శివగామితో కట్టప్ప రొమాన్స్‌.. ఫ్యాన్స్‌ షాక్‌! | Kattappa Romancing Sivagami In This Video | Sakshi
Sakshi News home page

శివగామితో కట్టప్ప రొమాన్స్‌.. ఫ్యాన్స్‌ షాక్‌!

Published Sat, May 6 2017 8:59 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

శివగామితో కట్టప్ప రొమాన్స్‌.. ఫ్యాన్స్‌ షాక్‌! - Sakshi

శివగామితో కట్టప్ప రొమాన్స్‌.. ఫ్యాన్స్‌ షాక్‌!

చెన్నై: రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి-2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. మాహిష్మతి సామ్రాజ్యం రాజమాత శివగామి పాత్రల్లో నటించిన రమ్యకృష్ణకు హీరోల స్థాయిలో పేరు వచ్చింది. ఇక రాణికి విశ్వాసపాత్రుడిగా, బానిసగా కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్‌కు కూడా మంచి మార్కులు పడ్డాయి. కట్టప్ప.. బాహుబలిని ఎందుకు చంపాడని ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రేక్షకులకు సమాధానం దొరికింది. అయితే థియేటర్లలో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు మరో కొత్త ట్విస్ట్‌ ఎదురైంది..!

సినిమా విరామంలో స్నాక్స్‌, డ్రింక్స్‌ తీసుకుని థియేటర్లలోకి వచ్చిన ప్రేక్షకులు తెరపై కనిపిస్తున్న దృశ్యం చూసి షాకయ్యారు. శివగామి (రమ్యకృష్ణ) పక్కన కట్టప్ప (సత్యరాజ్) కూర్చుని రొమాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఇదేంటి రాజమాతతో బానిస ఇంత చనువుగా ఉండటం ఏంటి? అంటూ ప్రేక్షకులు అయోమయానికి గురయ్యారు. కాసేపు ఏమీ అర్థం కాలేదు. కట్టప్ప ఓ చీరను శివగామికి కానుకగా ఇవ్వగా ఆమె తీసుకుని మురిసిపోతోంది. ప్రేక్షకులు అయోమయంలో ఉండగానే ఇది పోతిస్‌ యాడ్‌ అంటూ తెరపై కనిపిస్తుంది. ఇది వ్యాపార ప్రకటన అని తెలిశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.  

దేశ వ్యాప్తంగా బాహుబలికి ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి పాపులర్‌ టెక్స్‌టైల్‌ బ్రాండ్‌ కోసం రమ్యకృష్ణ, సత్యరాజ్‌లతో యాడ్‌ రూపొందించారు. ఇందులో వీరిద్దరూ రాజు, రాణిగా కనిపిస్తారు. రమకృష్ణ బాహుబలి సినిమాలో మాదిరిగా అదే వేషధారణతో కనిపించగా, సత్యరాజ్‌ మాత్రం ఈ సినిమాలో పాత్రకు భిన్నంగా బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి రాచఠీవిలో కనిపిస్తాడు. మొత్తానికి ఈ యాడ్‌ చూసిన ప్రేక్షకులు అయోమయానికి గురికావడంతో పాటు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement