రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..!
- నేడు అమిత్ షాతో భేటీ
- బీజేపీలో చేరతారా? లేక సొంత పార్టీ పెడతారా?
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో రియల్‌స్టార్‌గా పేరుగాంచిన ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశంపై కన్నడనాడులో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఉపేంద్ర తన సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుత రాజకీయాలపై తన వైఖరిని తెలియజేస్తూ ట్వీట్‌లు పెడుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిపాలనా తీరుపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర భారతీయ జనతా పార్టీలో చేరతారా? లేదంటే సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న విషయంపై ప్రజలు చర్చించుకుంటున్నారు.
నేడు( శనివారం) తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు సమాచారం. ఇదే రోజు బెంగళూరు రానున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సాయంత్రం 6.15 గంటలకు భేటీ అయ్యేందుకు ఉపేంద్రకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా బీజేపీలో చేరతారని, లోక్‌సభ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఉపేంద్ర బీజేపీలో చేరతారా లేక ఆంధ్రప్రదేశ్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తరహాలో సొంత పార్టీ ఏర్పాటు చేస్తారా అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ విషయంపై బీజేపీ అధికార ప్రతినిధి సురేష్‌కుమార్ మాట్లాడుతూ... ఉపేంద్ర రాజకీయాల్లోకి రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన ఒక ప్రగతిశీల విధానాలున్న ఓ కళాకారుడు. అయితే ఉపేంద్ర బీజేపీలో చేరడంపై నాకు ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయంపై ఉపేంద్ర , బి.ఎస్.యడ్యూరప్పతో చర్చించారో లేదో కూడా నాకు తెలియదు అని పేర్కొన్నారు.