కలెక‌్షన్లు కొల్లగొట్టిన ఖైదీ నం.150
కలెక‌్షన్లు కొల్లగొట్టిన ఖైదీ నం.150
Published Fri, Jan 13 2017 9:43 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
చిత్ర దర్శకుడు వీవీ వినాయక్
కొవ్వూరు రూరల్ (కొవ్వూరు) :
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నం.150 సినిమా కలెక‌్షన్ల రికార్డులు సృష్టిస్తోందని ఆ చిత్ర దర్శకుడు వీవీ వినాయక్ తెలిపారు. సినిమా విజయవంతమైన సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని స్వగ్రామం చాగల్లు వచ్చిన ఆయన కొవ్వూరులో చిరంజీవి అభిమానులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్ర, అమెరికా వంటి ప్రాంతాల్లోని తెలుగువారు చిరుపై తమ అభిమానాన్ని వెల్లువలా చూపిస్తున్నారని అన్నారు. సినిమా విజయవంతం తనకు, తన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నిజమైన సంక్రాంతి పండుగ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభిమానులకు రుణపడి ఉంటానన్నారు. భోగి ముందు రోజు, భోగి రోజు సినిమా థియేటర్లలో కలెక‌్షన్‌లు తగ్గుతాయని, అయితే తమ సినిమా భోగి ముందు రోజు తెలంగాణాలో 2.50 కోట్లు షేర్ వసూలు చేసిందన్నారు. అలాగే రూ.4.50 కోట్ల గ్రాస్ కలెక‌్షన్ సాధించి రికార్డు సృష్టించిందన్నారు. ముఖ్యంగా సినిమా మహిళలను బాగా అకట్టుకుందన్నారు. ప్రేక్షకుల అభిమానం ఉన్నంత వరకూ మరిన్ని మంచి సినిమాలకు దర్శకత్వం చేస్తానని, 150వ చిత్రం దర్శకత్వం అవకాశాన్ని తనకిచ్చిన మెగాస్టార్ చిరంజీవి, చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌కు తన కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమండ్రి సిటీ వైడ్, కొవ్వూరు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు కొత్తపేట రాజా, గంటా చిరంజీవి పాల్గొన్నారు.
Advertisement
Advertisement