అప్పట్లో నా జీతం 4,300 రూపాయలు
అప్పట్లో నా జీతం 4,300 రూపాయలు
Published Tue, Dec 17 2013 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
మన పక్కింటి అబ్బాయిలా అనిపిస్తాడు కార్తీ. తమిళ హీరో అయినా తెలుగు ప్రేక్షకులక్కూడా ఈజీగా కనెక్ట్ అయిపోయాడంటే కారణం అదే. దానికి తోడు చాలా స్పష్టంగా తెలుగు మాట్లాడతాడు తను. యుగానికొక్కడు, ఆవారా, నా పేరు శివ.. ఈ మూడు సినిమాలు చాలు నటునిగా కార్తీ ఏంటో చెప్పడానికి. చాలా విరామం తర్వాత ఆయన చేసిన సినిమా ‘బిరియాని’. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో కె.ఇ. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న డుదలవుతున్న సందర్భంగా కార్తీతో కాసేపు.
తెలుగు బాగా మాట్లాడేస్తున్నారు. మరి డెరైక్ట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు?
అందరూ ఇదే అడుగుతున్నారండీ.. త్వరగా తెలుగు సినిమా చేయాలని నాకూ ఉంది. అయితే... సరైన స్క్రిప్ట్ దొరకడం లేదు. కథలైతే వింటున్నా. త్వరలోనే శుభవార్త చెబుతా.
మరి మీ అన్నయ్య సూర్యతో కలిసి ఎప్పుడు?
అన్నయ్య, నేను కలిసి నటించే సినిమా అంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని రీచ్ అయ్యేలా కథ కుదరాలి. అలాంటి కథ ఎవరు చెబుతారో చూద్దాం. మల్టీస్టారర్ చిత్రాలపై నాకు పెద్దగా ఇంట్రస్ట్ లేదు కానీ, అన్నయ్యతో కలిసి చేయాలని మాత్రం ఉంది.
‘బిరియాని’ సినిమాతో గాయకుని అవతారం ఎత్తినట్టున్నారు?
సిట్యుయేషన్ పరంగా ఆ పాట నేను పాడితేనే కరెక్ట్. అందుకే.. అటు దర్శకుడు, ఇటు సంగీత దర్శకుడు ఇద్దరూ పోరాడి మరీ నాతో ఆ పాట పాడించారు. సినిమాలో ఇది డ్రీమ్ సాంగ్ కాదు. లైవ్ సాంగ్. యువన్ శంకర్‌రాజా అద్భుతంగా ట్యూన్ చేశారు. ఎంజాయ్ చేస్తూ ఈ పాట పాడాను.
అంతకు ముందు పాడిన అనుభవం ఏమైనా ఉందా?
పాడేవాణ్ణి. పాటలంటే ఆసక్తే. అయితే... సినిమాకు పాడతానని అనుకోలేదు. భవిష్యత్తులో కూడా పాడాలని ఉంది. అయితే... అందుకు సంగీత దర్శకుల ప్రోత్సాహం కూడా ఉండాలి కదా. మెలొడీ సాంగ్స్ కాకుండా, ఇలా గమ్మత్తుగా సాగే పాటలైతే బాగుంటుంది.
స్టార్‌గా ఎదిగాక కూడా సాదాసీదాగా ఉండటానికే ఇష్టపడతారట. నిజమేనా?
మామూలు మధ్యతరగతివాడిలా మసలడంలోనే ఆనందం ఉంది. నేను చిన్నప్పట్నుంచీ పెరిగిన వాతావరణం అలాంటిది. స్టార్ కొడుకులా ఎప్పుడూ పెరగలేదు. అన్నయ్య బీకాం చదివి ఇక చదవనని చేతులెత్తేశాడు. నేను అలా కాదు. చాలా బ్రిలియంట్ స్టూడెంట్‌ని. చెన్నైలో ఇంజినీరింగ్ చేశాను. తర్వాత న్యూయార్క్‌లో ఎమ్మెస్ చేశాను. ఇక్కడ బిఈ చదువుతున్నన్ని రోజులూ నాకు బైక్ కూడా ఉండేది కాదు. బస్‌లోనే కాలేజ్‌కి వెళ్లేవాణ్ణి. ఎమ్మెస్ అయిపోగానే.. కష్టపడి ఇక్కడే ‘కలర్ ప్లస్’ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. నెలకు 4,300 రూపాయల జీతం. రోజుకి 12 గంటలు కష్టపడి పనిచేసేవాణ్ణి. అందుకే నాకు సగటు మనిషి జీవన శైలి బాగా తెలుసు. ‘బిరియాని’ చిత్ర దర్శకుడు వెంకట్‌ప్రభు, యువన్‌శంకర్‌రాజా నాకు అప్పట్నుంచే పరిచయం. ఆ రోజుల్లోనే సినిమాల గురించి మేం విపరీతంగా చర్చించుకునేవాళ్లం. ఇప్పుడు కలిసి పనిచేస్తామని అస్సలు అనుకోలేదు.
‘బిరియాని’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
బిందాస్‌గా తిరిగే పాత్ర. ఓ విధంగా చెప్పాలంటే ప్లే బోయ్ తరహా పాత్ర.
పెళ్లయిన కొత్తలో ఇలాంటి పాత్ర చేయడం ఇబ్బందిగా అనిపించిందా?
ఛాలెంజ్‌గా ఫీలయ్యా. అప్పుడప్పుడు నాన్నతో రెస్టారెంట్‌కి వెళ్లేవాణ్ణి. ఆయన మొహమాటానికి నాకూ డ్రింక్ ఆఫర్ చేసేవారు. కానీ నేను మాత్రం నిర్మొహ మాటంగా వద్దని చెప్పేసేవాణ్ణి. చిన్నప్పట్నుంచీ దుర్వ్యసనాలకు దూరంగా పెరిగాన్నేను. అదేంటో.. కెరీర్ మొదలయ్యాక నా వ్యక్తిత్వానికి పూర్తి భిన్నమైన పాత్రలే నన్ను వరించాయి. కానీ ఛాలెంజ్‌గా తీసుకొని ఆ పాత్రల్ని చేశాను. తొలి సినిమా ‘పరుత్తివీరన్’లోని నా పాత్రను సమర్థవంతంగా పోషించడానికి నాకు మూడేళ్లు పట్టింది. కెరీర్ మొదలైన ఏడేళ్లలో తొమ్మిదే సినిమాలు చేయ గలిగానంటే కారణం అదే.
ఇంతకీ కొత్త కాపురం ఎలా ఉంది?
ఇదివరకటికంటే జుట్టు కాస్త పలుచబడిందండీ (నవ్వుతూ)
ఇంతకీ ‘బిరియాని’ ఎలా ఉంటుంది?
హైదరాబాద్ బిరియానీ రేంజ్‌లో ఉంటుంది. బిరియాని తినడానికి ఫ్రెండ్‌తో పాటు ఓ రాత్రి బయలుదేరిన ఓ కుర్రాడి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారం ఈ సినిమా. డిఫరెంట్ జానర్ ఫిలిం. వెంకట్‌ప్రభు చాలా ట్రెండీగా సినిమాను మలిచాడు. హన్సిక ఇందులో చాలా గ్లామరస్‌గా ఉంటుంది.
Advertisement