
కంగనా రనౌత్
రాణి అంటే ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. అందంగా మాత్రమేనా? రాజసం ఉట్టిపడాలి. చూపులు చురకత్తుల్లా, నడక ఠీవీగా, మాటలు తెలివిగా ఉండాలి. అందుకే క్వీన్ పాత్రకు సాదాసీదా తారలను తీసుకోరు. కంగనా రనౌత్‌లా ఉండేవాళ్లనే తీసుకుంటారు. దర్శకుడు క్రిష్ తన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ కోసం ఆమెనే తీసుకున్నారు. ధీర వనిత ఝాన్సీలక్ష్మీభాయ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్ర చేస్తున్నారు కంగనా.
ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరుగుతోందని సమాచారం. రాజదర్బార్ సీన్స్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు మళ్లీ బయటికొచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్న ఫొటోలో భారీ ఆభరణాలతో కంగనా భలేగా ఉన్నారు కదూ. ఈ సంగతి ఇలా ఉంచితే ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవిత చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి.
రాణీ లక్ష్మీభాయ్‌కు బ్రిటిష్ ఏజెంట్‌కు మధ్య అభ్యంతరకర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన సర్వబ్రాహ్మణ సభ చేసిన ఫిర్యాదుకు మణికర్ణిక చిత్రబృందం స్పందించి, వివరణ ఇచ్చింది. దీంతో ఆ ఫిర్యాదు విరమించుకున్నారని బాలీవుడ్ టాక్. ‘‘రచయిత మిశ్రా నవల ఆధారంగా ‘మణికర్ణిక’ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. చరిత్ర అంశాలను మార్చడం లేదు’’ అని చిత్రనిర్మాతల్లో ఒకరైన కమల్‌జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment