కీరవాణి
యన్.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం ‘యన్.టి.ఆర్ : కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు.
► సాధారణంగా హీరోస్‌ని లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్‌తో చూపిస్తాం. యన్.టి. రామారావుని ఎలా చూపించారు?
ఎగ్జాగిరేషన్ లేకుండా మామూలుగా చూపించాం. ఆయన జీవితం గురించి చెప్పాలంటే 30 గంటలు సినిమా తీసుండాలి.
► సంగీత దర్శకుడిగా ఈ సినిమా ఓ చాలెంజ్ అనుకోవచ్చా?
కాదు.. ఎంజాయబుల్. చాలెంజింగ్ అనే పదాన్ని ‘చెత్త సినిమా’కు సంగీతం ఇచ్చినప్పుడు వాడుతుంటాను. మనసుకి నచ్చిన సబ్జెక్ట్స్ చేయడం ఎప్పుడూ చాలెంజ్ కాదు. అలాగే ఇప్పుడు ‘చాలెంజ్‌లు’ స్వీకరించడం మానేశాను.
► ఆ ఉద్దేశంతోనే ఆ మధ్య ‘చెత్త దర్శకులతో పని చేశాను’ అని ట్వీట్ చేశారా? అప్పుడు అలాంటి చాలెంజింగ్ సినిమాలు చేసి ఇప్పుడు ఎందుకు విమర్శించారు?
వయసులో ఉన్నప్పుడు చాలా పనులు చేస్తాం. వయసు అయిపోయిన తర్వాత చేయలేం. వయసులో ఉన్నప్పుడు 20 పకోడీలు తింటాం. కానీ వయసైపోయాక తినలేం. అలాంటిదే ఇది కూడా. అలా అని ఆ సినిమాలు చేశానని రిగ్రెట్ అవ్వడం లేదు.
► మన అభిప్రాయాలను మనసులో దాచుకోవాలి. లేదా మాటలకు ఫిల్టర్ వేసుకుని మాట్లాడాలంటారు ఇండస్ట్రీలో..
నా అభిప్రాయాలను బహిరంగంగా చెప్పినా కూడా ఫలానా వ్యక్తి అని చెప్పలేదు కదా. సుబ్బారావు, పుల్లారావు అని పేరు పెట్టి విమర్శించలేదు కదా. సరదాగా ఓ విలేకరి ‘ఈ ప్రాంతంలో సగం మంది మూర్ఖులు అన్నాడట. దాంతో ఒకతను ఇలా అంటావా? మాట వెనక్కి తీసుకో అన్నారట. దానికి అతను ‘సగం మంది మూర్ఖులు కాదు’ అన్నాడట. ఆ సగం మంది ఎవరని ఎవరికీ తెలియదు. వాళ్లకు వాళ్లే ఆలోచించుకోవాలి.
► ‘ఇక రిటైర్ అవుతున్నా’ అని గతంలో ప్రకటించారు. మనసు మార్చుకున్నారా?
మనసు ఇప్పుడూ మార్చుకోలేదు. రిటైర్ అయిపోయినట్టే. కానీ ‘చాలెంజింగ్’ సినిమాల నుంచి మాత్రమే. పకోడీలు తినడం లేదు. పెరుగన్నం తింటున్నా.
► మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ మీరు గమనిస్తే పాట పాటలానే ఉందా? స్టాండర్డ్ అలానే ఉందా?
పాటకు పల్లవి ప్రాణం. అప్పుడూ.. ఇప్పుడూ. సో అలానే ఉన్నట్టే. పాట నిడివి 3 నుంచి 5 నిమిషాలు. అది ఉంటే ఉన్నట్టే. సాహిత్యం, సింగర్ ఉన్నారా? వాళ్లు ఉంటే ఉన్నట్లే. స్టాండర్డ్ విషయానికి వస్తే ఈ డిబేట్ అప్పుడు కూడా ఉంది. సో స్టాండర్డ్ మారలేదు అంటాను. పాట చెక్కు చెదరకుండా అలానే ఉంది.
► మీకు రీప్లేస్‌మెంట్ ఎవ్వరూ రాలేదంటాం. ఏమంటారు?
ఆప్షన్ లేదని మీరంటారు. అది మీ భావం. దాసరిగారో పాట రాశారు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము...’ అని. ఎవరి వల్లా జీవితం ఆగదు. భర్త చనిపోయిన స్త్రీని చూసి ఆయన లోటు తీరనిది అని అంటాం. భర్త చనిపోతే భార్య సతీసహగమనం చేసుకోవాలా? అలా చేయడం తప్పు. తీరని లోటని చచ్చిపోమంటామా? బతికుండమంటావా? వాస్తవాన్ని అంగీకరించమంటాం. ప్రత్యామ్నాయం చూసుకోవాలంటాం కదా. ఇది కూడా అంతే. మీకు రీప్లేస్‌మెంట్ లేదనేది అపోహ అంటాను. ఎందరో వస్తున్నారు కదా.
► కానీ క్వాలిటీలో తేడాలుంటాయి కదా?
దీన్ని కూడా ఏకీభవించను. మీకు ఫలనా రెస్టారెంట్‌లో బిర్యానీ నచ్చొచ్చు. నాకు వేరే హోటల్లో పూరీ నచ్చొచ్చు. కళలకు, సైన్స్‌కు తేడా అదే. లెక్కలు, సైన్స్‌లో వందకు వంద మార్కులు సాధించొచ్చు. కానీ తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌లో వేయరు. అవి ఆర్ట్స్. ఆ తేడాను అలా నిర్ణయించి పెట్టారు. చరిత్రకారులు కూడా చరిత్రను ఒక్కో దృష్టితో చెబుతారు. కొలమానం లేనప్పుడు రీప్లేస్‌మెంట్, పోలికలు ఉండవు. పని జరుగుతూ ఉంటుంది.
► మ్యూజిక్‌లో మీరు చూసిన మార్పేంటి?
ఇది వరకు రికార్డింగ్ అంటే ఓ స్టూడియోలో పేద్ద రికార్డింగ్ ల్యాబ్. ఒక ఇంజనీర్, స్టాఫ్. లోపలకు అడుగుపెడితే సెపరేట్ గదులు, మెషినరీ చాలానే ఉండేవి. ఆరోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు.. ఫలనా హోటల్‌లో ఫలనా రూమ్ నెంబర్‌లో కంపోజింగ్ అంటారు. పక్క గదిలో ఏదో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. మరో గదిలో మరోటి.. మరోటి... వీటి మధ్యలో రికార్డింగ్. అక్కడో మైక్ ఉంటుంది. పాడి వెళ్లిపోవడమే. అప్పటికీ ఇప్పటికీ నేను గమనించిన అతి పెద్ద మార్పు అదే. అప్పటికి అది నచ్చింది. ఇప్పుడు ఇది నచ్చింది. నచ్చింది కాబట్టే ఇంకా మ్యూజిక్ చేయగలుగుతున్నాను.
► ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్లో పాటలెన్ని ఉన్నాయి?
ఫస్ట్ పార్ట్‌లో నాలుగు, సెకండ్ పార్ట్‌లో నాలుగున్నాయి.
► ఈ సినిమాకి పాటలివ్వడంపై మీ అనుభూతి?
రామారావుగారి మీద నాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన సినిమాకు నన్ను సంగీతం చేయమనడాన్ని గర్వంగా ఫీల్ అవుతాను.
Comments
Please login to add a commentAdd a comment