నిర్మాత కేఎస్ రామారావు
‘‘యాభై ఏళ్ల క్రితం నా మూవీ మేకింగ్ స్టైల్ ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అలాగే పని జరగనప్పుడు వచ్చే కోపం కూడా అలానే ఉంది. కానీ పని విషయంలో మాత్రం అంకిత భావం తగ్గలేదు. టెక్నికల్‌గా చాలా అడ్వాన్డ్స్ స్టేజ్‌కి వచ్చాం. సినిమా క్వాలిటీ పెరగడంతో మంచి సినిమాలు రావడానికి అవకాశాలు ఎక్కువయ్యాయి’’ అని నిర్మాత కేఎస్ రామారావు అన్నారు. ఐశ్వర్యారాజేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి: ది క్రికెటర్’. తమిళంలో రూపొందిన ‘కనా’ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. క్రియేటివ్ కమర్షియల్‌పై కేఎస్ రామారావు నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేఎస్. రామారావు చెప్పిన విశేషాలు.
► మా బ్యానర్‌లో రాబోతున్న మంచి సినిమా ‘కౌసల్య కృష్ణమూర్తి’. తమిళంలో విడుదలైన ‘కనా’ సినిమాను చూశాను. ఈ చిత్రాన్ని ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని ‘కౌసల్య కృష్ణమూర్తి’గా రీమేక్ చేశాం. తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన మంచి ఎమోషనల్ స్టోరీ. క్రికెట్ బేస్‌తో పాటు కంటెంట్ ఉన్న స్టోరీ. ఈ చిత్రం క్రికెట్ అభిమానులతోపాటు యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుంది. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లు భీమనేని తెరకెక్కించారు.
► ఒక సాధారణ రైతుబిడ్డగా పుట్టి ఇండియా క్రికెట్ టీమ్‌లో ఆడాలని కష్టపడే ఓ యువతి పాత్రలో ఐశ్వర్య నటించింది. ప్యారలల్‌గా రైతుసమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఐశ్వర్య రాజేష్ తండ్రి అమర్‌నాథ్ సీనియర్ హీరో. మన కమెడియన్ శ్రీలక్ష్మీ మేనకోడలు తను. వీరిద్దరి వారసత్వ నటన ఐశ్వర్యకు వచ్చింది. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు అద్భుతమైన పాత్ర చేశారు. శివ కార్తికేయన్, ‘వెన్నెల’ కిశోర్, కార్తీక్‌రాజు క్యారెక్టర్స్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. జూలై 2న ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను జరపబోతున్నాం. ఈ కార్యక్రమానికి విమెన్ టీమ్ ఇండియా కెప్టెన్‌గా చేసిన మిథాలీరాజ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొనున్నారు.
► పెద్దసినిమాలు చేస్తున్నప్పుడు ఎంత సంతృప్తిగా ఉంటానో ‘పుణ్యస్త్రీ, మాతృదేవోభవ, ముత్యమంత ముద్దు’ తీస్తున్నప్పుడూ అంతే సంతృప్తిగా ఫీలవుతాను. ఇవన్నీ కూడా సినిమాలపై ఇంకోవైపు నాకున్న ఇంట్రెస్ట్‌ను తెలియజేసే చిత్రాలు..‘కౌసల్య కృష్ణమూర్తి’ కూడా అలాంటిదే.
Comments
Please login to add a commentAdd a comment