ కథాంశం, సస్పెన్స్ అంశాలు ఈ సినిమాను పెద్ద హిట్ చేశాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా భాషల్లో రీమేక్ అయింది. గత దశాబ్దంలో ఎక్కవ భాషల్లో రీమేక్ అయిన సినిమాల్లో ‘దృశ్యం’ ఒకటి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ (శ్రీలంక) భాషలో రీమేక్ అయింది. చైనీస్ భాషలో రీమేక్ అయిన తొలి భారతీయ సినిమా కూడే ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్టు జీతూ జోసెఫ్ ప్రకటించారు. మొదటి భాగంలో నటించిన మోహన్‌లాల్, మీనా ఇందులోనూ భార్యాభర్తలుగా నటిస్తారట. మిగతా నటీనటులు మారతారని తెలిపారు. కేరళలో సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇచ్చిన వెంటనే ఈ సినిమాను ఆరంభించాలనుకుంటున్నారట. -
వైఫ్ ఆఫ్ రామ్
పదిహేనేళ్లకు పైగా హీరోయిన్ పాత్రలు చేస్తున్న నటి త్రిష ఇప్పటివరకు మలయాళంలో చేసింది మాత్రం ఒక్క సినిమాయే. గతేడాది ‘హే జూడ్’ చిత్రంతో ఆమె మలయాళంలో తొలి అడుగు వేశారు. ఈ సినిమాలో త్రిష నటనకు అక్కడ మంచి మార్కులే పడ్డాయి. అందుకే మాలీవుడ్ నుంచి కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామ్’ అనే చిత్రంలో త్రిషను కథానాయికగా తీసుకున్నారు. ఇందులో మోహన్‌లాల్ చేస్తున్న రామ్ పాత్రకు భార్యగా త్రిష కనిపిస్తారు. వచ్చే ఏడాది ఓనమ్ పండగకి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదిలా ఉంటే... ‘పొన్నియిన్ సెల్వన్’, చిరంజీవి –కొరటాల కాంబినేషన్ సినిమాల్లో త్రిష ఒక కథానాయికగా నటించబోతున్నారని తెలిసింది. సో.. వచ్చే ఏడాది త్రిష బిజీ అన్నమాట. -
ఇప్పుడు కమల్ వంతు..
కమల్‌హాసన్ పోషించిన పాత్రను ఇతర భాషల్లో చేయడానికి దాదాపు ఏ హీరో ధైర్యం చేయరు. ఎందుకంటే... కమల్ ఓ పాత్ర చేస్తే... ఆ పాత్రను అంతకు మించి చేయడానికి ఏమీ ఉండదు. అందుకే.. నిర్మాతలు కూడా ఆయన సినిమాలను రీమేక్ చేయడానికి సాహసించరు. సాధ్యమైనంతవరకూ అనువదించేస్తారంతే. అడపాదడపా కొన్ని కమల్ సినిమాలు వేరే హీరోలతో రీమేక్ అయినా... అవి విజయాలను అందుకున్న దాఖలాలు తక్కువ. కమల్ మాత్రం అప్పుడప్పుడు ఇతర హీరోల చిత్రాలను రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతుంటారు. పదకొండేళ్ల క్రితం బాలీవుడ్లో విజయం సాధించిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రాన్ని కమల్ ‘వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్’గా తమిళంలో చేశారు. నసీరుద్దీన్‌షా నటించిన ‘వెన్స్డే’ చిత్రాన్ని తెలుగులో ‘ఈనాడు’గా, తమిళంలో ‘ఉన్నయ్పోల్ వరువన్’గా చేశారు కమల్. వాటి ఫలితాలు ఎలా ఉన్నా... నటునిగా కమల్ మాత్రం ఆ సినిమాల్లో విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో రీమేక్ ‘పాపనాశమ్’. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ ఈ చిత్రానికి మాతృక. ఇప్పటికే ఈ కథ తెలుగులో వెంకటేశ్ హీరోగా, కన్నడంలో రవిచంద్రన్ హీరోగా రీమేక్ అయ్యింది. ఇక మిగిలింది తమిళమే. ప్రమాదంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఆ ఇంటిపెద్ద ఎలా ఒడ్డుకు చేర్చాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో కమల్‌కి జోడీగా గౌతమి నటిస్తుండటం విశేషం. కమల్-గౌతమిది ఒకప్పుడు సూపర్‌హిట్ కాంబినేషన్. విచిత్రసోదరులు, క్షత్రియపుత్రుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ జంట ఆకట్టుకుంది. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట మళ్లీ ఇన్నాళ్లకు తెరను పంచుకోవడం విశేషం. మాతృక దర్శకుడైన జీతూ జోసఫ్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్, వెంకటేశ్, రవిచంద్రన్ తమ పరిథి మేరకు ఈ పాత్రను అద్భుతంగా రక్తికట్టించారు. ఇప్పుడు కమల్ వంతు వచ్చింది. ఇటీవలే ‘పాపనాశమ్’ స్టిల్స్‌ని మీడియాకు విడుదల చేశారు. వాటిలో కమల్ ఆహార్యం, హావభావాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.