Khaidi Movie Review, in Telugu | Rating (3/5) | ‘ఖైదీ’ మూవీ రివ్యూ | Karthi - Sakshi
Sakshi News home page

‘ఖైదీ’ మూవీ రివ్యూ

Published Fri, Oct 25 2019 5:42 PM | Last Updated on Wed, Dec 25 2019 2:48 PM

Khaidi Telugu Movie Review, Rating - Sakshi

మూవీ : ఖైదీ
జానర్‌ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : కార్తీ, నరైన్‌, రమణ, జార్జ్‌ మార్యన్‌ తదితరులు
ఎడిటింగ్‌ : ఫిలోమన్‌ రాజు
సంగీతం : సామ్‌ సీఎస్‌
డైరెక్టర్‌ : లోకేశ్‌ కనగరాజ్‌
నిర్మాతలు : ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌


విభిన్న కథలను ఎంచుకోవడంలో కోలీవుడ్‌ యాంగ్రీ హీరో కార్తీ ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చినబాబు, ఖాకీ వంటి సినిమాలు మంచి టాక్‌ సొంతం చేసుకున్నప్పటికీ కమర్షియల్‌ హిట్‌ను సాధించలేకపోయాయి. అనంతరం ‍కమర్షియల్‌ హంగులతో వచ్చిన ‘దేవ్‌’  ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకుని తెలుగు సూపర్‌ హిట్‌ టైటిల్‌ ‘ఖైదీ’తో థియేటర్‌ తలుపులు తట్టాడు కార్తీ. ఖైదీ అనగానే తెలుగు ప్రేక్షకుల అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. మరి కార్తీ ఖైదీ ప్రేక్షకుల అంచనాలను అందుకున్నాయా? చాలా కాలం తర్వాత కార్తీ కమర్షియల్‌ హిట్‌ సాధించాడా? హీరోయిన్‌, కామెడీ, రొమాన్స్‌ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారా? చూద్దాం. 

కథ: 
80 కిలోమీటర్లు.. నాలుగు గంటలు.. పదేళ్ల నిరీక్షణ.. చావుకు దగ్గరగా.. ఆశకు దూరంగా ఇది దిల్లీ(కార్తీ) పరిస్థితి. పదేళ్ల జైలు శిక్ష అనంతరం తన బిడ్డను చూడటానికి ప్రయాణం మొదలు పెట్టిన దిల్లీ అనుకోకుండా పోలీస్‌ ఆఫీసర్‌ బిజయ్‌(నరైన్‌)కు సహాయం చేయాల్సి వస్తుంది. బిజయ్‌తో సహా మరో నలుగురు పోలీస్‌ ఆఫీసర్లను చంపడానికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. అంతేకాకుండా ఈ ఐదుగురు పోలీసులతో పాటు పెను ప్రమాదంలో ఉన్న మరో నలుగురు యువకులు, ఓ యువతిని కాపాడాల్సిన బాధ్యత దిల్లీపై ఉంటుంది. అసలు ఆ ముఠా బిజయ్‌పై, పోలీస్‌ స్టేషన్‌పై ఎందుకు దాడి చేశారు? వందలమంది శత్రు సైన్యంతో పోరాడి దిల్లీ వారిని కాపాడాడా? చివరకు తన బిడ్డను కలుసుకున్నాడా? అనేదే మిగతా కథ.    


