Ki and Ka
-
ఆ సిన్మా తొలిరోజు కలెక్షన్లలో దుమ్మురేపింది!
ముంబై: అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన 'కి అండ్ కా' భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియోటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ తెరకెక్కించిన ఈ సినిమాపై రివ్యూలు పెదవి విరిచినప్పటికీ, కలెక్షన్లు మాత్రం అదరగొట్టేశాయి. తొలిరోజే ఈ సినిమా ఏడు కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదే. తొలిరోజు 40-50శాతం ఆక్యూపెన్సీతో ఈ సినిమా థియేటర్లు కళకళలాడాయి. మొదటి వీకెండ్లో ఈ ట్రెండ్ మరింతగా కొనసాగి.. ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్షన్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 'కి అండ్ కా'లో కబీర్‌గా అర్జున్, 'కియా' కరీనా నటించింది. ఈ సినిమాలో ఇంటి బాధ్యతలు చూసుకొనే భర్తగా అర్జున్, కెరీరే ముఖ్యమనుకునే దృక్పథంతో జాబ్ చేసే మహిళగా కరీనా నటించారు. ఇల్లాలిలా ఇంటి పనులు చూసుకొనే భర్త.. ఇంటి యాజమానిగా ఉద్యోగం చేసే భార్య కథతో న్యూ ఏజ్ సినిమాగా 'కి అండ్ కా'కు భారీ ప్రచారమే లభించింది. -
'కీ అండ్ కా' మూవీ రివ్యూ
టైటిల్ : కీ అండ్ కా జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : అర్జున్ కపూర్, కరీనా కపూర్, స్వరూప్ సంపత్ సంగీతం : ఇళయరాజా, మిథున్ దర్శకత్వం : ఆర్ బాల్కీ నిర్మాత : ఈరోస్ ఇంటర్ నేషనల్ కమర్షియల్ మూస సినిమాలను పక్కన పెట్టి చీనికమ్, షమితాబ్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తున్న బాలీవుడ్ దర్శకుడు ఆర్ బాల్కీ, తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ డ్రామ కీ అండ్ కా. లడకీ లడకా అన్న పదాల నుంచి కీ, కా అనే అక్షరాలను ఈ సినిమాకు టైటిల్ గా తీసుకున్నారు. ఉద్యోగం పురుష లక్షణం అన్న వాదాన్ని పక్కన పెట్టి, భర్త ఇంటి పని చేస్తూ, భార్య కెరీర్‌కు సాయపడటం అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. బాల్కీ డైరెక్షన్‌తో పాటు, అర్జున్, కరీనా కెమీస్ట్రీపై భారీ అంచనాలున్న కీ అండ్ కా రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకుందా..? కథ : తన స్వతంత్ర భావాలకు పెళ్లి అడ్డుకాకూడదని, కెరీర్లో ఎంతో ఎత్తుకు ఎదగాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకుంటుంది కియా(కరీనా కపూర్). అబ్బాయి, అమ్మాయి అన్న తేడా ఉండకూడదూ అందరూ సమానమే అన్న భావనలో ఉండే ఆధునిక యువకుడు కబీర్(అర్జున్ కపూర్). తన తండ్రి బిజినెస్ చూసుకోమని చెపుతున్నా అవి పట్టించుకోకుండా తన భార్యకు బదులుగా ఇంట్లో పనులన్ని చక్కపెట్టే బాధ్యతను తాను తీసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో కియాను చూసి ప్రేమలో పడతాడు. తాను భార్యను ఉద్యోగానికి పంపి తను ఇంటి పనులు చూసుకోవాలనుకుంటున్నానని చెపుతాడు. కబీర్‌ను పెళ్లి చేసుకుంటే తన కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో కియా పెళ్లికి అంగీకరిస్తుంది. కబీర్ తండ్రి ఒప్పుకోకపోయినా ఇద్దరు ఒక్కటవుతారు. పెళ్లి తరువాత కియా ఉద్యోగానికి వెళ్లటం, కబీర్ ఇంటి పనులు చేస్తుండటంతో కొంత మంది అభినందించినా, మరికొంత మంది మాత్రం విమర్శిస్తారు. అలా సాగిపోతున్న వారికి ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. ప్రశాంతంగా ఉన్న వారి జీవితాలను ఇబ్బందుల పాలు చేసిన ఆ సమస్య ఏంటి..? దాని నుంచి కియా, కబీర్లు ఎలా బయట పడ్డారు అన్నదే మిగతా కథ. నటీనటులు : ఈ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది అర్జున్ కపూర్ గురించి. యంగ్ జనరేషన్ అంతా మాస్ ఇమేజ్ కోసం కష్టపడుతుంటే, ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ను ఎంచుకున్న అర్జున్ అందరి దృష్టిని ఆకర్షించాడు. తన నటనతో కబీర్ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. సీనియర్ హీరోయిన్ కరీనా కూడా అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. స్వతంత్ర భావాలున్న ఆధునిక మహిళగా తనదైన నటన కనబరించింది. ముఖ్యంగా పెళ్లి తరువాత కూడా రొమాంటిక్ సన్నివేశాలతో కుర్రకారు మనసు దోచుకుంది. అతిథి పాత్రల్లో కనిపించిన అమితాబ్, జయా బచ్చన్లు సినిమాకు మరింత గ్లామర్ తీసుకువచ్చారు. సాంకేతిక నిపుణులు : కెరీర్ స్టార్టింగ్ నుంచి సందేశాత్మక చిత్రాలనే తీస్తూ వస్తున్న ఆర్ బాల్కీ మరోసారి అదే సాంప్రదాయాన్ని కొనసాగించాడు. అయితే మేసేజ్ ఓరియంటెడ్ సినిమాలను కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించటం కత్తిమీద సాము లాంటింది. ఈ సినిమా విషయంలో కూడా కథ కథానాల పరంగా అంతా బాగానే ఉన్నా సాగదీసినట్టుగా అనిపించింది. సంగీతం కథానుగుణంగా చాలా బాగా కుదిరింది. ముఖ్యంగా మ్యాస్ట్రో ఇళయరాజా అందించిన నేపథ్య సంగీతం సినిమా రేంజ్ ను పెంచింది. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఫస్ట్ హాఫ్ కామెడీ సంగీతం మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ స్లో నారేషన్ ఓవరల్‌గా కీ అండ్ కా ఓ సెక్షన్ ఆడియన్స్‌ను అలరించే డిఫరెంట్ మూవీ -
మిస్టర్ కరీనా
ఉద్యోగం పురుష లక్షణం అంటారా? అంటారా?! ఇంకో రకంగా కూడా ఉంటారా? ‘ఉంటారు’ అంటోంది కరీనా. లడకీలో ‘కీ’, లడకా లో ‘కా’ తీసుకుని ‘కీ అండ్ కా’ సినిమాలో... ‘ఉద్యోగం మహిళ లక్షణం’ అని ఈ నాయిక ప్రూవ్ చేసింది. ఇక మిగిలిందేంటి? ఓ సవాలు. ఓ ఛాలెంజ్. ఎవరికి? అబ్బాయిలకు! ఎక్కడ? ఇంట్లో... వంటింట్లో! మరి.. తెలుగు అబ్బాయిలు కూడా వంటలు, వగైరాలు చేసుకుంటూ మిస్టర్ భార్య చేతుల మీదుగా జీతం పుచ్చుకోగలరంటారా? చదవండి. కరీనాతో సాక్షి ‘ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. హాయ్ కరీనా... తెలుగు పత్రికకకు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం బహుశా మీకిదే మొదటిసారి అయ్యుంటుందేమో? అవును కరెక్టే. తెలుగులో మాత్రం మాట్లాడమని అడగొద్దు. నాకు ఒక్క ముక్క కూడా తెలియదు (నవ్వుతూ). ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తుంటారు కదా.. ఇక్కడి మీడియా మీకెలా అనిపిస్తుంది? వెరీ ఫ్రెండ్లీ. ఆల్మోస్ట్ అందరూ స్మైలీ ఫేస్‌తోనే ఉంటారు. అందుకే హైదరాబాద్‌లో ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే నాకు హుషారుగానే ఉంటుంది. ఇలా హిందీ సినిమాల ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చి, వెళ్లడం తప్ప తెలుగు సినిమాల్లో నటించరా ఏంటి? (నవ్వుతూ) సౌత్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. భాష తెలియకుండా నటించడం కష్టం. అందుకే ఒప్పుకోలేదు. మంచి మంచి అవకాశాలే వచ్చాయి. నార్త్ నుంచి ఎంతోమంది నాయికలు ఇక్కడ వెలిగిపోతున్నారు. వాళ్లకు కూడా భాష తెలియదు కదా? ఎవరి ఇష్టం వాళ్లది. నా మటుకు నాకు భాష తెలియకపోతే సరిగ్గా హావభావాలు పలికించలేను. మనం ఏం చెబుతున్నామో దాని అర్థం తెలియకపోతే ఎలా? అక్కడక్కడా ఏదో కొంత తెలుసుకుని నటించడం నా వల్ల కాదు. ఓకే.. హైదరాబాద్ గురించి నాలుగు మాటలు చెబుతారా? ఇది చాలా పెద్ద సిటీ. ముందుగా నాకు నచ్చింది అదే. షాపింగ్ ఏరియాలు రద్దీగా ఉన్నప్పటికీ.. మిగతా ఏరియాలు దాదాపు కూల్‌గానే ఉంటాయి. అందుకే నాకు ఇక్కడ షూటింగ్స్ చేయడం చాలా ఇష్టం. ముఖ్యంగా ఫలక్‌నుమా ప్యాలెస్‌ను చాలా ఇష్టపడతాను. నాయికగా 16 ఏళ్లుగా ఫిజిక్నెలా మెయిన్టైన్ చేస్తున్నారు? యోగా చేస్తాను. ఇంకా జిమ్‌లో వర్కవుట్స్ ఎలానూ ఉంటాయి. మన శరీరం బరువు పెరగడానికి ఓ కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడమే. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ మనం ఏ తీసుకున్నా టైమ్ ప్రకారమే తీసుకోవాలి. నేనలానే చేస్తాను. ఓకే.. ఏప్రిల్ 1న విడుదల కానున్న ‘కీ అండ్ కా’లో అర్జున్ కపూర్ హౌస్ హజ్బెండ్‌గా చేస్తే మీరేమో జాబ్ చేస్తారు. రియల్ లైఫ్‌లో ఇలా జరిగే అవకాశమే లేదు కదా? ఎందుకు లేదు? భార్యలు పని చేస్తుంటే ఇంటి పట్టున ఉండి, ఇంటిని చక్కదిద్దే భర్తలు ఉన్నారు. కాకపోతే ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడతారు. భార్యను ఉద్యోగానికి పంపి, భర్త ఇంట్లో ఉంటే... ఆ భర్త అందరికీ చులకనే. పైగా ఏదైనా పార్టీకో, ఫంక్షన్‌కో వెళితే ‘మీ ఆయన ఏం చేస్తున్నాడు?’ అని అడుగుతారు కదా? అవును. లోయర్, మిడిల్, అప్పర్... ఏ క్లాస్‌కి చెందిన ఆడవాళ్లైనా ఈ ప్రశ్నను తప్పించుకోలేరు. భర్త చేసే ఉద్యోగాన్ని బట్టి భార్యకు విలువ ఇస్తారు. మన ఇండియాలోనే ఇలా ఉంటుంది. నాకు తెలిసి విదేశాల్లో అంతగా పట్టించుకోరు. ఇంటిపట్టున ఉండే ఆడవాళ్లను ‘మీరేం చేస్తారు?’ అనడిగితే.. ‘హౌస్ వైఫ్’ని అని చెప్పుకున్నంతగా ఈజీగా మగవాళ్లు ‘నేను హౌస్ హజ్బెండ్’ని అని చెప్పుకోలేరు. అదేదో కాని పని అన్నట్లుగా ఫీలైపోతారు. ‘మగవాళ్లు సంపాదించాలి. ఆడవాళ్లు ఇంటిని చక్కదిద్దుకోవాలి’ అన్న ఒకప్పటి కట్టుబాటు గురించి మీ అభిప్రాయం? ఆ కాలంలో నేను లేనందుకు ఆనందంగా ఉంది. మెల్లి మెల్లిగా మార్పు రావడం ఓ రిలీఫ్. ఉద్యోగం చేసే హక్కు ఆడవాళ్లకు కూడా ఉంటుంది. ఇవాళ ఆడవాళ్లు సాధించనది అంటూ ఏమీ లేదు. లింగభేదంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్నవాళ్లందరూ ఉద్యోగం చేసుకోవచ్చు. ఆడవాళ్లు ఇంటి గడప దాటితే సమస్యలు వస్తాయంటారు. మీ లాంటి డబ్బున్నవాళ్లకి కూడా సమస్యలు వస్తాయా? అఫ్కోర్స్... ఆడవాళ్ల సమస్యలకు స్థాయితో పని లేదు. ఎక్కడైనా ఉంటాయి. ఈ ప్రపంచంలో బలహీనులు ఎవరంటే అది ఆడవాళ్లే అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. అందుకే వాళ్లను ఇబ్బందుల పాలు చేయాలనుకుంటారు. వీలైతే తొక్కేయాలనుకుంటారు. దానికోసం మానసికంగా, శారీరకంగా వేధించడానికి వెనకాడరు. బాలీవుడ్లో పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయిగా మిమ్మల్ని వేధించే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే... మీరెలా ట్యాకిల్ చేస్తారు? మానసికంగా నేను చాలా బోల్డ్. మగవాళ్లను శారీరకంగా బలంగా, ఆడవాళ్లను మానసికంగా బలంగా ఆ భగవంతుడు సృష్టించాడన్నది నా నమ్మకం. మగవాళ్ల కన్నా మనకు మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ అని నా ఫీలింగ్. ఆ బలమే మనకు మంచి ఆయుధం. భయం భయంగా బతికే ఆడవాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి? ఆడపిల్లలా కాదు... పులిలా బతకండి. ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లండి. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరో వచ్చి సహాయం చేస్తారులే అని కాకుండా మనకు మనమే సహాయం చేసుకోవాలి. సూపర్... బాగా చెప్పారు... థ్యాంక్యూ.. మీరేదో అడిగారని ఆవేశంగా చెప్పేయలేదు. నిజంగా కూడా ఆడవాళ్లు అమాయకంగా బతికేయకూడదు. తెలివిగా ఉండాలి. ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అందుకే అందరూ చదువుకోవాలి. మీ పదహారేళ్ల సినీ జీవితం గురించి ఏం చెబుతారు? ఇది చాలా పెద్ద ప్రపంచం. పోటీ ఎక్కువ. తట్టుకుని నిలబడాలి. ప్రశంసలతో పాటు విమర్శలు వస్తాయి. ఎదుర్కోవాలి. మొదట్లో ఫెయిల్యూర్స్‌కి కంగారుపడేదాన్ని. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడిపోయేదాన్ని. రాను రానూ సమానంగా తీసుకోవడం మొదలుపెట్టాను. విమర్శలకు ఫీలవ్వడం లేదు. అంతకు ముందు ఏదనుకుంటే అది క్షణాల్లో జరిగిపోవాలనుకునేదాన్ని. ఈ 16 ఏళ్ల జీవితం ఓపిక నేర్పించింది. దాంతో లైఫ్ హ్యాపీగా ఉంది. 80 ఏళ్ల వయసు వరకూ నటించాలన్నది మీ డ్రీమ్ అని ఓ సందర్భంలో అన్నారు. కథానాయికలు నలభైలకు దగ్గరపడితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారక తప్పదు కదా? అలా ఎందుకు అంటున్నారు? హాలీవుడ్ మెరిల్ స్ట్రీప్‌ని తీసుకుందాం. ఆవిడ వయసిప్పుడు అరవై పైనే. మెరిల్ స్ట్రీప్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆమెను ఎవరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనరు. కథానాయిక అనే అంటారు. నేను కూడా ఆమెలానే నాయిక అనిపించుకోదగ్గ పాత్రలు ఎంచుకుంటాను. ముద్దు పేరు: బెబో పుట్టిన తేది: 1980 సెప్టెంబరు 21 పుట్టిన ఊరు: ముంబై తల్లిదండ్రులు: రణధీర్ కపూర్ (ప్రముఖ నటుడు), బబితా కపూర్ (ప్రముఖ నటి) ఎత్తు: ఐదు అడుగుల ఐదు అంగుళాలు కథానాయికగా మొదటి సినిమా: ‘రెఫ్యూజి’ (2000) అభిమాన నటీనటులు: సీనియర్ నటి నర్గిస్, సోదరి కరిష్మా కపూర్, షారుక్ ఖాన్ ఇష్టపడే ఫుడ్: చైనీస్, థాయ్, ఇటాలియన్ నచ్చే క్రీడ: స్విమ్మింగ్ ఇష్టపడే రంగులు: ఎరుపు, నలుపు ఫేవరెట్ హాలిడే స్పాట్స్: గోవా, లండన్ నచ్చే ఆభరణాలు: వజ్రాభరణాలు.. ముఖ్యంగా బ్రాస్లెట్ జీవితాశయం: లివ్ అండ్ లెట్ లివ్ అంటే... ‘కథానాయిక’ అనిపించుకోవడానికి ఏజ్‌తో పని లేదంటారా? ఓల్డేజ్‌లో గ్లామరస్ క్యారెక్టర్స్ చేయలేరుగా? కథానాయిక అంటే... కథకు కీలకంగా నిలిచే ఆడ పాత్ర అని అర్థం. గ్లామరస్‌గా కనిపిస్తేనే కథానాయిక అని కాదు. కథ నడిపించే దమ్మున్నవాళ్లను హీరో అనీ, ఆ పాత్ర తర్వాత కథ నడవడానికి కారణమయ్యే పాత్రను హీరోయిన్ అనీ అంటారు. సో... ఏజ్‌తో పని లేదు. మీ జవాబులు వింటుంటే ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అనిపిస్తోంది.. మీ ప్రశ్నలు కూడా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే బోల్డంత ఇష్టం. సినిమాలు మానేయాలనే ఊహను కూడా నేను భరించలేను. ఇంతకీ దక్షిణాది వంటకాల్లో మీకేది ఇష్టం? చెబితే నవ్వుతారేమో కానీ, నాకు ఇడ్లీలు ఉంటే చాలు. తెల్లటి చట్నీతో కలిపి అవి తింటుంటే భలేగా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఇడ్లీలు లాగించే వచ్చాను అసలు హైదరాబాద్‌లో దిగగానే బ్రేక్‌ఫాస్ట్ ఏం కావాలని నా స్టాఫ్ అడిగితే.. ఇడ్లీలు చాలన్నాను. మీ లాంటి నాజూకు నాయికలు మార్నింగ్ ఓట్స్, పండ్ల రసాలు, ఆమ్లెట్, ఎగ్ వైట్. ఇలా ఏవేవో తింటారు కదా..? నేను కూడా అవి తింటాను. కానీ, ఇడ్లీలు దొరికితే అవే తింటాను. నాకు డైట్ గురించి పెద్దగా పట్టింపు ఉండదు. అది సరే... తెలుగు సినిమాలు చూస్తుంటారా? అప్పుడప్పుడూ చూస్తుంటా. భాష తెలియదు కాబట్టి, డైలాగ్స్ అర్థంకావు. సినిమాథీమ్ అర్థం చేసుకోగలుగుతా. టాలీవుడ్లో మీ ఫ్రెండ్స్ లిస్ట్ చెబుతారా? మా సైఫ్‌కి మహేశ్, నమ్రతా శిరోద్కర్ మంచి ఫ్రెండ్స్. వాళ్లు మినహా పెద్దగా ఎవరూ తెలియదు. అప్పుడప్పుడూ తెలుగు సినిమాల సీడీలు వాళ్లు పంపిస్తుంటే, చూస్తాను. పెళ్లయ్యాక ముద్దు సీన్స్‌లో నటించనని, ‘కీ అండ్ కా’లో అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ చేసేశారు. మీ భర్త సైఫ్ ఏమీ అనలేదా? మీ విషయంలో ఆయనకు పొసెసివ్‌నెస్ ఉండదా? పొసెసివ్‌నెస్ ఎక్కువ. కానీ, నా మీద మాత్రమే అది. నాలో ఉన్న నటి మీద ఆయనకెలాంటి అభిప్రాయమూ ఉండదు. బాగాచేస్తే అభినందిస్తారు. అంతేతప్ప ‘ఫలానా పాత్రలు చేయొద్దు’ అని రూల్ పెట్టరు. అందుకే నచ్చిన పాత్రలు చేయగలుగుతున్నా. సినిమాకు ఏది అవసరమో అది చేయాలని తనకు తెలుసు. ట్రైలర్ బాగుందన్నారు. నాయికగా వెలిగిన మీ అత్తగారు షర్మిలా ఠాగూర్ గురించి..? మా అత్తగారు నేటి తరం మహిళ అనాలి. ఆమెది ఫార్వార్డ్ థింకింగ్. పెళ్లయ్యాక కూడా బిజీగా సినిమాలు చేశారు. ఇంటినీ, పిల్లలనూ బాగా చూసుకున్నారు. రోల్ మోడల్‌గా తీసుకోదగ్గ వ్యక్తి. ‘పని చేయాలి.. ఖాళీగా ఉండకూడదు’ అని నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఫైనల్లీ... మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నాది ప్రశాంత జీవితం. ఏ విషయానికీ టెన్షన్ పడను. ఇల్లు, సినిమాలు... ఈ రెండే నా ప్రపంచం. ఓవరాల్‌గా లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలన్నదే నా ఆశయం. - డి.జి. భవాని -
ఎవరి టాలెంట్ వారిదే...
