'కీ అండ్ కా' మూవీ రివ్యూ
టైటిల్ : కీ అండ్ కా
జానర్ : రొమాంటిక్ డ్రామా
తారాగణం : అర్జున్ కపూర్, కరీనా కపూర్, స్వరూప్ సంపత్
సంగీతం : ఇళయరాజా, మిథున్
దర్శకత్వం : ఆర్ బాల్కీ
నిర్మాత : ఈరోస్ ఇంటర్ నేషనల్
కమర్షియల్ మూస సినిమాలను పక్కన పెట్టి చీనికమ్, షమితాబ్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తున్న బాలీవుడ్ దర్శకుడు ఆర్ బాల్కీ, తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ డ్రామ కీ అండ్ కా. లడకీ లడకా అన్న పదాల నుంచి కీ, కా అనే అక్షరాలను ఈ సినిమాకు టైటిల్ గా తీసుకున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అన్న వాదాన్ని పక్కన పెట్టి, భర్త ఇంటి పని చేస్తూ, భార్య కెరీర్కు సాయపడటం అన్న కాన్సెప్ట్తో ఈ సినిమాను తెరకెక్కించారు. బాల్కీ డైరెక్షన్తో పాటు, అర్జున్, కరీనా కెమీస్ట్రీపై భారీ అంచనాలున్న కీ అండ్ కా రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకుందా..?
కథ :
తన స్వతంత్ర భావాలకు పెళ్లి అడ్డుకాకూడదని, కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకుంటుంది కియా(కరీనా కపూర్). అబ్బాయి, అమ్మాయి అన్న తేడా ఉండకూడదూ అందరూ సమానమే అన్న భావనలో ఉండే ఆధునిక యువకుడు కబీర్(అర్జున్ కపూర్). తన తండ్రి బిజినెస్ చూసుకోమని చెపుతున్నా అవి పట్టించుకోకుండా తన భార్యకు బదులుగా ఇంట్లో పనులన్ని చక్కపెట్టే బాధ్యతను తాను తీసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో కియాను చూసి ప్రేమలో పడతాడు. తాను భార్యను ఉద్యోగానికి పంపి తను ఇంటి పనులు చూసుకోవాలనుకుంటున్నానని చెపుతాడు. కబీర్ను పెళ్లి చేసుకుంటే తన కెరీర్కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో కియా పెళ్లికి అంగీకరిస్తుంది. కబీర్ తండ్రి ఒప్పుకోకపోయినా ఇద్దరు ఒక్కటవుతారు. పెళ్లి తరువాత కియా ఉద్యోగానికి వెళ్లటం, కబీర్ ఇంటి పనులు చేస్తుండటంతో కొంత మంది అభినందించినా, మరికొంత మంది మాత్రం విమర్శిస్తారు. అలా సాగిపోతున్న వారికి ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. ప్రశాంతంగా ఉన్న వారి జీవితాలను ఇబ్బందుల పాలు చేసిన ఆ సమస్య ఏంటి..? దాని నుంచి కియా, కబీర్లు ఎలా బయట పడ్డారు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
ఈ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది అర్జున్ కపూర్ గురించి. యంగ్ జనరేషన్ అంతా మాస్ ఇమేజ్ కోసం కష్టపడుతుంటే, ఓ డిఫరెంట్ క్యారెక్టర్ను ఎంచుకున్న అర్జున్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తన నటనతో కబీర్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. సీనియర్ హీరోయిన్ కరీనా కూడా అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. స్వతంత్ర భావాలున్న ఆధునిక మహిళగా తనదైన నటన కనబరించింది. ముఖ్యంగా పెళ్లి తరువాత కూడా రొమాంటిక్ సన్నివేశాలతో కుర్రకారు మనసు దోచుకుంది. అతిథి పాత్రల్లో కనిపించిన అమితాబ్, జయా బచ్చన్లు సినిమాకు మరింత గ్లామర్ తీసుకువచ్చారు.
సాంకేతిక నిపుణులు :
కెరీర్ స్టార్టింగ్ నుంచి సందేశాత్మక చిత్రాలనే తీస్తూ వస్తున్న ఆర్ బాల్కీ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాడు. అయితే మేసేజ్ ఓరియంటెడ్ సినిమాలను కమర్షియల్ ఎలిమెంట్స్తో తెరకెక్కించటం కత్తిమీద సాము లాంటింది. ఈ సినిమా విషయంలో కూడా కథ కథానాల పరంగా అంతా బాగానే ఉన్నా సాగదీసినట్టుగా అనిపించింది. సంగీతం కథానుగుణంగా చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం సినిమా రేంజ్ ను పెంచింది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
అర్జున్ కపూర్, కరీనా కపూర్
ఫస్ట్ హాఫ్ కామెడీ
సంగీతం
మైనస్ పాయింట్స్ :
సెకండ్ హాఫ్
స్లో నారేషన్
ఓవరల్గా కీ అండ్ కా ఓ సెక్షన్ ఆడియన్స్ను అలరించే డిఫరెంట్ మూవీ