
'కత్తి'తో దూసుకొస్తున్న చిరంజీవి
హైదరాబాద్ : మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చేస్తున్న తరుణం ఆసన్నమైంది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. చిరంజీవి 150 సినిమాపై స్పష్టత వచ్చేసింది. 'కత్తి' పట్టేందుకు చిరంజీవి రెడీ అవుతున్నారు. తమిళంలో విజయ్ హీరోగా నటించిన 'కత్తి' సినిమా రీమేక్లో చిరంజీవి నటించబోతున్నాడు. ఈ చిత్రానికి వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
చిరంజీవి 150వ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తాడాని అందరూ అనుకున్నారు. దానిపై పూరీ కూడా బుధవారం తన ట్విట్టర్ ఖాతాలో... చిరు 150 సినిమాకు డైరెక్ట్ చేసే హక్కు తనకే ఉందంటూ ట్విట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పూరీ ...చిరంజీవి కథ చెప్పేశాడు కూడా. అయితే మొదటి పార్ట్ ఓకే అన్న చిరు...రెండో పార్ట్ విషయంలో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
తీరా సీన్ మారింది. పూరీ ప్లేస్ను వివి వినాయక్ కొట్టేశాడు. చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ వినాయక్కు దక్కింది. గతంలో చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రానికి కూడా వినాయక్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
కాగా చిరంజీవి తన 150 సినిమాకు రీమేక్నే నమ్ముకున్నాడు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ వద్దన్న కథను చిరు ఎందుకు ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాతో మళ్లీ ఏదైనా సందేశం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడా? కత్తి సినిమాలో చిరంజీవికి నచ్చిందేమిటి? అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాఫిక్గా మారింది.