ముంబై: ఇండస్ట్రీలో ఒకరిని మరొకరితో పోల్చడం మంచిది కాదని బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అభిప్రాయపడ్డాడు. ఎవరి టాలెంట్ వారిదేనని.. అందరూ ఎవరికి వారు చాలా భిన్నమని చెప్పాడు. ఒకరి నైపుణ్యాన్ని మరొకరితో పోల్చి చూడటం పై తనకు అంతగా నమ్మకం లేదన్నాడు. ప్రస్తుతం తాను చేస్తున్న పనిపై ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. తాను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నానంటున్నాడు ఈ యంగ్ హీరో. 'సినిమాలలో భిన్నమైన పాత్రలు చేశాను. ఇప్పుడు బుల్లితెరపై ప్రయోగాలకు సిద్ధం అవుతున్నాను. దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని అర్జున్ చెప్పుకొచ్చాడు. బాల్కీ దర్శకత్వం వహించిన తన లేటెస్ట్ 'కీ అండ్ కా' మూవీ ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నాడు. టీవీ, సినిమా లలో రెండు భిన్నమైనవే.. సినిమాలతో పోల్చితే టీవీ షో చేయడం కాస్త కష్టమని చెప్పాడు. -
'అప్పుడు టెన్త్ క్లాస్.. ఇప్పుడు ఆమెతోనే రొమాన్స్'
ముంబై: తన లేటెస్ట్ మూవీలో హీరోయిన్ కరీనా కపూర్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ సహజంగా రావడానికి కారణాలను బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ చెప్పాడు. కరీనాతో తనకు మంచి స్నేహం ఉందని, తామిద్దరం మంచి స్నేహితులం అయ్యామని అర్జున్ అంటున్నాడు. బాల్కీ దర్శకత్వంలో వస్తున్న తమ లేటెస్ట్ మూవీ 'కీ అండ్ కా'లో కరీనాతో రొమాన్స్ చేస్తున్నాను, కానీ ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు తనకు పదిహేనేళ్లు అని అర్జున్ తెలిపాడు. తాను టెన్త్ క్లాస్ చదువుతుండగానే, కరీనా 2000లో 'రెఫ్యూజీ'తో బాలీవుడ్ కి పరిచయం అయిందన్నాడు. ఆమెతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, కరీనా అద్బుతమైన నటి అంటూ పొగిడేశాడు. ఆమె ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు విద్యార్థిగా ఉన్న తాను ఇప్పుడు ఆమెతోనే కలిసి నటించడం చాలా బాగుందన్నాడు. 'సినిమాల్లోకి రాకముందు ఆమెను చాలాసార్లు కలిశాను. ఆమె అప్పుడు ఎలా ఉందో, ప్రస్తుతం అలాగే ఉంది' అని ఈ హీరో చెప్పుకొచ్చాడు. తాజాగా వినూత్న కథతో తెరకెక్కుతున్న చిత్రం 'కీ అండ్ కా'. ఇందులో అర్జున్ కపూర్ హౌస్ హస్బెండ్ గా నటిస్తున్నాడు. ఇందులో ఉద్యోగినిగా హీరోయిన్ కరీనా కపూర్ కనిపించనుంది. ఏప్రిల్ 1న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. -
ఆ కండిషన్‌తోనే పెళ్లి చేసుకున్నా: హీరోయిన్
బాలీవుడ్ సెలబ్రిటీ దంపతుల్లో మొదటి వరుసలో వినిపించే పేరు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీఖాన్. కొంతకాలంగా అన్యోన్యంగా ఉంటూ వైవాహిక జీవితాన్ని ఆనందిస్తోంది ఈ జంట. అయితే తాజాగా తమ పెళ్లి గురించి ఆసక్తికరమైన సంగతిని కరీనా వెల్లడించింది. ఒకే ఒక కండిషన్‌తో తాను సైఫ్‌ను పెళ్లాడానని, తాను జీవితాంతం పనిచేస్తానని, అందుకు ఆయన మద్దతు ఇవ్వాలని కండిషన్ పెట్టానని, అందుకు సైఫ్ ఒప్పుకోవడంతో తాము ఆనందంగా పెళ్లి చేసుకున్నామని ఈ బ్యూటీ తెలిపింది. క్రియేటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కి అండ్ కా' సినిమాలో కరీనా కెరీర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చే మహిళ పాత్రలో కనిపిస్తుండగా.. ఆమె భర్తగా ఇంటిదగ్గరే ఉండి అన్ని పన్నులు చేసే హౌస్ హజ్బెండ్‌గా అర్జున్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా కరీనా విలేకరులతో మాట్లాడుతూ 'మహిళను భూమాతతో పోలుస్తారు. మహిళలకు అధిక శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. వాళ్లు ఎన్నో పనులను ఏకకాలంలో చక్కబెట్టగలరు' అంటూ కీర్తించింది. ఇప్పటికే సినీ ప్రియుల్లో ఆసక్తి రేపుతున్న 'కి అండ్ కా' సినిమా ట్రైలర్లో అర్జున్ కపూర్ మెడలో కరీనా తాళి కడుతూ కనిపించడం గమనార్హం. ఇలా భర్తకు భార్య తాళి కట్టడం గురించి కరీనాను అడిగితే.. 'ఇలాంటిదైతే గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా గొప్ప ఐడియా. (సినిమాలో) అతను తాళిని గర్వంగా ధరించడమే కాదు ఎంతో సెక్సీగా కూడా కనిపించాడు' అంటూ నవ్వులు రువ్వింది. అమితాబ్ బచ్చన్, ఆయన భార్య జయాబచ్చన్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ముద్దుకు ఓకే అన్నాడు!
హీరో, హీరోయిన్ తెరపై రొమాన్స్ పండిస్తుంటే చూసేవాళ్లకి కనువిందుగా ఉంటుంది. ముఖ్యంగా కుర్రకారు ఇలాంటి సన్నివేశాలకు జై కొడతారు. త్వరలో విడుదల కానున్న ‘కి అండ్ కా’ అనే హిందీ చిత్రంలో అలాంటి కమనీయ దృశ్యం ఒకటుంది. విశేషం ఏంటంటే.. సయీఫ్ అలీఖాన్‌తో పెళ్లయ్యాక కరీనా కపూర్ పెదవి ముద్దు సన్నివేశంలో నటించిన చిత్రం ఇదే. సయీఫ్ను పెళ్లాడాక ‘ఇక ముద్దు సీన్స్‌లో నటించకూడదు అనుకుంటున్నా’ అని స్టేట్మెంట్ ఇచ్చిన కరీనా ఈ సినిమా కోసం తన నిర్ణయం మార్చుకున్నారు. ‘కి అండ్ కా’లో అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ చేసేశారు. దీని గురించి కరీనా మాట్లాడుతూ- ‘‘పెళ్లయిన కొత్తలో ఉండే భావోద్వేగాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ అవి పాత పడి పోతాయి. ఇంకాస్త అప్డేటెడ్గా, మరింత మెచ్యూర్డ్‌గా ఉండా లనుకుంటాం. అలా అనుకుని తీసుకున్న నిర్ణయంలో భాగం గానే నేనీ ముద్దు సీన్లో నటించాను. స్క్రిప్ట్‌లో మన క్యారెక్టర్ని ఫాలో కావాలి తప్పితే ‘అది చేయను... ఇది చేయను’ అనకూడదని నా అభిప్రాయం. ఈ చిత్రం ఓ భార్యా భర్తల మధ్య సాగుతుంది కాబట్టి ముద్దు సీన్లుంటాయని సయీఫ్కూ తెలుసు. అందుకే ఈ సీన్ చేయడానికి ఓకే అన్నాడు. దర్శకుడు చెప్పింది చేయాలని తనే చెబుతుంటాడు. ఆలాగే సయీఫ్ ఎవరితోనైనా లిప్‌లాక్ సీన్స్‌లో నటిస్తే నాకు అభ్యంతరం లేదు’’ అని చెప్పారు. -
నాలుగు రోజుల్లోనే 30 లక్షల మంది చూశారా!
బాలీవుడ్లో విభిన్న కథాంశంతో తెరకెక్కిన మూవీ 'కీ అండ్ కా'. మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ వారం మొదట్లో ఓ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఆ సాంగ్ థీమ్‌ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేసిన నాలుగు రోజుల్లోనే సంచలన రికార్డులు సృష్టించింది. కేవలం నాలుగు రోజుల్లోనే 30 లక్షల మంది యూట్యూబ్‌లో ఈ వీడియోను చూశారు. వినూత్నమైన కథతో తెరకెక్కుతున్న 'కీ అండ్ కా' లో అర్జున్ కపూర్, కరీనా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. హౌస్ హస్బెండ్‌గా అర్జున్ కపూర్ కనిపించనుండగా, ఉద్యోగినిగా హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తోంది. ఆర్ బాల్కీ కథను అందించడంతో పాటు స్వయంగా ఆయనే దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మూవీ ప్రమోషన్లో భాగంగా అర్జున్ కపూర్ ఆడవాళ్ల చెప్పులు వేసుకుని అదిరే స్టేప్పులు వేసి హంగామా చేశాడు. హై హీల్స్ చెప్పులు వేసుకుని కరీనాతో కలిసి అదిరే స్టెప్పులేసి మూవీకి మంచి హైప్ తీసుకొచ్చాడు. ఈ సాంగ్ ద్వారా మూవీ గురించి ప్రచారం చేస్తూ, ఆ మూవీలో మరిన్ని అంశాలు అలాగే ఉంటాయన్న ఆలోచనలు అభిమానుల అంచనాలను పెంచేస్తున్నాయి. హీరో ఆడవాళ్ల చెప్పులతో కనిపించే వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. రొటీన్ కు భిన్నంగా ఉండే స్టోరీ కావడంతో నేటి వరకు ఈ వీడియోను 30,71,312 యూట్యూబ్ లో వీక్షించారు. -
ఆడవాళ్ల చెప్పులతో హీరో స్టెప్పులు..
ముంబై : బాలీవుడ్ నటీనటులు తమ సినిమా ప్రమోషన్ల కోసం ఎదో ఒక వింత ప్రయోగాలు చేస్తుండటం కామన్ అయిపోయింది. ప్రమోషన్స్ లో భాగంగా గతంలో వచ్చిన డాన్స్ పే చాన్స్ మూవీ కోసం షాహిత్ కపూర్, జెనీలియా ఓ రాత్రి కారులో గడపటం అంటూ హంగామా చేశారు. 2010లో ఇది ఓ సెన్సెషన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తమ మూవీ ప్రమోషన్ కోసం తారలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వినూత్న కథతో తెరకెక్కుతున్న చిత్రం 'కీ అండ్ కా'. ఇందులో అర్జున్ కపూర్ హౌస్ హస్బెండ్ గా నటిస్తున్నాడు. ఇందులో ఉద్యోగినిగా హీరోయిన్ కరీనా కపూర్ కనిపించనుంది. ఇటీవల జరిగన మూవీ ప్రమోషన్లో భాగంగా అర్జున్ కపూర్ ఆడవాళ్లు ధరించే చెప్పులు వేసుకుని హంగామా చేశాడు. హై హీల్స్ చెప్పులు వేసుకుని కరీనాతో కలిసి స్టెప్పులేశాడు. మూవీలోనూ ఈ సాంగ్ ఉందని ప్రచారం చేస్తూ మరింతగా అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తోంది ఈ చిత్ర యూనిట్. ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ ను పోస్ట్ చేశాడు అర్జున్. హీరో ఆడవాళ్ల చెప్పులతో కనిపించే వీడియో సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. రొటీన్ కు భిన్నంగా ఉండే స్టోరీ కావడంతో ఇప్పటికే ఈ వీడియోను చాలా మంది యూట్యూబ్ లో వీక్షించారు. ఏది ఏమైతేనేం సినిమాకు మంచి హైప్ వచ్చేసింది. ఆర్ బాల్కీ కథను అందించడంతో పాట దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. Da new party anthems here #highheels @Mann_meetbros @asliyoyo @THEJAZDHAMI @TSeries @ErosNow https://t.co/X5dFZBWfOj pic.twitter.com/c76KvLn69i — Arjun Kapoor (@arjunk26) February 21, 2016 -
ముద్దు వద్దని నేనెప్పుడు అన్నా?
