ది లిప్‌స్టిక్‌ బ్యాండిట్‌.. | Kangana Ranaut starrer Simran is BASED ON Bombshell Bandit Sandeep Kaur's REAL STORY | Sakshi
Sakshi News home page

ది లిప్‌స్టిక్‌ బ్యాండిట్‌..

Published Sat, Mar 17 2018 12:28 AM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Kangana Ranaut starrer Simran is BASED ON Bombshell Bandit Sandeep Kaur's REAL STORY - Sakshi

2015.. వరుస బ్యాంక్‌ దోపిడీలతో అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాలైన ఆరిజోనా, కాలిఫోర్నియా, ఉటాలను ఊపేసిన బాంబ్‌షెల్‌ బాండిట్‌ గుర్తుంది కదా? అదేనండీ ఉరఫ్‌ సందీప్‌ కౌర్‌... 24 ఏళ్ల అమ్మాయి.. కాలిఫోర్నియాలో నర్స్‌గా పనిచేసేది. కాసినోకి వెళ్లే వ్యసనంతో విపరీతంగా అప్పులపాలై వాటిని తీర్చడానికి బ్యాంకులకు కన్నం వేయాలని నిర్ణయించుకుంది. మారువేషం.. ఆమె మోడస్‌ ఆపరెండి.

తల మీద విగ్గు.. సగం మొహాన్ని కప్పేసే సన్‌గ్లాసెస్‌.. ట్రాక్‌ సూట్, హ్యాండ్‌ బ్యాగ్‌తో బ్యాంక్‌కు వెళ్లేది. క్యాషియర్‌ దగ్గరకు వెళ్లి.. ‘‘ఈ బ్యాగ్‌లో బాంబ్‌ ఉంది.. ఈ బ్యాగ్‌లో పట్టినంత డబ్బు సర్దకపోతే బాంబ్‌తో బ్యాంక్‌ పేల్చేస్తా’’ అని స్థిర స్వరంతో బెదిరించి లూటీ చేసి వెళ్లిపోయేది ఈ రాణి. అలా వరసగా అయిదు వారాలు ఆరిజోనా, కాలిఫోర్నియా, ఉటాలో తన దోపిడీలతో కలకలం సృష్టించింది. అలా దొంగతనం చేసి వెళ్లిపోతుంటే పోలీసులు ఆమెను వెంటాడారు.

పసిగట్టిన కౌర్‌ తన వెహికిల్‌ను హై స్పీడ్‌లో మూడు రాష్ట్రాలను అంటే రెండు టైమ్‌జోన్స్‌ను దాటించింది. ఈ చేజింగ్‌ సీన్‌ హాలీవుడ్‌ సినిమాకూ తక్కువకాదు. మొత్తానికి పోలీసులకు చిక్కి 66 నెలల జైలు శిక్షకు గురైంది. ఆమె బెదిరింపు విని భయంతో గొంతు తడారిపోయిన వాళ్లకు నీళ్లు తాగించి మరీ డబ్బులు దోచుకొళ్లేదట దొరసాని.ఓకే.. క్వీన్‌ సినిమా కూడా గుర్తుంది కదా? ఏంటీ ఒక స్క్రీన్‌ మీద రెండు కథలు? అని ఐబ్రోస్‌ను ముడేయకండి! నిజంగా ఒక టికెట్‌కు రెండు కథల సినిమానే సిమ్రన్‌.

విడాకులు తీసుకున్న30 ఏళ్ల ఓ వనిత కథ...
ప్రఫూల్‌ పటేల్‌ అలియాస్‌ సిమ్రన్‌... అమెరికాలోని జార్జియా (అట్లాంటా)లో ఉంటుంది... తల్లిదండ్రులతో కలిసి. ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో హౌజ్‌ కీపింగ్‌ ఉద్యోగం చేస్తూ. భర్తతో విడిపోయి ఇంట్లో ఉంటున్న కూతురంటే తల్లికి, తండ్రికి ఇద్దరికీ చిన్న చూపే. ప్రఫూల్‌ ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే.. ‘‘ఎన్నాళ్లిలా ఉంటావ్‌? ఇంకో పెళ్లి చేసుకోవచ్చుకదా.. ’ అంటూ తల్లి నస పెడుతుంటుంది. జీతం డబ్బుల్లో చాలా దాచుకుంటూ సొంతంగా ఇల్లు తీసుకొని విడిగా ఉండాలనుకుంటుంది. ఈ విషయం తెలిసి తండ్రి ‘‘ఎందుకూ.. ఒంటరిగా అయితే బాయ్‌ఫ్రెండ్స్‌ను పిలిపించుకోవచ్చనా?’’ అంటూ అవమానపరుస్తుంటాడు. తల్లిదండ్రుల అనుమానాలు, అవమానాలు, అంచనాల నుంచి విముక్తి పొందాలనుకుంటుంది ప్రఫూల్‌. స్వతంత్రంగా బతకాలనుకుంటుంది.

లాస్‌ వేగస్‌..
ఆ క్రమంలోనే లాస్‌ వేగాస్‌లో కజిన్‌ బ్యాచ్‌లరేట్‌ పార్టీ ఉండడంతో వెళ్తుంది. అక్కడ ఆమెను ఓ క్లబ్‌కు  తీసుకెళ్తాడు ఓ ఫ్రెండ్‌. బాకర్ట్‌ గేమ్‌లో డబ్బులు గెల్చుకుంటుంది. ఎంజాయ్‌ చేస్తుంది. కాసినోకు వెళ్తుంది. బకార్ట్‌లో సహకరించిన అదృష్టం కాసినోలో వెక్కిరిస్తుంది. గెలుచుకున్నదంతా పోతుంది. అక్కడితో ఆగకుండా బ్యాంక్‌లోఉన్న సేవింగ్స్‌నూ పెడ్తుంది. అవీ పోతాయ్‌. తిరిగి అట్లాంటా వెళ్లిపోతుంది.

బ్యాంక్‌లో ఉండాల్సిన డిపాజిట్‌ లేకపోవడంతో ఇల్లు లోన్‌ కోసం పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్‌ అవుతుంది. ఆర్థిక సహాయం కోసం తండ్రిని అభ్యర్థిస్తుంది. ‘‘ఈ పిచ్చి పనులన్నీ మానుకుని సమీర్‌ (సోహమ్‌ షా.. తండ్రి చూసిన ఇంకో సంబంధం)ను చేసుకో’’ అంటూ ఒత్తిడి చేస్తాడు. ససేమిరా అనుకుని ఆఖరిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్లీ వేగస్‌ వెళుతుంది. కాసినోలో అప్పులిచ్చేవాడు తారసపడ్తాడు. తాకట్టుగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పెట్టి డబ్బు తీసుకుంటుంది. వాటినీ పోగొట్టుకుంటుంది.

లిప్‌స్టిక్‌ బ్యాండిట్‌..
మళ్లీ అట్లాంటా వెళ్లిపోయి తండ్రితో చెప్తుంది సమీర్‌ను కలుస్తానని. కలుస్తుంది కాని ఎలాంటి ఆసక్తీ చూపదు. అయితే సమీర్‌కు ప్రఫూల్‌ అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఈలోపు కజిన్‌ పెళ్లి వస్తుంది. ఆ పెళ్లిలో అప్పులవాడు డబ్బు కట్టమని ఫోన్‌ చేసి బెదిరిస్తుంటాడు. ఇంటికి లోన్‌ వస్తే అవి కట్టేద్దామనుకుంటుంది. కాని లోన్‌ క్యాన్సల్‌ కావడంతో ఏం చేయాలో పాలుపోదు. మెల్లగా చిల్లర దొంగతనాలకు అలవాటు పడుతుంది.

ఆ అలవాటు బ్యాంక్‌ దోచేందుకు ప్రోత్సహిస్తుంది. బ్యాంక్‌కు వెళ్లి ‘‘డబ్బులు ఈ బ్యాగ్‌లో పెట్టండి లేదంటే బాంబు పేలుస్తా’’ అని లిప్‌స్టిక్‌తో రాసిన నోట్‌ను క్యాషియర్‌కు చూపిస్తుంది. భయపడి డబ్బు సర్దేస్తారు బ్యాగ్‌లో. ఇదేదో బాగుంది అని వరుసగా ఇంకో రెండు బ్యాంక్‌లను దోచేస్తుంది. ఆ క్రమంలోనే మరో బ్యాంక్‌ను ఎంచుకుంటుంది. అదే ఫక్కీలో లిప్‌స్టిక్‌ నోట్‌ చూపిస్తుంది. అయితే మేనేజర్‌ నీ పేరేంటి అని అంటూ మాటల్లో పెడ్తాడు. తడబడ్డ ప్రఫూల్‌.. సిమ్రన్‌ అని చెప్తుంది.