నటీనటులు: 
ఎప్పుడూ ప్రయోగాత్మకమైన, మంచి కథలను ఎంచుకునే కార్తీ. ఈ సారి కూడా ఓ విభిన్న కథాంశాన్ని ఎంచుకున్నాడు. పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెప్పించాడు. సినిమా మొత్తం మాసిన గడ్డం, లుంగీతో రఫ్‌ లుక్‌లో కనిపిస్తాడు. ఇక యాక్షన్‌ సీన్లలో మనం వేలు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు తన బిడ్డను చూడటానికి అతడు పడే తాపత్రయం, కొన్ని ఎమోషన్‌ సీన్లు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి. ఇక కార్తీతో పాటు నరైన్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఒదిగిపోయాడు. కానిస్టేబుల్‌ పాత్రతో పాటు కార్తీ, నరైన్‌లతో సినిమా మొత్తం కనిపించే కుర్రాడు ఆకట్టుకున్నాడు. ఆ కుర్రాడితో కార్తీ అక్కడక్కడా చేసే కామెడీ పండింది. చాలాకాలం తర్వాత తెరమీద కనిపించిన రమణ.. విలన్‌ పాత్రలో జీవించాడు. ఇక మిగతా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.  


విశ్లేషణ:  
చాలా కాలంగా కమర్షియల్‌ హిట్‌ లేని కార్తీ ఈ కథను ఓకే చేసి రిస్క్‌ చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ, హీరోయిన్‌, రొమాన్స్, పాటలు లేకుండా కమర్షియల్‌ హిట్‌ సాధించడం సాధ్యం కాదు. అయితే హాలీవుడ్‌లో ఇలాంటి సినిమాలు మంచి సక్సెస్‌ సాధించాయి. దీంతో ప్రయోగాత్మకంగా యువ దర్శకుడు లోకేశ్‌ను, కథను పూర్తిగా నమ్మి కార్తీ ఈ చిత్రానికి ఓకే చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటివరకు షార్ట్‌ ఫిలిమ్స్‌తో మంచి క్రేజ్‌ తెచ్చుకొని.. సందీప్‌ కిషన్‌తో ‘మానగరం’వంటి హిట్‌ సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్‌ ఈ సినిమాను పూర్తిగా తన భుజస్కందాలపై మోశాడు. 

ఒక రోజు రాత్రి నాలుగు గంటలు జరిగే ప్రయాణానికి సస్సెన్స్‌, థ్రిల్స్‌ను జోడించి కథ, కథనాన్ని ముందుకు నడిపించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. తను అనుకున్న కథను ఎక్కడా డీవియేట్‌ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలాంటి కథలకు స్క్రీన్‌ ప్లే ముఖ్యం. దీంతో పక్కాగా స్క్రీన్‌ప్లేను ప్రజెంట్‌ చేయడంలో డైరెక్టర్‌ విజయవంతమయ్యాడు. ఫస్టాఫ్‌లో కొంచెం సాగదీసినట్లు అనిపించినా.. ఆ లోపాన్ని సెకండాఫ్‌లో కవర్‌ చేశారు. అయితే కొన్ని చోట్ల ఎమోషన్స్‌ పండించడంలో దర్శకుడు తడబడ్డాడు. ఎక్కడా సీన్లు అతికించినట్టు కాకుండా కథలో ప్రేక్షకులు లీనమయ్యేలా ప్రజంట్‌ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. ఇక రెండు ప్రదేశాల్లో జరిగే యాక్షన్‌ సీన్స్‌ను ఎలాంటి గందరగోళానికి గురికాకుండా తెరపై చక్కగా చూపించారు. 

ఇక సినిమా రాత్రి పూట జరిగే కథ. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ మెచ్చుకునేలా ఉంది. పాటలు లేనప్పటికీ కథనానికి తగినట్లు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అక్కడక్కడా మెరుపులు మెరిపిస్తుంది. ఫైట్‌ మాస్టర్స్‌ కొత్త యాక్షన్‌ సీన్స్‌ను చూపించే ప్రయత్నం చేశారు. ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. ఇక క్లైమాక్స్‌లో దీపావళి ముందే వచ్చిందా అన్నట్లు తుపాకుల మోతతో సినిమా ముగుస్తుంది. 


ప్లస్‌ పాయింట్స్‌
కథ, కథనం
కార్తీ నటన
యాక్షన్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌
కమర్షియల్‌ విలువలు లేకపోవడం
కొన్ని చోట్ల సీన్ల సాగదీత

-  సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement