ఆ సినిమాలు చూసి... కథక్ నేర్చుకున్నా!
రాఖీ, జల్సా, రెడీ, బొమ్మరిల్లు, నువ్వే, క్లాస్‌మేట్స్, నేనొక్కడినే చిత్రాలతో నటునిగా మంచి పేరు తెచ్చుకున్న రవివర్మ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ‘కాలింగ్ బెల్’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చి పెట్టిందని రవివర్మ అన్నారు. మరిన్ని విషయాలు పంచుకుంటూ, ‘‘చిన్నతనం నుంచి నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అందు లోనూ కమల్‌హాసన్, చిరంజీవి అంటే ఇంకా ఇష్టం.
కమల్ హాసన్ ‘సాగరసంగమం’, చిరంజీవి ‘అభిలాష’ చిత్రాలు చూసి స్కూల్లో ఉన్నప్పుడే కథక్ నేర్చుకున్నా. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేశా. ఇప్పటిదాకా 26 చిత్రాలలో నటించా. ప్రస్తుతం మహేశ్‌బాబు ‘శ్రీమంతుడు’, నాగచైతన్య ‘దోచేయ్’ , నారా రోహిత్ ‘అసుర’, పీవీపీ బ్యానర్‌లో ‘క్షణం’, శ్రీకాంత్ ‘హోప్’ చిత్రాలలో నటిస్తున్నా. వీటిలో చేస్తున్నన్నీ విభిన్న తరహా పాత్రలే’’ అన్నారు. ‘‘పాత్ర బాగుంటే ప్రతినాయకుడిగా చేయడానికీ రెడీ’’ అని రవివర్మ తెలిపారు.