కారణం అప్పటికే వాళ్ల అమ్మ వల్ల ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను కొన్ని పదులసార్లు చూడ్డం వల్ల. పైగా ఆ సినిమాలోని లాస్ట్‌ సీన్‌.. ‘‘జా సిమ్రన్‌ జా.. జీలే అప్‌నీ జిందగీ’’ అనే డైలాగ్‌ ప్రఫూల్‌కి చాలా ఇష్టం. దాంతో ఆ పేరు చెప్తుంది. కాని మేనేజర్‌ ఆమె గురించి పోలీసులకు ఇన్ఫామ్‌ చేస్తున్నాడని తెలుసుకుని తప్పించుకుని ఇంకో బ్యాంక్‌కు వెళ్తుంది.  అప్పటికే ఆమె ‘సిమ్రన్‌.. ది లిప్‌స్టిక్‌ బ్యాండిట్‌’ పేరుతో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌గా మారుతుంది. మూడు, నాలుగు బ్యాంక్‌లను దోచుకున్నా అప్పుల వ్యక్తికి కట్టాల్సిన డబ్బు జమకాదు. దాంతో ఇంకొంత వ్యవధి ఇవ్వమని ప్రాధేయపడుతుంది. ఒప్పుకోడు. ఇంకోవైపు సమీర్‌ అంటే ఇష్టం ఏర్పడి పెళ్లికి సరే అంటుంది ప్రఫూల్‌.

ఈలోపే ఇంకో సమస్య చుట్టుకుంటుంది ఆమెను. హోటల్లో పనిచేస్తుండగా అప్పుల వాళ్లు ఆమె మీద దాడి చేస్తారు. ఆమె  పాత బాయ్‌ఫ్రెండ్, ఆ హోటల్‌ మేనేజర్‌ (మైక్‌) ప్రఫూల్‌  హోటల్‌ లాకర్‌లో భద్రపర్చుకున్న డబ్బు (బ్యాంక్‌ రాబరీ మనీ) మీద కన్నేసి దొంగలిస్తాడు. ఆ విషయం తెలిసి తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయమని అడుగుతుంది ప్రఫూల్‌. ఇవ్వనంటాడు. అతన్ని కొట్టి సస్పెండ్‌ అవుతుంది. ఈ గొడవలో అప్పుల వాళ్లకు ప్రఫూలే లిప్‌స్టిక్‌ బ్యాండిట్‌ అని అర్థమవుతుంది. దాంతో ఇంకో పెద్ద బ్యాంక్‌కు కన్నం వేయమని పిస్టల్‌ను కూడా ఇస్తారు ప్రఫూల్‌కు.

సరెండర్‌..
వీటన్నిటితో విసిగిపోయి.. ఇక దాంట్లోంచి బయటకు రాలేననుకుని తాను చేసిన దొంగతనాల గురించి సమీర్‌కు చెప్పి తనను వదిలేయమంటుంది ప్రఫూల్‌. తండ్రికి తెలిసి కూతురి చెంప ఛెళ్లుమనిపించి ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటాడు. స్నేహితురాలి దగ్గరకు వెళ్లి ఆ రాత్రి తలదాచుకుంటుంది. అయితే తెల్లవారి తనకు లోన్‌ రిజెక్ట్‌ చేసిన బ్యాంక్‌కు కన్నం వేసి డబ్బు దొంగలిస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రఫూల్‌ దొంగ అని తెలిసినా ప్రేమను చంపుకోని సమీర్‌ ఆమె అప్పులవాళ్లకు కట్టాల్సిన 50 వేల డాలర్ల డబ్బును ప్రఫూల్‌ ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తాడు. గ్రహించిన ప్రఫూల్‌ అతన్ని ఒంటరి ప్రదేశంలో కల్సుకుని తనను వదిలేసి ఇంకో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొమ్మని చెప్తుంది. అదంతా కాదు.. ముందు పోలీసులకు లొంగిపో అంటాడు సమీర్‌.

తండ్రి నుంచి ఫోన్‌ వస్తుంది క్షమించమని. ఇంటికి బయలుదేరుతుంది. పోలీసుల నిఘా ఉండడం వల్ల ఇంటి దగ్గర పోలీసులు చుట్టుముడ్తారు. తప్పించుకుంటుంది ప్రఫూల్‌.  చేజింగ్‌ మొదలవుతుంది. తర్వాత సరెండర్‌ అవుతుంది. తప్పించుకోవాలనే ఉద్దేశం లేదని, తమింటి దగ్గర అందరూ భారతీయులే కావడం వల్ల అక్కడ దొరికిపోవడం ఇష్టం లేకే అంత దూరం వచ్చినట్టు చెప్తుంది.  వచ్చేసరికి పోలీసులు ఆమె కారును చుట్టుముడ్తారు. సరెండర్‌ అయిపోతుంది. పదినెలలు జైలు శిక్ష పడుతుంది. ఇదీ బాంబ్‌షెల్‌ బ్యాండిట్‌కు ప్రతీకగా వచ్చిన ‘ది లిప్‌స్టిక్‌ బ్యాండిట్‌’ సిమ్రన్‌ సినిమా కథ.

– శరాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement