విడాకుల కేసులో హీరోయిన్ ఒప్పందం
న్యూఢిల్లీ: బాలీవుడ్లో ఒకప్పటి టాప్ హీరోయిన్ కరిష్మా కపూర్, ఆమె భర్త సంజయ్ కపూర్ల విడాకుల వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కివచ్చింది. భరణం చెల్లింపు విషయంలో వీరిద్దరూ సుప్రీం కోర్టులో ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ కేసును శుక్రవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ముంబైలో ఉన్న తన తండ్రి ఇంటిని కరిష్మా కపూర్ పేరు మీద బదలాయించేందుకు సంజయ్ అంగీకరించాడు. ఇక సంజయ్ కపూర్ పిల్లల కోసం 14 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాడు. వీటి ద్వారా ప్రతి నెల వచ్చే 10 లక్షల రూపాయల వడ్డీని పిల్లల ఖర్చులకు వెచ్చించనున్నారు.
కరిష్మ, సంజయ్ల మధ్య మనస్పర్థలు రావడంతో గత అయిదేళ్లుగా విడిగా ఉంటున్నారు. కరిష్మా వద్ద ఉన్న పిల్లల్ని తన కస్టడీకి అప్పగించాలని కోరుతూ సంజయ్ కపూర్ గత ఏడాది ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా, తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కరిష్మా ఇటీవల తన భర్త, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది. భర్త, అత్తపై పెట్టిన కేసును ఉపసంహరించుకుంటున్నట్టు కరిష్మా కోర్టుకు తెలియజేసింది. ఇక పిల్లలను కరిష్మా వద్ద ఉంచేందుకు సంజయ్ అంగీకరించాడు. పిల్లలను చూసేందుకు వెళ్లేందుకు సంజయ్కు అనుమతించారు.