పెళ్లయిన తర్వాత ఇక తాను లిప్‌లాక్ సీన్లలో నటించేది లేదని ఎప్పుడు చెప్పానంటూ కరీనా కపూర్ ఆశ్చర్యపోతోంది. తాజాగా 'కి అండ్ క' సినిమాలో అర్జున్ కపూర్‌తో ఆమె పెదాలు కలిపిన పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి. దీంతో కరీనా తన 'నో ముద్దు' వ్రతాన్ని వదిలిపెట్టిందంటూ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిపై కరీనాను ప్రశ్నించగా.. తాను అసలు అలాంటి పాలసీ పెట్టుకున్నట్లుగా ఎక్కడి నుంచి వినిపించిందో మాత్రం తనకు తెలియదని స్పష్టం చేసింది. అసలు ఆన్‌స్క్రీన్ ముద్దు గురించి ఎందుకింత చర్చ, రచ్చ జరుగుతున్నాయో తనకు అర్థం కావట్లేదని సినిమా దర్శకుడు ఆర్.బాల్కి అన్నారు. ఈ సినిమాలో అర్జున్ కపూర్ ఇంట్లో ఉండే భర్తగా నటిస్తుండగా, కరీనా కపూర్ మాత్రం ఉద్యోగం చేసే మహిళగా చేస్తోంది. సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు.. ఆ కిస్సింగ్ సీన్‌ను మరోసారి చేయాలంటూ కరీనా, అర్జున్‌లను కోరారు. దాంతో కరీనా కాస్త చిరుకోపంతో బాల్కి వైపు చూసి.. 'మీరు నాకు విడాకులు ఇప్పించేలా ఉన్నారే' అంటూ వ్యాఖ్యానించింది. అలా చేస్తే ఇక తనకు పటౌడీల ఇంట్లోకి ప్రవేశం ఉండదని అర్జున్ అన్నాడు. అర్జున్ మంచి కిస్సర్ అని కితాబిచ్చిన కరీనా.. అతడి బుగ్గ మీద చిన్న ముద్దు పెట్టి వదిలేసింది. -
ముద్దు రద్దును వెనక్కి తీసుకున్న నటి!
‘‘పెళ్లయ్యాక నటన పరంగా కొన్ని హద్దులు పెట్టుకుంటే బాగుంటుంది. అందుకే నేను, మా ఆయన సైఫ్ అలీఖాన్ ముద్దు సీన్స్‌లో నటించకూడదని నిర్ణయించుకున్నాం’’ అని ఓ సందర్భంలో కరీనా కపూర్ పేర్కొన్నారు. కానీ, ముద్దు రద్దు అనే మాటను వెనక్కి తీసుకుని, అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ సీన్లో నటించారామె. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కి అండ్ క’. ఇందులో కబీర్ అనే యువకుడిగా అర్జున్ కపూర్, కియా అనే యువతిగా కరీనా నటించారు. వీళ్ల పాత్రల పేర్లలోంచి ‘కి’, ‘క’ని తీసుకుని ‘కి అండ్ క’ అని పెట్టారు. ఆర్. బాల్కీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భార్యాభర్తల అనుబంధం చుట్టూ సాగుతుంది. కథానుసారం లిప్ లాక్ ఉంటేనే బాగుంటుందని భావించిన కరీనా నటించారు. అర్జున్, కరీనాల లిప్ లాక్ లుక్‌ను వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. -
హాట్ హాట్ కరీనా.. అభిమానులు ఫిదా!
ముంబై: సాధారణంగా మగువలు ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే.. పురుషులు ఇట్టే ఫిదా అయిపోతారు. ఎరుపులోనే ఆ మెరుపు ఉంది. బాలీవుడ్ ప్రౌఢ సుందరి కరీనా కపూర్ ఖాన్ కూడా తాజాగా రెడ్ ఔట్‌ఫిట్స్‌తో ఫొటోషూట్ చేసి.. అభిమానుల హృదయాల్లో గుబులు రేపుతోంది. బార్సిలోనాలో కరీనా కపూర్ తాజా ఫొటోషూట్ చిత్రాలను ఆమె హెయిర్ స్టైలిస్ట్ పంపీ హన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. గాఢమైన ఎరుపు రంగు దుస్తుల్లో హాట్‌హాట్‌గా పోజిస్తూ ఈ ఫొటోల్లో కరీనా కనువిందు చేస్తోంది. 'బజరంగీ భాయ్‌జాన్' చిత్రంతో తన కరిష్మా తగ్గలేదని చాటిన కరీన తాజాగా 'కి అండ్ కా' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో వయసులో తనకన్నా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో జోడీ కట్టిన ఈ భామ తన అందచందాలు ఏమాత్రం తగ్గలేదని తాజా ఫొటోషూట్‌తో నిరూపించిందంటున్నారు బాలీవుడ్ జనాలు. -
ఓ పాట కోసం కరీనా సాహసం
ముంబయి: అసలే షూటింగ్.. ఎన్నో టేక్‌లు తీస్తేగానీ ఓ సీన్ అద్భుతంగా రాదు. ఇక పాట చిత్రీకరణ అయితే ఎన్నిసార్లు కట్.. యాక్షన్, కట్ యాక్షన్ అనాలో.. నిజంగానే అంత అద్భుతంగా రావడానికి ఓ దర్శకుడికి ఎంత ఓపిక ఉండాలో ఆ నటుడు, నటికి కూడా అంతే ఓపిక ఉండాలి. ఈ ఓపిక బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్‌కు కాస్త ఎక్కువననే ఈ విషయం వింటే తెలుస్తుంది. ఎందుకంటే ఆమె నటిస్తున్న చిత్రం 'కి అండ్ కా' లోని ఓ పాట కోసం ఏకంగా 32 కేజీల బరువైన వస్త్రాలను(లెహంగా) ధరించిందట. ఈ వస్త్రాలను ఆమెకు అత్యంత సన్నిహితుడు మిత్రుడు మనీశ్ మల్హోత్రా డిజైన్ చేశాడు. ఈ వస్త్రాలను ధరించి ప్రతికూల వాతావరణంలో రెండు రోజులు షూటింగ్లో పాల్గొంది. కరీనా కపూర్ ఏ చిత్రంలో నటించినా తప్పకుండా ఓసారి మాత్రం ఆ సినిమాలో లెహంగా ధరిస్తుంటుంది. ఇందుకోసం ఆమె స్వయంగా డిజైన్ చేయించుకుంటుంది. ఆ వస్త్రాల్లో మెరిసిపోయి ఫ్యాన్స్‌ను సంతోష పెట్టడం తనకు చాలా ఇష్టమని కూడా పలుమార్లు తెలిపింది. -
హౌస్ హస్బెండ్‌గా ఉంటే తప్పేంటి?
న్యూఢిల్లీ : మనం ఎక్కువగా హౌస్ వైఫ్ అనే పదాన్ని వింటుంటం కదా. మీ భార్య ఏం చేస్తుందంటే.. భర్తల నుంచి వచ్చే సమాధానం హౌస్ వైఫ్(గృహిణి). అయితే, ఇవేం పట్టించుకోకుండా హౌస్ హస్బెండ్‌గా ఉంటే తప్పేంటని బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ అంటున్నాడు. అర్జున్ ఇలా మాట్లాడుతున్నాడేంటి.. అసలు ఈ హీరోకి ఏమైంది.. ఎవరికీ తెలియకుండా అతడు పెళ్లి చేసుకున్నాడా ఏంటి.. అనే అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతాయి. 'చీనికమ్' దర్శకుడు ఆర్ బాల్కీ తీస్తున్న తాజా చిత్రం 'కీ అండ్ కా'లో అర్జున్‌కపూర్ హౌస్ హస్బెండ్ పాత్రలో కనిపించనున్నాడు. అతడికి జోడీగా బాలీవుడ్ 'బెబో' కరీనాకపూర్ నటిస్తున్న విషయం విదితమే. భార్య విజయానికి కృషి చేసేందుకు పూనుకున్న భర్తగా ఈ మూవీలో నటిస్తున్నాడు. బిగ్ బీ అమితాబ్ దంపతులు ఈ మూవీలో కనిపించనున్నారు. వారి కళ్లముందే పెరిగాను.. ఇప్పుడు వారితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నందుకు నేను చాలా అదృష్టవంతుడినని చెప్పుకొచ్చాడు. ఢిల్లీకి చెందిన దంపతుల చుట్టూ ఈ కథ అల్లుకుని ఉంటుంది. తర్వాతి తరం ఇలా ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటూ అర్జున్ చమత్కరించాడు. -
వెరైటీ టైటిల్‌తో కీ అండ్ కా '
కరీనా కపూర్ ఖాన్ తాజా చిత్రం ముంబై: బాలీవుడ్లో ఓ చిత్రమైన టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కబోతోంది. జెండర్ సమానత్వాన్ని ప్రబోధించే ఈ మూవీకి వెరైటీగా 'కీ అండ్ కా ' అని పేరుపెట్టారు దర్శకనిర్మాతలు. సినిమా విశేషాలను దర్శకుడు బాల్కీ వెల్లడించారు. హిందీలో భాషలో మనుషులతోపాటూ వస్తువులకు కూడా జెండర్ ఉందన్నారు. కానీ 'కీ అండ్ కా ' సినిమాకు లింవివక్ష లేదని, సినిమా స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రభోదిస్తుందని తెలిపారు. విరుద్ధభావాలు కల అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే కథతో రూపొందుతున్న ఈ రొమాంటిక్ మూవీ 2016 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. భార్యకు అన్నివిధాలా సహకరించే ప్రోగ్రెస్సివ్ భర్త పాత్రలో అర్జున్ కపూర్, జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో కెరియర్ ఓరియెంటెట్ లేడీ పాత్రలో కరీనా కపూర్ నటిస్తున్నారని చెప్పారు. మరోవైపు అర్జున్ కపూర్, కరీనాకపూర్ తొలిసారి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రధానపాత్రలో కనిపించనున్నారట. ఇంతకుముందు బాల్కి దర్శకత్వంలో చీనీ కం, పా, షమితాబ్ సినిమాల్లో నటించారు బిగ్ బి.