ఆ కండిషన్‌తోనే పెళ్లి చేసుకున్నా: హీరోయిన్
బాలీవుడ్ సెలబ్రిటీ దంపతుల్లో మొదటి వరుసలో వినిపించే పేరు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీఖాన్. కొంతకాలంగా అన్యోన్యంగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తోంది ఈ జంట. అయితే తాజాగా తమ పెళ్లి గురించి ఆసక్తికరమైన సంగతిని కరీనా వెల్లడించింది. ఒకే ఒక కండిషన్‌తో తాను సైఫ్‌ను పెళ్లాడానని, తాను జీవితాంతం పనిచేస్తానని, అందుకు ఆయన మద్దతు ఇవ్వాలని కండిషన్ పెట్టానని, అందుకు సైఫ్ ఒప్పుకోవడంతో తాము ఆనందంగా పెళ్లి చేసుకున్నామని ఈ బ్యూటీ తెలిపింది.
క్రియేటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కి అండ్ కా' సినిమాలో కరీనా కెరీర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే మహిళ పాత్రలో కనిపిస్తుండగా.. ఆమె భర్తగా ఇంటిదగ్గరే ఉండి అన్ని పన్నులు చేసే హౌస్ హజ్బెండ్‌గా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా కరీనా విలేకరులతో మాట్లాడుతూ 'మహిళను భూమాతతో పోలుస్తారు. మహిళలకు అధిక శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. వాళ్లు ఎన్నో పనులను ఏకకాలంలో చక్కబెట్టగలరు' అంటూ కీర్తించింది.
ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతున్న 'కి అండ్ కా' సినిమా ట్రైలర్‌లో అర్జున్ కపూర్ మెడలో కరీనా తాళి కడుతూ కనిపించడం గమనార్హం. ఇలా భర్తకు భార్య తాళి కట్టడం గురించి కరీనాను అడిగితే.. 'ఇలాంటిదైతే గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా గొప్ప ఐడియా. (సినిమాలో) అతను తాళిని గర్వంగా ధరించడమే కాదు ఎంతో సెక్సీగా కూడా కనిపించాడు' అంటూ నవ్వులు రువ్వింది. అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.